రూ.100 క్రూడ్ ..రూ.95 దాటిన డాలర్.. భారత్‌కు డబుల్ షాక్?
భారత ఆర్థిక వ్యవస్థపై సమ్మెట పోటు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతున్న వేగవంతమైన పరిణామాలు మన దేశ ఆర్థిక వ్యవస్థపై సరికొత్త ఒత్తిడిని తెస్తున్నాయి.
భారత ఆర్థిక వ్యవస్థపై సమ్మెట పోటు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతున్న వేగవంతమైన పరిణామాలు మన దేశ ఆర్థిక వ్యవస్థపై సరికొత్త ఒత్తిడిని తెస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధర బారెల్‌కు 100 డాలర్ల మార్కును తాకడం ఒక ఎత్తైతే.. అదే సమయంలో అమెరికన్ డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ దాదాపు రూ.95 దాకా క్షీణించడం మరొక ఎత్తు. ఈ రెండు ప్రతికూల అంశాలు ఒకేసారి సంభవించడమే భారత్‌కు ఊహించని `డబుల్ షాక్`గా మారుతోంది. భారత్ తన చమురు అవసరాలలో సింహభాగాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. సాధారణంగా క్రూడ్ ధర పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. అదే సమయంలో రూపాయి బలహీనపడితే .. బారెల్ చమురు కోసం భారత్ మునుపటి కంటే చాలా ఎక్కువ రూపాయలను చెల్లించాల్సి వస్తుంది. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల దేశీయ ఖజానాపై ఊహించని ప్రెజర్ పడుతోంది.
సాధారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినంత మాత్రాన వెంటనే పెట్రోల్-డీజిల్ ధరలు అంతే స్థాయిలో పెరగవు. ప్రభుత్వం విధించే పన్నులు, ఆయిల్ కంపెనీల మార్జిన్లు దీనిపై ప్రభావం చూపుతాయి. అయితే అసలు పెద్ద సమస్య ఇంధన ధరల పెంపు మాత్రమే కాదు.. దాని వెనుక వచ్చే భారీ ద్రవ్యోల్బణం. చమురు ధర పెరిగితే రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు పెరుగుతాయి. అది చివరకు నిత్యావసర వస్తువులు, ఆహార పదార్థాలు, తయారీ రంగంపై పడి సామాన్యుడి జేబుకు కన్నం వేస్తుంది. ఉదాహరణకు డాలర్ విలువ రూ.85 ఉన్నప్పుడు ఒక బారెల్ క్రూడ్ ఆయిల్ కోసం రూ.8,500 ఖర్చయితే.. డాలర్ మారకం విలువ రూ.95కు పడిపోతే అదే 100 డాలర్ల బారెల్ కోసం రూ.9,500 చెల్లించాల్సి వస్తుంది. అంటే కేవలం చమురు ధర మాత్రమే కాక.. రూపాయి బలహీనపడటం వల్ల కూడా అదనపు భారం పడుతోంది.
ఈ డబుల్ షాక్ ప్రభావం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) - స్టాక్ మార్కెట్లపై భిన్నంగా ఉండనుంది. ఒకవైపు పెరిగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడం... మరోవైపు ఆర్థిక వృద్ధికి ఊతమివ్వడం ఒకేసారి ఆర్బీఐకి ఇది పెద్ద పాలసీ సవాలుగా మారుతుంది. ఇక స్టాక్ మార్కెట్ విషయానికొస్తే... క్రూడ్ ఆయిల్ వాడకం ఎక్కువగా ఉండే ఎయిర్‌లైన్స్, పెయింట్స్, టైర్లు, కెమికల్స్, రవాణా రంగానికి చెందిన కంపెనీల షేర్లపై ఒత్తిడి పెరుగుతుంది. అయితే ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ కంపెనీలు, విదేశీ ఆదాయం పొందే ఎగుమతి ఆధారిత రంగాలకు ఇది కొంతవరకు లబ్ధి చేకూరుస్తుంది. అలాగే ప్రభుత్వానికి కూడా ఇది ఇబ్బందికర పరిణామమే. ఇంధన ధరలు పెంచితే ప్రజల నుంచి నిరసనలు.. పెంచకపోతే ఆయిల్ కంపెనీలకు సబ్సిడీల భారం పడి కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ) మరింత పెరిగే ప్రమాదం ఉంది.
సామాన్యుడి జీవితంలో ఈ ప్రభావం పెట్రోల్ బిల్లుల నుంచి మొదలై ఈ-కామర్స్ డెలివరీ ఛార్జీలు, విమాన ఛార్జీలు, చివరకు లోన్ ఈఎంఐల వరకు ప్రతి రంగాన్నీ తాకుతుంది. అయితే దీనిని వెంటనే పెద్ద ఆర్థిక సంక్షోభంగా చూడాల్సిన అవసరం లేదు. భారత్ వద్ద బలమైన విదేశీ మారక నిల్వలు.. వైవిధ్యమైన చమురు కొనుగోలు వ్యూహాలు .. అత్యవసర పెట్రోలియం నిల్వలు ఉండటం అతిపెద్ద ఊరట. ఇక్కడ అసలు ప్రశ్న 100 డాలర్ల వద్ద క్రూడ్ ధర ఎంతకాలం నిలకడగా ఉంటుంది? రూపాయి క్షీణత ఎక్కడ ఆగుతుంది? అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. 100 డాలర్ల క్రూడ్ ఒక్కటే సమస్య కాదు.. దానికి రూపాయి క్షీణత తోడవ్వడమే అసలైన సవాలు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే భారత్ విదేశీ చమురుపైనా.. డాలర్ మారకంపైనా ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించుకోవాలి. ఇంధన అవసరాల కోసం చైనా ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆయిల్ ప్రాజెక్టులకు బదులుగా గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన రంగాన్ని చైనా వేగంగా విస్తరిస్తోంది. భారత్ కూడా తన ఆయిల్ డిపెండెన్సీని తగ్గించుకోవడానికి ఎలాంటి సృజనాత్మకమైన వ్యూహాలు అమలు చేస్తుందో.. అలాగే డాలర్‌కు ప్రత్యామ్నాయంగా రూపాయి స్థిరత్వాన్ని ఎలా కాపాడుకుంటుందో వేచి చూడాలి.