ఇప్పుడేం చేద్దాం.. కేడర్ తో బొత్స సమాలోచనలు!
మంగళవారం చిన్న శ్రీను కండువా మార్చేస్తే బుధవారం తన కొడుకు, కూతురిని సొంత నియోజకవర్గానికి పంపిన బొత్స, గురువారం స్వయంగా గరివిడిలో తన క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేడర్ తో సమావేశమయ్యారు.
మేనల్లుడు, విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రయత్నాలు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం జడ్పీచైర్మన్ చిన్న శ్రీను వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించిన ఈ ఆకస్మిక పరిణామంతో సీనియర్ నేత బొత్స ఉలిక్కిపడ్డారు. మంగళవారం చిన్న శ్రీను కండువా మార్చేస్తే బుధవారం తన కొడుకు, కూతురిని సొంత నియోజకవర్గానికి పంపిన బొత్స, గురువారం స్వయంగా గరివిడిలో తన క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేడర్ తో సమావేశమయ్యారు.
గత పాతికేళ్లుగా తన వెంట నడిచిన మేనల్లుడు చిన్నశ్రీను సొంత దారి చూసుకోవడం రాజకీయంగా తనకు నష్టమని భావించిన బొత్స, నష్టనివారణ చర్యలకు వెనువెంటనే రంగంలోకి దిగడం చర్చనీయాంశం అవుతోంది. నియోజకవర్గంలో ప్రతి నేతతో పరిచయం ఉన్న చిన్నశ్రీను చేరికలను ప్రోత్సహిస్తే పరిస్థితి చేజారిపోయే ప్రమాదం ఉందన్న ఆలోచనతో బొత్స తన అనుచరులు, సన్నిహితులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారని అంటున్నారు. బుధవారం కాకినాడలో ఉండటంతో నియోజకవర్గ నేతలను కలుసుకోలేకపోయిన ఆయన కూతురు, కొడుకుని ఆగమేఘాలపై పంపారు. మరోవైపు జిల్లాస్థాయి నేతలతో బుధవారం సాయంత్రం భేటీ అయ్యారు.
ఇక గురువారం కూడా తన సొంత నియోజకవర్గానికి వచ్చిన బొత్స తనతో ఉండేదెవరు? చిన్నశ్రీనుతో వెళ్లేది ఎవరు? అన్న విషయంపై ఆరా తీశారు. అయితే బొత్స అనుచరులు అయినప్పటికీ చిన్నశ్రీనుతో సాహచర్యం చేసి ఆ ఇంటి రాజకీయాన్ని అవపోసన పట్టిన నేతలు ఎవరూ నోరు విప్పలేదని పరిశీలకులు చెబుతున్నారు. మీతో ఉంటామని ఒకరిద్దరు బొత్సకు మాటిచ్చినా, ఎక్కువ మంది మనసులో వేరే ఆలోచనలు ఉన్నాయన్న ప్రచారంతో బొత్స తీవ్ర భావోద్వేగానికి గురైనట్లు చెబుతున్నారు. ఈ విషయమై బొత్స కుమార్తె అనూష కూడా కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.
చిన్నశ్రీను పార్టీ మారిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎక్కువ మంది తమ కుటుంబం కూడా వైసీపీని వీడే అవకాశం ఉందని అనుమానిస్తున్నారని అనూష వ్యాఖ్యానించారు. కార్యకర్తలు ఎవరూ అటువంటి అనుమానం పెట్టుకోవద్దని తమ కుటుంబం ఎప్పటికీ వైసీపీలోనే ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు చిన్నశ్రీను నిష్క్రమణపై బొత్స అనుచరుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సత్తిబాబు అనుచరులు అయినప్పటికీ ఎక్కువగా చిన్నశ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న నేతలు ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలనే అంశంపై తర్జనభర్జనకు గురవుతున్నారని చెబుతున్నారు. బొత్స ఏ పార్టీలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా జిల్లావరకు అన్ని వ్యవహారాలను చిన్నశ్రీను మాత్రమే చూసుకునేవారని చెబుతున్నారు.
దీంతో జిల్లాలో 99.9 శాతం మంది కార్యకర్తలకు బొత్స కంటే ఎక్కువగా చిన్నశ్రీనుతోనే అనుబంధం పెరిగిపోయిందని అంటున్నారు. దీంతో ఆయన రమ్మని పిలిస్తే ఏం జవాబు చెప్పాలి అనే విషయమై గుసగుసలాడుకుంటున్నారని చెబుతున్నారు. బొత్స కూడా ఇన్నాళ్లు తన అల్లుడికి అప్పగించిన బాధ్యతలతో కేడర్ తో దూరమయ్యాయని ఇక తానే చీపురుపల్లిలో అందుబాటులో ఉంటానని చెబుతూ తన అనుచరుల సంశయాన్ని తీరుస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి చిన్నశ్రీను రాజీనామాతో రాజకీయంగా కంటే బొత్స అనుచరులలో ఎక్కువ మందికి భావోద్వేగాల సమస్యగా మారిందని అభిప్రాయపడుతున్నారు.