విదేశీ ఐటీ బాబులకు ‘అమెరికా ఆఫర్’.. ఊడితే ఉద్యోగం కాదు.. డైరెక్ట్ ఊరే..
కానీ ఇప్పుడు మన ఆంకిల్ సామ్ అయిన అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) కి ఏమనుకుందో ఏమో గానీ ఆ 60 రోజుల వెసులుబాటును కూడా లాగేసుకోవాలని చూస్తోంది.
అమెరికా డ్రీమ్.. కలల ప్రపంచం.. అక్కడ డాలర్లు సంపాదించడం.. వారాంతాల్లో వీకెండ్ పార్టీలు చేసుకోవడం చూసి స్వదేశంలో ఉన్నవాళ్లు కుళ్ళుకోవడం సహజమే. కానీ అదే అమెరికాలో ఉద్యోగం ఊడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఇన్నాళ్లూ ఉద్యోగం పోయినా "పర్లేదులే బాస్.. ఇంకో 60 రోజులు టైమ్ ఉందిగా" అని రిలాక్స్ అవుతూ కొత్త ఉద్యోగం వెతుక్కునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు మన ఆంకిల్ సామ్ అయిన అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్ఎస్) కి ఏమనుకుందో ఏమో గానీ ఆ 60 రోజుల వెసులుబాటును కూడా లాగేసుకోవాలని చూస్తోంది.
60 రోజులా? అంత సీన్ లేదు పోండి!
డీహెచ్ఎస్ వారు తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన ప్రకారం.. "మీ ఉద్యోగం పోయిందా? అయితే తట్టాబుట్టా సర్దుకుని తక్షణమే మొదటి విమానం ఎక్కేయండి" అని స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ అంటే అమెరికా పెద్దలకు విపరీతమైన కోపం వచ్చినట్లుంది. ఉద్యోగం పోయిన మరుసటి క్షణమే మీ దగ్గర వేరే ఉద్యోగం లేకపోయినా లేదా లీగల్‌గా ఉండటానికి వేరే దారి లేకపోయినా.. ఇక అక్కడ క్షణం కూడా నిలబడటానికి వీల్లేదు.
ప్రభావం ఎవరి మీద? ఇంకెవరి మీద మనోళ్ల మీదే
ఈ దెబ్బ ముఖ్యంగా హెచ్1బీ, ఎల్-1, ఓ-1, టీఎన్ లాంటి వీసాలపై ఉన్న విదేశీ ఉద్యోగులకు.. వారిపై ఆధారపడి ఉన్న ఏ పాపం ఎరగని డిపెండెంట్లపై పడనుంది. అమెరికా టెక్ ప్రపంచంలో మన భారతీయులు, ముఖ్యంగా ఐటీ బాబులు ఎంత బిజీగా ఉంటారో తెలిసిందే. అకస్మాత్తుగా కంపెనీ లేఆఫ్ ప్రకటిస్తే.. "అయ్యో నా కారు ఈఎంఐ, ఇంటి అద్దె పరిస్థితి ఏంటి?" అని ఆలోచించే లోపే ఎయిర్‌పోర్ట్ బాట పట్టాల్సిన పరిస్థితి రాబోతోంది. ఇన్నాళ్లూ ఉద్యోగం పోతే కొత్త ప్రాజెక్ట్ వెతుక్కోవడానికి రెజ్యూమేలు పంపడానికి కనీసం సామాన్లు సర్దుకోవడానికి సమయం ఉండేది. ఇప్పుడు ఆ టైమ్ కూడా ఉండదు. ఉద్యోగం ఊడిన తెల్లారే బ్యాగులు ప్యాక్ చేసుకోవడమే!
ఇంకా ప్రతిపాదనే సుమా.. కంగారు పడకండి
అయితే ఐటీ మిత్రులారా.. కొద్దిగా ఊపిరి తీసుకోండి. ఇది ఇప్పటికప్పుడు అమల్లోకి వచ్చేసిన నిబంధన కాదు. కేవలం డీహెచ్ఎస్ ముద్దుగా పంపిన ఒక ప్రతిపాదన మాత్రమే. ఇది తుది నిబంధనగా మారాలంటే అమెరికా ప్రభుత్వ పెద్దల ఆమోదం, పబ్లిక్ కామెంట్లు, సుదీర్ఘమైన లీగల్ డ్రామాలు ఇంకా బాకీ ఉన్నాయి. అప్పటివరకు ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ పదిలంగానే ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉండండి.. కానీ ఎందుకైనా మంచిది మీ బ్యాగులను మాత్రం సర్దుకుని సిద్ధంగా ఉంచుకోవడం ఉత్తమం..