డాలర్ కి మూడుతుందా... ట్రంప్ లో బ్రిక్స్ టెన్షన్ !

ఈ 20 శాతం పైగా వాణిజ్యం వాటాను బ్రిక్స్ దేశాలు కలిగి ఉన్నాయి. మరో వైపు చూసుకుంటే రష్యా చైనా ఇరాన్ ఇలాంటి దేశాలు అన్నీ భారత్ తో కలిసి ఒకే వేదిక పంచుకోవడంతో ఏమి జరిగిపోతుందో అన్న బెంగ అయితే ట్రంప్ కి పట్టుకుంది.

Update: 2026-09-11 14:29 GMT

భారత్ ఆతీధ్యంతో సెప్టెంబర్ 12, 13 తేదీలలో రెండు రోజుల పాటు న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ మీద అమెరికా ఫుల్ ఫోకస్ పెట్టేసింది. ట్రంప్ టెన్షన్ అయితే మామూలుగా లేదు. ఆయన ఏకంగా బ్రిక్స్ కూటమిని టార్గెట్ గా చేసుకుని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బ్రిక్స్ సదస్సులో ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారో అన్నది ట్రంప్ కి ఇపుడు పట్టుకుంది. మొత్తం ప్రపంచ జనాభాలో సగానికి సగం కలిగిన దేశాలన్నీ బ్రిక్స్ లో పాల్గొంటున్నాయి. అంతే కాదు మూడవ వంతు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే దేశాలు అన్నీ బ్రిక్స్ లో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. ఈ 20 శాతం పైగా వాణిజ్యం వాటాను బ్రిక్స్ దేశాలు కలిగి ఉన్నాయి. మరో వైపు చూసుకుంటే రష్యా చైనా ఇరాన్ ఇలాంటి దేశాలు అన్నీ భారత్ తో కలిసి ఒకే వేదిక పంచుకోవడంతో ఏమి జరిగిపోతుందో అన్న బెంగ అయితే ట్రంప్ కి పట్టుకుంది.

అమెరికా ఆధిపత్యం మీద :

అమెరికా పెద్దన్న తరహాలో ప్రపంచం మీద తన ప్రతాపం చూపిస్తోంది. ఇది ఇతర దేశాలతో పాటు పేద అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాల మీద కూడా గణనీయంగా ప్రభావం చూపిస్తోంది. ఇష్టం వచ్చినట్లుగా వాణిజ్య పన్నులను విధిస్తూ అమెరికా ఏకపక్షంగా రెచ్చిపోతున్న తీరుని అనేక దేశాలు తప్పు పడుతున్నాయి. అయితే తన డాలర్ తోనే ప్రపంచ వాణిజ్యాన్ని సవాల్ చేసే విధంగా అమెరికా చేస్తున్న అతి పోకడలు కూడా సర్వత్రా చర్చనీయాంశం అవుతున్నాయి. దాంతో బ్రిక్స్ సదస్సులో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయని చర్చ అయితే సాగుతోంది. ఇదే ఇపుడు అమెరికాను కలవరపెడుతోంది. దాంతో అమెరికా బ్రిక్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టేసింది. అంతే కాదు అంతర్జాతీయ సమాజం కూడా బ్రిక్స్ లో జరిగే పరిణామాలను పూర్తిగా గమనిస్తోంది. దాంతో ఎక్కడ లేని ప్రాధాన్యత బ్రిక్స్ సమ్మిట్ కి వచ్చింది.

ట్రంప్ హెచ్చరికల వెనక :

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ కూటమిని లక్ష్యంగా చేసుకుని తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు లేదా ప్రత్యామ్నాయ కరెన్సీని తీసుకువచ్చేందుకు బ్రిక్స్ దేశాలు ప్రయత్నిస్తే వాటిపై ఏకంగా వందకు వంద శాతం వాణిజ్య సుంకాలు విధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. భారతదేశంలో జరిగే బ్రిక్స్ వార్షిక శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ తాజా హెచ్చరికలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ట్రంప్ బ్రిక్స్ కూటమిని లక్ష్యంగా చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా డాలర్ ఆధిపత్య రక్షణ కోసం ట్రంప్ ఈ విధంగా వార్నింగులు ఇస్తున్నారు అని అంటున్నారు. బ్రిక్స్ కూటమిలోని రష్యా, చైనా వంటి దేశాలు అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ వినియోగాన్ని తగ్గించి తమ సొంత కరెన్సీలలో లేదా కొత్త ఉమ్మడి కరెన్సీ ద్వారా లావాదేవీలు జరపాలని ప్రయత్నిస్తున్నాయన్నది ఇపుడు అమెరికాను తెగ కలవరపెడుతోంది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ, డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని సృష్టించాలని చూస్తే ఆయా దేశాలు అమెరికా మార్కెట్‌కు గుడ్‌బై చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. అంతే కాదు అమెరికా డాలర్‌ను కాదని వేరే కరెన్సీని ప్రోత్సహిస్తే బ్రిక్స్ సభ్య దేశాల ఉత్పత్తులపై వంద శాతం పన్ను విధిస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్ వేదికగా చెప్పుకొచ్చారు.

అసలు ఎందుకీ ఉలికిపాటు :

నిజానికి బ్రిక్స్ దేశాల సమ్మిట్ విషయంలో అమెరికా ఉలికిపాటు ఎందుకు అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ ప్రపంచాన్ని ఏకధృవంగా చేసి పాలించాలని అమెరికా చూస్తోంది. తన మాటే శాసనం అన్న తీరున వ్యవహరిస్తోంది. ఇది ప్రపంచంలో అధిక శాతానికి నచ్చడం లేదు, తన తీరుని మార్చుకోవాల్సిన అమెరికా తగ్గక పోవడమే కాదు బ్రిక్స్ వంటి అంతర్జాతీయ సదస్సుల మీద పెద్ద ఎత్తున అసహనం వ్యక్తం చేస్తోంది. అంతే కాకుండా సదస్సు మొదలవకుండానే ఆంక్షలు విధిస్తోంది. హెచ్చరికలు జారీ చేస్తోంది. బ్రిక్స్ సమ్మిట్ లో అమెరికా వ్యతిరేక విధానాన్ని తీసుకుంటారు అని కూడా అనుమానిస్తోంది. అంతే కాదు బ్రిక్స్ ఎప్పటికప్పుడు విస్తరిస్తోంది. ఈ కూటమిలో ఇటీవల బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో పాటు ఇరాన్, యూఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా వంటి దేశాలను చేరాయి. అంటే . ప్రపంచ జనాభాలో దాదాపు సగం, ప్రపంచ జీడీపీలో 35 శాతం పైగా ఈ కూటమి పరిధిలోకి రావడంతో అమెరికాలో అసలైన కలవరం మొదలైంది అని అంటున్నారు. అందుకే బ్రిక్స్ ఆర్థిక వ్యూహాలపై నిఘా పెంచిందని అంతర్జాతీయ విశ్లేషణలు ఉన్నాయి. ఏది ఏమైనా బ్రిక్స్ సమ్మిట్ జరితే రెండు రోజులూ అమెరికాకు నిద్ర పట్టేలా కనిపించడం లేదని అంటున్నారు.

Tags:    

Similar News