జగన్ వర్సెస్ లోకేష్ ...పిక్చర్ మారుతోంది !

ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. ఇప్పటిదాకా చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా ఏపీ రాజకీయం నడిచింది.

Update: 2026-09-11 03:42 GMT

ఏపీలో రాజకీయ ముఖ చిత్రం మారుతోంది. ఇప్పటిదాకా చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా ఏపీ రాజకీయం నడిచింది. ఇపుడు జగన్ వర్సెస్ లోకేష్ అన్నట్లుగా పిక్చర్ మారుతోంది. ఇంతకాలం లోకేష్ ని లైట్ తీసుకుంటూ వస్తున్న వైసీపీ కూడా ఇపుడు ఆయనే తమ ప్రధాన ప్రత్యర్థి భవిష్యత్తు అంతా ఆయనతోనే రాజకీయ యుద్ధం అని గ్రహించినట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో లోకేష్ సైతం నేరుగా జగన్ కే ప్రతీ సందర్భంలోనూ సవాల్ విసురుతున్నారు. ఒక లేటెస్ట్ గా మరో కీలక పరిణామం ఏంటి అంటే ఒకే రోజున అటు జగన్ ఇటు లోకేష్ సవాళ్ళు చేసుకున్నారు. లోకేష్ రాజీనామా చేయాలని అసెంబ్లీలో డీఎస్సీ మీద చర్చించాలని జగన్ సవాల్ చేస్తే మెగా డీఎస్సీని అద్భుతంగా నిర్వహించామని రానున్న కాలంలో ఏడాదికి మూడు వేల డీఎస్సీ ఉద్యోగాల వంతున మొత్తం 30 వేలను ఈ టెర్మ్ లో భర్తీ చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు. దాంతో జగన్ వర్సెస్ లోకేష్ సరికొత్త రాజకీయ ఎపిసోడ్ కి చేరుకున్నట్లు అయింది.

చేతనైతే నన్ను ఆపండి చూద్దాం :

ఇదిలా ఉంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టి మెగా డీఎస్సీలో అక్రమాలు అంటూ తీవ్ర విమర్శలు కూటమి ప్రభుత్వం మీద చేశారు. దానికి బదులు అన్నట్లుగా లోకేష్ ఒక రెండున్నర నిమిషాల వీడియో బైట్ ని వదిలారు. ఆంధ్ర ప్రజలకు నమస్కారం అంటూ విడుదల చేసిన దాంట్లో జగన్ ని కౌంటర్ చేస్తూనే డీఎస్సీ నిర్వహణలో ఏ తప్పూ లేదని స్పష్టం చేశారు. అంతే కాదు మరిన్ని డీఎస్సీలు నిర్వహిస్తమని కూడా లోకేష్ చెప్పారు. చేతనైతే నన్ను ఆపండి చూద్దాం అంటూ లోకేష్ జగన్ కి సరికొత్త సవాల్ విసిరారు. అనుకున్నది సాధిస్తానని, ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించి తీరుతాను అని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని లోకేష్ కచ్చితంగా చెప్పుకొచ్చారు.

జగన్ గారూ ఒకటే చెబుతున్నాను :

ఇక లోకేష్ ఈ వీడియో బైట్ లో జగన్ ని ఉద్దేశించి చాలా హుందాగానే సంభోదించడం విశేషం. జగన్ గారూ అని మాజీ ముఖ్యమంత్రి అని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక తాను ఎందుకు ఫస్ట్ ప్రయారిటీగా మెగా డీఎస్సీని నిర్వహించాల్సి వచ్చిందో ఆయన వీడియో బైట్ లో వివరించే ప్రయత్నం చేశారు. తాను యువగళం పాదయాత్రలో నేను నిరుద్యోగ యువతను కలిశాను అని, అపుడే అక్కడే వాళ్ల సమస్యలను తెలుసుకున్నాను అని చెప్పారు. అందుకే పట్టుదలతో క్రమశిక్షణతో ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహించదలిచాను అని వివరించారు. అలా మొత్తం టీచర్ పోస్టులను భర్తీ చేసే బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి హుందాగా పద్ధతిగా ఈ వీడియో బైట్ లో మాట్లాడిన లోకేష్ జగన్ కి గట్టిగానే సవాల్ విసిరారు.

కట్టడి చేసే వ్యూహం :

ఇదిలా ఉంటే లోకేష్ టీడీపీలో భావి ముఖ్యమంత్రి. ఈ విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు అయితే లేవు అనే చెప్పాలి. ఈసారి కాకపోతే వచ్చే ఎన్నికల తరువాత అయినా లోకేష్ సీఎం అవుతారు. జగన్ కూడా మరిన్ని ఎన్నికల్లో పోటీ చేసి సీఎం కావాలని చూస్తున్న వారు. దాంతో రానున్న కాలమంతా జగన్ వర్సెస్ లోకేష్ గానే ఏపీ రాజకీయం సాగుతుందని అంటున్నారు. వైసీపీ అయితే ముందుగానే లోకేష్ ని కట్టడి చేయాలని వ్యూహరచన చేస్తోంది అని అంటున్నారు. దానికి ధీటుగా లోకేష్ కూడా రియాక్ట్ అవుతున్నారు. దాంతో ఇపుడు ఏపీ పాలిటిక్స్ లో కొత్త కలర్స్ కనిపిస్తున్నాయి. నిన్నటిదాకా చంద్రబాబు వర్సెస్ జగన్ రాజకీయాన్ని చూసిన వారికి జగన్ వర్సెస్ లోకేష్ అంటే కొత్త ఆసక్తిగానే ఉంటుంది. సో చూడాలి మరి రాజకీయ వెండి తెర మీద ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News