కేసీఆర్ ఏమయ్యారు?! ఇంత గొడవ జరుగుతున్నా ఉలకరెందుకు సారూ!
రాజకీయంగా వాడివేడి వాతావరణం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటించడం వల్ల పార్టీపరంగా నష్టం జరగదా? అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజకీయంగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ కేసీఆర్ జోక్యం చేసుకోకపోవడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వంపై రోజువారి పోరాటాల బాధ్యతను పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావుకు అప్పగించినప్పటికీ శాసనసభ సమావేశాలతోపాటు రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడు కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా వాడివేడి వాతావరణం ఉన్నప్పుడు కూడా కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటించడం వల్ల పార్టీపరంగా నష్టం జరగదా? అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే రణరంగంగా మారిన విషయం తెలిసిందే. ఆ తర్వాత స్పీకర్ ను అవమానించారని ఆరోపిస్తూ అధికార కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ఉంటున్న ఎర్రవెల్లి ఫాం హౌసు ఎదుట భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా వేలాది డప్పులతో దండోరా వేయడంతో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకోడానికి బీఆర్ఎస్ నేతలు కూడా ఫాం హౌసుకు చేరుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కిపోయింది. ఒక విధంగా ఈ విషయంలో పైచేయి సాధించేందుకు రెండు పార్టీలు పోటాపోటీగా ఎత్తులుపై ఎత్తులు వేశాయని చెబుతున్నారు.
అయితే మాజీ సీఎం కేసీఆర్ సభకు రాకపోవడంతోపాటు అసెంబ్లీ ఎదుట చోటుచేసుకున్న పరిణామాలకు ఆయన బాధ్యత వహించాలని, ఎర్రవెల్లి ఫాం హౌసులోనే కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ స్పందించకపోవడమే అంతుచిక్కడం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి వరుసగా మాటల దాడి చేస్తున్నా, మాజీ సీఎం కేసీఆర్ అసలు ఏమీ పట్టించుకోకుండా ఉండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదని అంటున్నారు. కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలను పట్టించుకోవడం లేదని కేసీఆర్ సంకేతాలు ఇవ్వాలని అనుకుంటున్నారా? లేక ఆ విమర్శలకు కేటీఆర్, హరీశ్ రావుతో జవాబు చెబితే చాలు అన్న భావనలో ఉన్నారా? అనేది తెలియడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.
నిజానికి రాజకీయాల్లో ప్రముఖ నేతలు ఇలా మౌనంగా ఉంటే, ప్రత్యర్థులు పైచేయి సాధించే అవకాశాలు ఉంటాయని పరిశీలకులు భావిస్తున్నారు. తమ ఆరోపణలు నిజం కాబట్టే అవతలి వారు మాట్లాడటం లేదని ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు అవుతుందని అంటున్నారు. కానీ, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఏదో బలమైన కారణంతోనే ప్రత్యర్థులను పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. తాను మాట్లాడితే పార్టీని నడుపుతున్న మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వాదనలకు ప్రాధాన్యం తగ్గిపోతుందని అనుకుంటున్నారా? లేక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ సాధకుడిగా కీర్తి గడించిన వ్యక్తిని అనవసరంగా నిందిస్తున్నారని తన మౌనం ద్వారా ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టే వ్యూహాన్ని సైలెంటుగా అమలు చేస్తున్నారా? అన్నది చూడాల్సివుందని అంటున్నారు.