ఒక్క ప్రకటన.. భారతీయులు, సిక్కులు ఆగ్రహజ్వాలలకు వణికిన అమెరికా.. దెబ్బకు డిలీట్

ఆ ప్రకటన బయటకు రావడమే ఆలస్యం.. అమెరికాలోని భారతీయ సమాజం, ముఖ్యంగా సిక్కు సోదరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Update: 2026-09-11 08:30 GMT

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని దారికి తెచ్చి వీలైనంత త్వరగా స్వదేశాలకు సాగనంపడానికి డొనాల్డ్ ట్రంప్ సర్కారు పన్నుతున్న వినూత్న ప్లాన్లు చూస్తుంటే.. వారి మార్కెటింగ్ టీమ్‌కు క్రియేటివిటీ కాస్త సరిహద్దులు దాటి ప్రవహిస్తోందనిపిస్తోంది. "సగౌరవంగా మీ మూటముల్లె సర్దుకుని దేశం వదిలి పోతారా.. లేక మేమే ప్రత్యేక విమానం వేసి పార్సెల్ చేయమంటారా?" అంటూ జనాన్ని కాస్త ఘాటుగా భయపెట్టడానికి ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈసారి ఊరికే హెచ్చరికలతో సరిపెట్టకుండా కాస్త ప్రయోగాత్మకంగా ఉంటుందని భావించి ఏఐ సహాయంతో ఒక సిక్కు సోదరుడి చిత్రాన్ని గీశారు. దానికి ముద్దుగా ‘మిస్టర్ సింగ్’ అని పేరు పెట్టి అమెరికా రోడ్లను వదిలి వెంటనే వెళ్ళిపోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో ఒక ప్రకటనను వదిలారు. ప్రచారం హోరెత్తించి అక్రమ వలసదారుల్లో వణుకు పుట్టిద్దామని భావించిన అధికారులకు.. ఆ ఐడియా తిరిగి సొంత నెత్తినే గొడుగులా చుట్టుకుంటుందని బహుశా ముందే ఊహించి ఉండరు.

ఆ ప్రకటన బయటకు రావడమే ఆలస్యం.. అమెరికాలోని భారతీయ సమాజం, ముఖ్యంగా సిక్కు సోదరులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఎంతో గర్వంగా, గౌరవంగా తమ పేరు చివర తగించుకునే ‘సింగ్’ అనే ఇంటిపేరును తెచ్చి అక్రమ వలసలు, నిబంధనల ఉల్లంఘనలతో ముడిపెట్టడం వెనుక ఉన్న తెలివితేటలను గట్టిగానే ప్రశ్నించారు. "అక్రమ వలసలను అరికట్టడం మీ ప్రభుత్వ విధానమైతే మాకేమీ అభ్యంతరం లేదు కానీ ఒక నిర్దిష్ట సమాజానికి చెందిన పవిత్రమైన ఇంటిపేరును బ్రాండింగ్ చేసి నేరస్తుల్లా చిత్రీకరించడం ఏ రకమైన న్యాయం?" అంటూ సోషల్ మీడియాలో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి మామూలు క్లాస్ పీకలేదు. హాలీవుడ్ విలన్ రేంజ్‌లో బిల్డప్ ఇస్తూ “వెళ్ళిపోండి.. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అని బెదిరింపు ధోరణిలో వాడిన పదజాలం మరింత మంట పుట్టించింది. పైగా సరిగ్గా 9/11 దాడుల వార్షికోత్సవ సమయంలోనే ఈ రకమైన వివాదాస్పద పోస్టర్‌ను వదలి గతంలో సిక్కులు ఎదుర్కొన్న రకరకాల జాతి వివక్షలను, చేదు జ్ఞాపకాలను మళ్ళీ గుర్తుచేశారంటూ భారతీయ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.

భారతీయులు, సిక్కు సంఘాల నుండి వస్తున్న ఆగ్రహజ్వాలలను, సోషల్ మీడియా ట్రోలింగ్‌ను తట్టుకోలేక అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం అధికారులకు రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయింది. ఎలాంటి హడావుడి లేకుండా గప్‌చుప్‌గా ఆ వివాదాస్పద ‘మిస్టర్ సింగ్’ పోస్టును తమ అధికారిక ఖాతాల నుంచి తొలగించి చేతులు దులుపుకున్నారు. అయితే పోస్ట్ డిలీట్ చేసినంత మాత్రాన వివాదం చల్లారలేదు. అక్రమ వలసలను నిరోధించడం కోసం ప్రభుత్వాలు ఇలా ఐడెంటిటీని, మతాన్ని, వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసమనే చర్చ తీవ్రంగా నడుస్తోంది.

ఏది ఏమైనా ప్రచారం పేరిట ఏదో ఒక జాతి లేదా సమాజంపై ముద్ర వేసే ఇటువంటి ‘ఏై ప్రయోగాలను’ పక్కన పెట్టి, ఇప్పటికైనా అమెరికా అధికారులు కాస్త లౌక్యమైన, కామన్ సెన్స్ ఉన్న పబ్లిక్ రిలేషన్స్ టీమ్‌ను నియమించుకుంటే మంచిది. లేదంటే ఇటువంటి విపరీతమైన క్రియేటివిటీ వల్ల ఉన్న గౌరవం కాస్తా ఊడిపోవడం ఖాయం.

Tags:    

Similar News