హన్మంతన్న చెప్పినట్లు చేద్దాం.. రాజకీయాలు చేస్తామంటే తప్పక తెలుసుకోవాలి
రాజకీయాలపై ఆసక్తి ఉన్న నవ యువకులకు సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విలువైన సూచనలు చేశారు.
రాజకీయాలపై ఆసక్తి ఉన్న నవ యువకులకు సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) విలువైన సూచనలు చేశారు. రాజకీయాలలో రాణించాలంటే సీనియర్ల వెంట పడొద్దు, ఫొటోలు, రీల్స్ కు మాత్రమే పరిమితం అయిపోవద్దు అంటూ హితబోధ చేశారు వీహెచ్. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వీహెచ్ రాజకీయాల్లోకి కొత్త తరం రావాల్సివుందని అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా కొత్తగా వచ్చేవారు రాజకీయంగా సక్సెస్ కావాలంటే ఏం చేయాలో చెప్పి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం వీహెచ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కొత్తగా రాజకీయాల్లోకి వచ్చే కార్యకర్తలు ఏదో సాధించాలనే ఉత్సాహంతో పెద్ద పెద్ద నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం అంటే తప్పులో కాలేసినట్లే అంటున్నారు వీహెచ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేతల కాన్వాయ్‌ల వెనుక తిరగడం, వారి వ్యక్తిగత పనులు చేయడం, ప్రసన్నం చేసుకోవడమే రాజకీయమనే భ్రమలో పడి విలువైన కాలాన్ని వృథా చేసుకోవద్దని కరాఖండీగా తేల్చిచెప్పారు సీనియర్ నేత వీహెచ్. నాయకుల చుట్టూ తిరగడం వల్ల తాత్కాలికంగా పేరు రావచ్చు కానీ, శాశ్వత రాజకీయ భవిష్యత్తు మాత్రం ఉండదనేది వీహెచ్ అభిప్రాయం. నేతల దయపై ఆధారపడితే కేవలం కొందరికే పరిమితం కావాల్సి వస్తుందని, ప్రజల మద్దతు లేని నాయకత్వం ఎప్పటికీ నిలకడగా ఉండదని ఆయన హెచ్చరిక.
ప్రజాక్షేత్రమే అసలైన బలం
రాజకీయం అంటే రీల్స్ చేయడం, సోషల్ మీడియాలో వ్యూస్ పెంచుకోవడమే అన్న అభిప్రాయం బలపడుతున్న సమయంలో సీనియర్ నేత హనుమంతరావు వ్యక్తం చేసిన అభిప్రాయంపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు. నిజమైన నాయకులు గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. రాజకీయాల్లో నిజంగా రాణించాలనుకునే వారికి ప్రజాసేవే అసలైన మార్గమని వీహెచ్ హితవు పలికారు. నాయకుల వెనుక తిరిగే బదులు ఆ సమయాన్ని ప్రజల మధ్య గడపడానికి వెచ్చించాలని ఆయన సూచించారు. గ్రామాల్లో, వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారి కష్టసుఖాల్లో భాగం కావడం ద్వారానే నాయకుడికి అసలైన పునాది పడుతుందని చెబుతున్నారు.
ప్రజల సమస్యలపై పోరాడే నాయకుడికి సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పది మందికి మంచి చేసినప్పుడే ఆ వ్యక్తి నలుగురి నోళ్లలో నలుగుతాడు. ప్రజా సమస్యలపై గళం విప్పే యువనేతలకు ప్రజలే స్వయంగా పట్టం కడతారు. కేవలం కొందరి కనుసన్నల్లో మెలిగే కంటే, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడమే రాజకీయ నాయకుడికి అసలైన విజయమని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తోంది. సీనియర్ నేత వీహెచ్ అనుభవంతో చెప్పిన పాఠాన్ని కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్న వారు కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటున్నారు. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, పీసీసీ అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసిన అనుభవంతో వీహెచ్ చెప్పిన మాటలు కొత్తవారికి దిశానిర్దేశం చేస్తాయనడంలో అతిశయోక్తి ఏమీ లేదని అంటున్నారు. నేటితరం నాయకులు ఈజీ మనీ, షార్ట్‌కట్ పద్ధతుల ద్వారా ఎదగాలని చూస్తున్నారని, కానీ గ్రౌండ్ లెవెల్ రియాలిటీని అర్థం చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవనే సత్యాన్ని విస్మరిస్తున్నారని అంటున్నారు.