రేవంత్ మార్క్ పాలిటిక్స్.. బీఆర్ఎస్ పని అయిపోయినట్లేనా..?
తెలంగాణ రాజకీయ రంగస్థలంపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ మధ్య జరుగుతున్న పోరులో వ్యూహాల వేగం ఒక్కసారిగా పెరిగింది.
తెలంగాణ రాజకీయ రంగస్థలంపై అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బిఆర్ఎస్ మధ్య జరుగుతున్న పోరులో వ్యూహాల వేగం ఒక్కసారిగా పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న 'హై-వోల్టేజ్' పొలిటికల్ స్టైల్ ముందు గులాబీ దళం నిరంతరం డిఫెన్స్‌కే పరిమితమవుతోందనే చర్చ జోరందుకుంది. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజాసమస్యలపై కాంగ్రెస్ సర్కార్‌ను కార్నర్ చేయాల్సిన ప్రతిపక్షం.. రేవంత్ రెడ్డి క్రియేట్ చేస్తున్న రాజకీయ అజెండాను తట్టుకోవడానికే రోజంతా సరిపెట్టుకోవాల్సి రావడం ఇక్కడ గమనార్హం.
బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ మౌనం, క్షేత్రస్థాయి కి నేరుగా రాకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఒకరకమైన ఆందోళనను నింపుతోంది. కదనరంగంలో కేటీఆర్ ఒక్కరే నిలబడి పోరాటం నడుపుతున్నప్పటికీ, కేసీఆర్ స్థాయిలో రాజకీయ ఇంపాక్ట్ చూపించడంలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. ఈ నాయకత్వ అంతరాన్ని రేవంత్ రెడ్డి తెలివిగా వాడుకుంటున్నారు. కేటీఆర్‌ను రాజకీయంగా నిరంతరం టార్గెట్ చేస్తూ, బిఆర్ఎస్ అగ్రనాయకత్వం వేసే ప్రతి అడుగును స్వయంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన 'డైవర్షన్ అస్త్రం'గా మార్చుకోవడంలో ముఖ్యమంత్రి విజయం సాధిస్తున్నారు.
సెంటిమెంట్ కార్డ్స్.. రేవంత్ రివర్స్ ఎటాక్
ప్రతిపక్షం ఇచ్చే ప్రతి రాజకీయ లీడ్‌ను తనకే అనుకూలంగా తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. వ్యవస్థలపై దాడులు, దళిత వర్గాల ఆత్మగౌరవం వంటి సున్నితమైన అంశాలను తెరపైకి తెచ్చి బిఆర్ఎస్ దాడిని తిప్పికొడుతున్నారు. అంతేకాకుండా, విచారణల పేరుతో దర్యాప్తులను బిఆర్ఎస్ అగ్రనేతల దరిదాపుల్లోకి తీసుకెళ్లడం ద్వారా గులాబీ క్యాడర్‌ను తీవ్ర మానసిక ఒత్తిడిలోకి నెట్టగలిగారు. ప్రజా సమస్యలపై పోరాడే కన్నా, సొంత ఉనికిని కాపాడుకోవడమే బిఆర్ఎస్‌కు ఇప్పుడు ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది.
దశాబ్దానికి పైగా తెలంగాణను ఏలిన బిఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి తమ రాజకీయ మైండ్ గేమ్‌తో కోలుకోలేని దెబ్బ తీశారనేది స్పష్టమవుతోంది. అయితే, ఒక ప్రాంతీయ పార్టీగా బలమైన క్యాడర్ ఉన్న బిఆర్ఎస్ ఈ దెబ్బ నుంచి ఎలా పుంజుకుంటుందనేది ఆసక్తికరం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వచ్చే వ్యతిరేకతను బిఆర్ఎస్ ఎలా క్యాచ్ చేస్తుందనే దానిపైనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మరి ఇప్పటికైతే రేవంత్ మార్క్ రాజకీయ దాడి ముందు బిఆర్ఎస్ ఖేల్ ముగిసినట్లే కనిపిస్తున్నా, రాబోయే రోజుల్లో గులాబీ వ్యూహం ఎలా మారబోతుందనేది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.