ట్రంప్ 5వేల డాలర్ల డివిడెండ్‌.. దీని వెనుక అసలు రాజకీయ-ఆర్థిక లెక్కలేమిటీ?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన 5 వేల డాలర్ల ‘ట్రంప్‌ డివిడెండ్‌’ ఇప్పుడు ఆ దేశ రాజకీయాల్లోనే కాదు.. ఆర్థిక వ్యవస్థలోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది.

Update: 2026-09-11 01:58 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన 5 వేల డాలర్ల ‘ట్రంప్‌ డివిడెండ్‌’ ఇప్పుడు ఆ దేశ రాజకీయాల్లోనే కాదు.. ఆర్థిక వ్యవస్థలోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది. నవంబర్‌లో జరిగే మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు ప్రతినిధుల సభ.. సెనేట్‌ రెండింటినీ తమ ఆధీనంలో ఉంచుకుంటే ప్రతి వయోజన అమెరికా పౌరుడికి 5 వేల డాలర్లు చెల్లిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఆ మొత్తాన్ని అమెరికాలోనే ఖర్చు చేయాలన్న షరతును కూడా పెట్టారు. అయితే ఇది నిజంగా ఆర్థిక డివిడెండా? లేక మధ్యంతర ఎన్నికల కోసం రూపొందించిన భారీ ప్రజాకర్షక హామీనా? అన్నదే అసలు ప్రశ్న.

అసలు రాజకీయ లెక్క ఇదే!

ట్రంప్‌ ఈ ప్రకటన చేసిన సందర్భాన్ని గమనిస్తే అసలు ఉద్దేశం కొంత స్పష్టమవుతుంది. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడి పేరు నేరుగా బ్యాలెట్‌పై ఉండదు. అయినప్పటికీ రిపబ్లికన్‌ అభ్యర్థులకు ఓటు వేయాలంటే అది తనకు ఓటు వేసినట్టేనని ట్రంప్‌ పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు 5 వేల డాలర్ల హామీ ద్వారా కాంగ్రెస్‌ నియంత్రణను నేరుగా వ్యక్తిగత ఆర్థిక లాభంతో అనుసంధానిస్తున్నారు. అంటే సందేశం చాలా సులభం “రిపబ్లికన్లను గెలిపిస్తే మీకు డబ్బు వస్తుంది.” రాజకీయంగా చూస్తే ఇది ఓటర్లను ముఖ్యంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న మధ్యతరగతి, కార్మిక వర్గాలను ఆకర్షించే ప్రయత్నంగా కనిపిస్తోంది.

కానీ ఇంత డబ్బు ఎక్కడి నుంచి?

ఇక్కడే అతిపెద్ద సందేహం మొదలవుతుంది. అమెరికాలో సుమారు 260 మిలియన్ల వయోజన పౌరులు ఉన్నారని అంచనా. ప్రతి ఒక్కరికీ 5 వేల డాలర్లు చెల్లిస్తే ఖర్చు దాదాపు 1.3 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుంది. అధిక ఆదాయ వర్గాలను మినహాయిస్తే మొత్తం కొంత తగ్గొచ్చు. ట్రంప్‌ దీనికి నిధులను ఎలా సమకూరుస్తారో స్పష్టమైన ప్రణాళిక మాత్రం ప్రకటించలేదు. సుంకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించే ఆలోచన చర్చలో ఉన్నప్పటికీ లెక్కలు మాత్రం అంత సులభంగా సరిపోవడం లేదు. 2026 ఆర్థిక సంవత్సరంలో జూలై వరకు అమెరికా సుంకాల ద్వారా సుమారు 154 బిలియన్‌ డాలర్ల ఆదాయం వచ్చింది. అంతేకాదు తాజా సుంకాల విధానాల వల్ల వచ్చే అదనపు ఆదాయం కూడా 1.3 ట్రిలియన్‌ డాలర్లకు దగ్గరగా దరిదాపుల్లో లేదు. ఒక్కసారి చెల్లింపును కూడా ట్రంప్ ప్రభుత్వం భరించే స్థాయిలో లేదు. కాంగ్రెస్‌ బడ్జెట్‌ కార్యాలయం కూడా సుంకాల మార్పుల తర్వాత భవిష్యత్‌ బడ్జెట్‌ లోటుపై అదనపు భారం ఉంటుందని అంచనా వేసింది. ప్రభుత్వానికి మిగులు లేనప్పుడు ప్రజలకు డివిడెండ్‌ ఎలా? అప్పు చేసి చెల్లిస్తే అది నిజమైన డివిడెండా? లేక భవిష్యత్‌ పన్ను చెల్లింపుదారులపై భారం మోపే విధానమా?

చేతికి 5 వేల డాలర్లు వస్తే లాభమేనా?

వ్యక్తిగతంగా చూస్తే 5 వేల డాలర్లు పెద్ద మొత్తమే. అమెరికన్లు ఆ డబ్బును ఖర్చు చేస్తే వ్యాపారాలకు డిమాండ్‌ పెరుగుతుంది. ట్రంప్‌ అమెరికాలోనే ఆ డబ్బును ఖర్చు చేయాలన్న షరతు పెట్టడం వెనుక ఇదే ఆలోచన కనిపిస్తోంది. అంటే ఒకవైపు ప్రజలకు నగదు.. మరోవైపు దేశీయ వినియోగానికి ఊతం. కానీ సమస్య ఏమిటంటే ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల సరఫరా అదే స్థాయిలో ఉంటే ఒక్కసారిగా డిమాండ్‌ పెరగడం ధరలపై ఒత్తిడి పెంచవచ్చు. ద్రవ్యోల్బణం పెరిగితే 5 వేల డాలర్లలో కొంత భాగం కొనుగోలు శక్తి రూపంలోనే కరిగిపోతుంది. దానితో వడ్డీ రేట్లపై అమెరికా కేంద్ర బ్యాంకు నిర్ణయాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది.

‘డివిడెండ్‌’ అనే పేరు కూడా రాజకీయ ఆయుధమే!

ట్రంప్‌ దీనిని సాధారణ ప్రభుత్వ నగదు సహాయం అని కాకుండా ‘డివిడెండ్‌’ అని పిలవడం ఆసక్తికరం. కంపెనీ లాభాలు వస్తే వాటిలో కొంత భాగాన్ని వాటాదారులకు డివిడెండ్‌గా ఇచ్చినట్లే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ సుంకాలు, వాణిజ్యం, ఉత్పత్తి ద్వారా సంపాదిస్తే ఆ లాభాన్ని ప్రజలతో పంచుతున్నామనే భావనను ఆయన సృష్టిస్తున్నారు. అంటే ఇది కేవలం డబ్బు పంపిణీ కాదు. “అమెరికా సంపాదిస్తోంది.. ఆ లాభంలో మీకూ వాటా ఉంది” అనే రాజకీయ కథనాన్ని నిర్మించే ప్రయత్నం.

అందరికీ 5 వేల డాలర్లేనా?

ఇక్కడ మరో ట్విస్ట్‌ ఉంది. ట్రంప్‌ మొదట ప్రతి వయోజన పౌరుడికీ 5 వేల డాలర్లు అన్నారు. కానీ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తర్వాత సంపన్న అమెరికన్లను ఈ పథకం నుంచి మినహాయించే అవకాశం ఉందని సూచించారు. దీంతో ఆదాయ పరిమితి, అర్హత, పౌరసత్వ నిబంధనలు వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

2 వేల నుంచి 5 వేల డాలర్లకు ఎందుకు?

ట్రంప్‌ గతంలో సుంకాల ఆదాయం ఆధారంగా సుమారు 2 వేల డాలర్ల ‘టారిఫ్‌ డివిడెండ్‌’ గురించి మాట్లాడారు. ఆ ప్రతిపాదనకు అవసరమైన మొత్తంతో పోలిస్తే సుంకాల ఆదాయం సరిపోదని అప్పట్లోనే విశ్లేషణలు వచ్చాయి. ఇప్పుడు అదే ఆలోచనను 5 వేల డాలర్లకు పెంచడం ఆర్థిక లెక్క కంటే రాజకీయ ప్రభావాన్ని పెంచే ప్రయత్నంగా కనిపిస్తోంది.

చివరికి హామీ నెరవేరుతుందా?

అందుకే ట్రంప్‌ 5 వేల డాలర్ల హామీని కేవలం “అమెరికన్లకు డబ్బు”గా చూడటం సరిపోదు. ఇది ఆర్థిక విధానం కంటే ఎన్నికల రాజకీయాలతో బలంగా ముడిపడిన ప్రతిపాదన. ఒకవైపు ఓటర్లను రిపబ్లికన్‌ పార్టీ వైపు సమీకరించడం.. మరోవైపు సుంకాలను అమెరికా ప్రజలకు నేరుగా లాభం చేకూర్చే సాధనంగా చూపించడం.. ఇంకోవైపు ట్రంప్‌ వ్యక్తిత్వాన్ని మధ్యంతర ఎన్నికల కేంద్రంగా మార్చడం.. ఈ మూడు లక్ష్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. అయితే 1.2–1.3 ట్రిలియన్‌ డాలర్ల స్థాయి వ్యయానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? కాంగ్రెస్‌ ఆమోదిస్తుందా? అధిక ఆదాయ వర్గాలను మినహాయిస్తే అర్హత ఎలా నిర్ణయిస్తారు? ద్రవ్యోల్బణంపై ప్రభావం ఎంత? వంటి ప్రశ్నలకు సమాధానాలు లేకుండా ‘ట్రంప్‌ డివిడెండ్‌’ ప్రస్తుతం పూర్తిస్థాయి ఆర్థిక పథకం కంటే భారీ రాజకీయ హామీగానే కనిపిస్తోంది.

ట్రంప్‌ ఆర్థిక విధానం పన్ను తగ్గింపులు, సుంకాల నుంచి నేరుగా ప్రజల చేతుల్లో నగదు పెట్టే ‘ప్రత్యక్ష నగదు రాజకీయాల’ వైపు మలుపు తిరుగుతోందా? అన్నదే ఇప్పుడు అమెరికా రాజకీయ-ఆర్థిక వ్యవస్థ ముందున్న అసలు ప్రశ్న.

Tags:    

Similar News