పోతే పోనీ...వైసీపీ నిబ్బరానికి జోహారు !

మహా కవి శ్రీశ్రీ రాసిన ఒక కవితలోని కొన్ని పక్తులు వైసీపీని చూస్తే గుర్తుకు వస్తే ఆశ్చర్యం లేదనే అంటారు.

Update: 2026-09-11 03:43 GMT

మహా కవి శ్రీశ్రీ రాసిన ఒక కవితలోని కొన్ని పక్తులు వైసీపీని చూస్తే గుర్తుకు వస్తే ఆశ్చర్యం లేదనే అంటారు. పోనీ, పోనీ, పోతే పోనీ సతుల్‌ సుతుల్‌ హితుల్‌ పోనీపోతే పోనీ రానీ రానీ వస్తే రానీ కష్టాల్‌, నష్టాల్‌ కోపాల్‌ తాపాల్‌ శాపాల్‌ రానీ అని మహా కవి రాశారు. ఈ కవిత సారం ఏమిటి అంటే కష్టాలు నష్టాలు ఎన్ని అయినా ఎదురు కానీ వాటిని దాటి ముందుకు అడుగులు వేయమని చెప్పే చైతన్యవంతమైన గీతం. బహుశా ఈ గీతాసారం వైసీపీకి బాగా నచ్చి ఉంటుంది. వైసీపీ కూడా ఏ కష్టం ఎదురైనా ఏ నష్టం వచ్చి తలుపు తట్టినా కూడా చలించేది ఉండదని అంటారు. మహా కవి కవిత మాదిరిగా నిబ్బరంగా అలా ముందుకు సాగిపోతుంది. ఆ పార్టీ అదే తన మొత్తం ప్రస్థానంలో నేర్చుకుంది. అలాగే ఈ రోజుకీ ఉంది.

కీలక నేతలు జారినా :

వైసీపీ ఆవిర్భావం నుంచి ఎంతో మంది నాయకులు ఆ పార్టీలోకి వచ్చారు, వెళ్ళిపోయారు. ఎంతో మంది సెలిబ్రిటీలు చేరారు, వేనక్కి జారారు, పార్టీ పునాదుల నుంచి ఉన్న వారు, సొంత కుటుంబీకుల మాదిరిగా తరాలుగా ఉంటూ వచ్చిన వారు, ఇలా ఎంతో మంది వైసీపీకి బై బై చెప్పారు. దిగ్గజ నేతలు పోయినా వారి వల్ల ఆ జిల్లాలలో నష్టం వాటిల్లుతుందని తెల్సినా వైసీపీ తొణకలేదు, బెణకలేదు, ఉంటే ఉంచుకుంది, తనతో కలిసి నడవమంది, పోతే సరే అనుకుంది. ఇదే వైసీపీ పొలిటికల్ ఫిలాసఫీగా ఉంటూ వస్తోంది.

పోయిన వారే ఎక్కువగా :

వైసీపీ తీరే సెపరేట్ అనేట్లుగా ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఉంటాయని చర్చ కూడా సాగుతుంది. సాధారణంగా రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకోవాలని చూస్తాయి. వంద మంది ఉన్నా వారిని కాపాడుకుంటూ 101 కోసం వెంటాడుతాయి, వేటాడుతాయి. ఇక ఎవరైనా పార్టీలో అసంతృప్తితో ఉన్నారని తెలిస్తే వారికి బుజ్జగింపులు ఉంటాయి, రాయబారాలు ఉంటాయి, ఏదో ఒకటి చేసి తిరిగి విశ్వాసంలోకి తీసుకుంటాయి. నిజానికి కుటుంబంలోనూ అలాగే ఉంటుంది, మనస్పర్థలు అన్నవి సహజం. వాటిని చక్కదిద్దుకుంటూ పోతేనే అంతా కలిసి ఉంటారు, లేదు అనుకుంటే విడిపోతారు. అయితే వైసీపీ ఇలాంటి వాటికి దూరం అని చెబుతారు. ఎంతటి నాయకుడు వెళ్ళిపోయినా వైసీపీ పెద్దగా స్పందించదు అని అంటారు. వారికి ఇష్టం లేకపోతే కట్టి పడేసి ఉంచగలమా అన్నది వైసీపీ ఆలోచనగా చెబుతారు. ఇది కూడా కరెక్టే అనుకున్నా ప్రాధమికంగా చేయాల్సినవి ఉంటాయి కదా అనుకున్నా వైసీపీ వరకూ చూస్తే అలాంటి ట్రెడిషనల్ పాలిటిక్స్ ని నమ్మినట్లుగా కనిపించదు.

జగమంత అండగా :

వైసీపీ నేతలు ఎపుడూ చెప్పేది ఒక్కటే మాట. జగనే పార్టీ అని. ఆయనతోనే వైసీపీ అని. జగన్ ఒంటరిగా వచ్చి పార్టీ పెట్టి ఇంతటి పార్టీని చేశారు అని చెబుతారు. జగన్ లేకుంటే ఎవరూ లేరు, జగన్ కాకుంటే ఎవరూ వద్దు అని కూడా అంటారు. జగన్ ని చూసి జనాలు ఓటేస్తారు, ఆయన ఇమేజ్ తోనే పార్టీ గెలిచినా ఓడినా అని కూడా అంటారు. నిజానికి వైసీపీ అధినేతకు జనంలో ఇమేజ్ గ్లామర్ ఉన్నాయి, కానీ కేవలం నాయకుడితో మాత్రమే పార్టీ నడవదు కదా అన్న ప్రశ్నలు కూడా వస్తాయి, అయితే వీటికి లాజికల్ గా వైసీపీ చెప్పే సమాధానాలు ఏమీ ఉండవని అంటారు. తమ పార్టీకి జగనే సర్వస్వం అని నేతలు చెబుతారు. జగన్ అంటే జగమంత కుటుంబంగా నమ్ముతారు. బహుశా వైసీపీకి ఇదే అతి పెద్ద బలం, అదే బలహీనత కూడా. ఈ విధంగానే సాగుతూ ఒకసారి గెలిచింది. మళ్లీ గెలవాలని చూస్తోంది. సో వైసీపీ పొలిటికల్ ఫిలాసఫీ అయితే ఇదే. అందుకే ఎవరు వెళ్ళిపోయినా సరే మిగిలిన పార్టీల మాదిరిగా వైసీపీలో సమీక్షలు మీటింగులు అలెర్ట్ కావడాలూ వంటివి ఉండవని అంటారు.

Tags:    

Similar News