వరుస తుఫాన్లు.. చంద్రబాబుకు ఎన్నో విధాల మేలు
| వారం రోజుల వ్యవధిలో ఏర్పడిన రెండు తుఫాన్లు ఏపీలో వర్షాభావాన్ని పూర్తిగా తగ్గించేశాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి.
వారం రోజుల వ్యవధిలో ఏర్పడిన రెండు తుఫాన్లు ఏపీలో వర్షాభావాన్ని పూర్తిగా తగ్గించేశాయనే విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా వర్షాభావ పరిస్థితులపై ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కొనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండు తుఫాన్లు చాలా మేలు చేశాయని విశ్లేషిస్తున్నారు. తుఫాన్ కారణంగా చాలా నష్టం జరిగినప్పటికీ, భారీ వర్షాల కారణంగా వేసవి సవాళ్లను అధిగమించేలా అవకాశం లభించిందని అంటున్నారు. ప్రస్తుతం చేతికందిన పంట కొంతవరకు దెబ్బతిన్నప్పటికీ, రెండో పంటకు పుష్కలంగా నీరు లభించిందని చెబుతున్నారు. ప్రస్తుతానికి ఇటు రైతుకు అటు ప్రభుత్వానికి నష్టం జరిగినా, ఎల్ నినో ప్రభావం నుంచి రాష్ట్రం పూర్తిగా బయటపడటంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరట లభించినట్లేనని అంటున్నారు.
ఎల్ నినో కారణంగా ఈ ఏడాది రాష్ట్రం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో రాష్ట్రంలో దాదాపు 450 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. పంట దిగుబడులు తగ్గిపోతాయనే ఆందోళన ఎక్కువ కావడంతో మార్కెట్లో అనేక రకాల సరకులకు డిమాండ్ పెరిగిపోయింది. దీంతో ఎన్నడూ లేనట్లు నిత్యావసర వస్తువుల ధరలు నింగిని తాకుతున్నాయి. దీంతో ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని చెబుతున్నారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబును రాజకీయంగా ఇరుకన పెట్టేందుకు ప్రత్యర్థులు ఈ వాతావరణ పరిస్థితులను కూడా వాడుకుంటున్నారు. రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నేతలతోపాటు తెలంగాణకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వర్షాలు కురవవు అనే సెంటిమెంటు ద్వారా రాజకీయం చేయాలని చూశారని అంటున్నారు.
అయితే అనూహ్యంగా గత వారం రోజుల్లో రెండు తుఫాన్లు ఏర్పడటంతో రాష్ట్రం వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడిందని అంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత నెల 28న కోనసీమ తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాన్ వల్ల శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు మంచి వర్షాలే కురిశాయి. ఈ వర్షాల కారణంగా 31 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దాదాపు 20 లక్షల ఎకరాలలో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ వర్షాల వల్ల జరిగిన నష్టానికి సమానంగా మేలు కూడా జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాదపు కోస్తా ప్రాంతంలో పుష్కలంగా నీరు చేరిందని, అన్ని చెరువులు, రిజర్వాయర్లు జలకళను సంతరించుకున్నాయని చెబుతున్నారు. వాగులు, వంకలు, గెడ్డలు పొంగిపొర్లడంతో రానున్న వేసవికి తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని విశ్లేషిస్తున్నారు.
వాస్తవానికి ఎల్ నినో కారణంగా 2027 జూన్ వరకు వర్షాలు కురిసే అవకాశం లేదని అంటున్నారు. దీనివల్ల తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. పొరుగున ఉన్న తెలంగాణలో ఇప్పటికే ఈ సమస్య మొదలైందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఏపీకి మాత్రం రెండు తుఫాన్లు తాగునీటి ముప్పు లేకుండా చేశాయని, అదే సమయంలో రబీ పంటలకు సాగునీటి చింత లేకుండా పోయిందని వ్యాఖ్యానిస్తున్నారు. అర్నాబ్ కారణంగా శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు మంచి వర్షాలు కురిస్తే, ఇప్పుడు మురసు తుఫాన్ వల్ల ప్రకాశం, నెల్లూరు, మార్కాపురం, పల్నాడు జిల్లాలతోపాటు రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా ఎగువ ప్రాంతంలో వర్షాలు లేక ఈ సీజన్ లో చుక్క నీరు కూడా చేరని పులిచింతల, నాగార్జున సాగర్ కు భారీగా వరద వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఆ ప్రాజెక్టుల కింద ఉన్న రైతుల్లో ఆశలు రేపుతున్నాయని చెబుతున్నారు.
మొత్తానికి ఈ పరిస్థితులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఊరటనిస్తున్నట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేసిన చంద్రబాబు హయాంలో వర్షాభావ పరిస్థితులు ఎదురవడం అత్యంత సహజమే అయినప్పటికీ ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రకృతి శాపంగా విమర్శలు చేయడం ద్వారా సీఎంను మానసికంగా ఇబ్బంది పెట్టేవారని అంటున్నారు. అయితే ఈ సారి ప్రకృతి ఇలాంటి విమర్శలకు అవకాశం ఇవ్వకుండా తాను చంద్రబాబు పక్షాన ఉన్నట్లు నిరూపిస్తోందని అంటున్నారు. గత ఆగస్టులో కర్ణాటక, మహారాష్ట్రల్లో కురిసిన వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకు ఒకేసారి వరదలు వచ్చాయి. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు లిప్ట్ ద్వారా రాయలసీమకు నీటిని తరలించి ఆ ప్రాంతంలో పంటలను కాపాడగలిగారని అంటున్నారు. ఇదే సమయంలో పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు కరువు ఛాయలు లేకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు మిగిలిన ప్రాంతంలోనూ తుఫాను కారణంగా వర్షాలు కురిసి నీటి కొరత లేకుండా పోయిందని విశ్లేషిస్తున్నారు. ఇదంతా గమనిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు పరిస్థితులు అనుకూలిస్తున్నట్లుగా భావించాల్సివస్తోందని అంటున్నారు.