రీయాక్టివ్ కాదు.. ప్రోయాక్టివ్ పాలన కావాలంటున్న చంద్రబాబు!
ఆయన లేదా ఆమె కనుసన్నల్లోనే అన్నీ జరుగుతాయి. అయితే.. ఇది కాదు.. ఇంతకు మించి అనేది చంద్రబాబు ఉద్దేశం.
ఏపీ సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా రియాక్టివ్ గవర్నెన్స్ కాదు.. ప్రోయాక్టివ్ గవర్నెన్స్(పాలన) కావాలని తేల్చి చెప్పారు. అయితే.. అసలు ఇది ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. సహజంగా ప్రతి జిల్లాలోనూ కలెక్టరే పాలన పరంగా చీఫ్. ఆయన లేదా ఆమె కనుసన్నల్లోనే అన్నీ జరుగుతాయి. అయితే.. ఇది కాదు.. ఇంతకు మించి అనేది చంద్రబాబు ఉద్దేశం.
రియాక్టివ్ గవర్నెన్స్ అంటే..
ఏదైనా విషయం జరిగిన తర్వాత స్పందించడాన్ని రియాక్టివ్ గవర్నెన్స్ అంటారు. ఉదాహరణకు.. సమ స్యలు, సంక్షోభాలు లేదా సవాళ్లు తలెత్తిన తర్వాత చర్యలు తీసుకోవడం వంటివి ఈ విధానంలోకి వస్తాయి. ఈ విధానం యొక్క ప్రధాన లక్షణం.. దీర్ఘకాలిక ప్రణాళిక కొరతగా ఉంటుంది. ముందుగా ఊహించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కంటే, అప్పటికప్పుడు తక్షణ పరిష్కారాల మీద ఆధారపడతారు.దీనివల్ల ప్రతికూలతను ఎదుర్కొనే సామర్థ్యం పెద్దగా ఉండదు. దీనిని పరిహరించాలన్నది చంద్రబాబు ఉద్దేశం.
ఇక, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ ఇదీ..
ఇక, ప్రోయాక్టివ్ గవర్నెన్స్ విషయానికి వస్తే.. వనరుల వృథాను అరికట్టడంతోపాటు.. అధిక వత్తిడిని అధిగమిస్తూ.. జరగబోయే విషయాలను సాంకేతిక పరంగా ముందుగానే గుర్తించడం. తద్వారా.. వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను ముందుగా ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకోవడం. దీంతో సమస్య తీవ్రత తగ్గి.. ప్రజలకు మేలు జరగడంతోపాటు.. ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది. సమస్యలు రాకముందే ఊహించి పనిచేసే విధానాన్ని ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అంటారు.
సాధ్యమేనా?
దేశంలో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ విషయంలో గోవా రాష్ట్రం ముందుంది. ఇక్కడ సముద్రతీరం ఎక్కువగా ఉండడంతో ముందుగానే విపత్తులను ఘటనలను అంచనా వేసి.. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు .. ప్రభుత్వం కూడా.. పారదర్శకంగా వ్యవహరిస్తుంది. దీంతో గోవాలో అన్ని విధాలా అభివృద్ధి కనిపిస్తుంది. దీనినే ఏపీలోనూ అన్వయించాలని చంద్రబాబు చెబుతున్నారు.