చిన్న శ్రీను చేరిక.. టీడీపీలో వారికి ఇష్టం లేదు!!
రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా ప్రకటించిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చారని అంటున్నారు.
విజయనగరం జిల్లా పరిషత్ చైర్మను, వైసీపీ కీలక నేత బొత్స మేనల్లుడు చిన్న శ్రీను టీడీపీలో చేరడం ఆ పార్టీలో విస్తృత చర్చకు దారితీస్తోంది. చిన్న శ్రీనుతో ఇప్పటివరకు యుద్ధం చేసిన వారిలో ఎక్కువ మంది ఆయన పార్టీలో రాకను జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అలా అని అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించలేక తీవ్ర అంతర్మథనానికి లోనవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా జడ్పీ చైర్మనుగా సర్వం తానై రాజకీయం నడిపిన చిన్నశ్రీనుతో టీడీపీకి చెందిన అనేక మంది నాయకులు నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డామని, పరస్పర విమర్శలతో గత ఎన్నికల్లో చిన్నశ్రీనును నైతికంగా ఓడించామని చెబుతున్నారు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు తమ పక్కన కూర్చోబెట్టుకుని ఎలా సమర్థించాలో అర్థం కావడం లేదని పలువురు టీడీపీ సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
రెండు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా ప్రకటించిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో ప్రత్యక్షమై అందరికీ షాక్ ఇచ్చారని అంటున్నారు. తాను వైసీపీని వీడుతానని కానీ, టీడీపీలో చేరతానని కానీ ఏ ఒక్కరికి ముందుగా చెప్పని చిన్న శ్రీను అత్యంత రహస్యంగా వ్యవహరించి ఆఖరి నిమిషంలో తన వ్యూహాన్ని బయటపెట్టారని చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి నివాసానికి చిన్న శ్రీను చేరుకుంటారని నిర్ధారించుకున్న కాసేపటికే జిల్లాలో ప్రజాప్రతినిధులు, సీనియర్లకు సమాచారం ఇచ్చారని అంటున్నారు. అంతేకాకుండా జిల్లా నేతలు అంతా మంగళగిరిలో నిర్వహిస్తున్న లీడర్ షిప్ సమ్మిట్ లో ఉండటంతో అందరినీ ముఖ్యమంత్రి నివాసానికి రావాల్సిందిగా ఆదేశించారని అంటున్నారు.
ఇక సీఎం కార్యాలయ సిబ్బంది సూచనలతో ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి వెళ్లిన తర్వాత అక్కడ చిన్నశ్రీనును చూసిన పార్టీ నేతలు షాక్ కు గురయ్యారని చెబుతున్నారు. అప్పటికి కొద్దిసేపటి క్రితమే ఆయన పార్టీలో చేరతారని సమాచారం ఇచ్చి, ఆ వెంటనే కండువా కప్పేలా జరిగిన ఏర్పాట్లు చూసి టీడీపీ సీనియర్లు ఆశ్చర్యపోయారని చెబుతున్నారు. స్థానిక ఎన్నికల దృష్ట్యా పార్టీలో చేరికలను ప్రోత్సహించాల్సివున్నప్పటికీ జిల్లా స్థాయి నేత పార్టీలోకి వచ్చేముందు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని కొందరు నేతలు అంతర్గత సంభాషణల్లో నొచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
విజయనగరం జిల్లాలో టీడీపీ నేతలకు వ్యతిరేకంగా చిన్నశ్రీను సుదీర్ఘంగా రాజకీయం నడిపారు. కాంగ్రెస్, వైసీపీ పార్టీల తరఫున తెరముందు బొత్స, ఆయన సోదరులు, ఇతర కుటుంబ సభ్యులు రాజకీయం చేస్తే వారందరికీ వెన్నుదన్నుగా నిలుస్తూ తెరవెనుక చక్రం తిప్పి, వారి విజయానికి తగిన వ్యూహాలు రచించడం చిన్నశ్రీను చూసేవారని చెబుతున్నారు. అయితే బొత్స కుటుంబ రాజకీయం ఇలా కొనసాగినంత వరకు చిన్నశ్రీనుతో టీడీపీకి పెద్దగా ఇబ్బంది లేదని అంటున్నారు. కానీ, 2021లో ఆయన జడ్పీ చైర్మనుగా తెరముందుకు వచ్చిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయిందని అంటున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ అనుసరించిన విధానాలనే చిన్న శ్రీను కూడా విజయనగరంలో అమలు చేయడంతో రాజకీయ కక్ష సాధింపులు ఎక్కువగా సాగాయని, తమ కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నారని, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారని టీడీపీలోని కొందరు నేతలు ఎత్తిచూపుతున్నారు. అంతేకాకుండా పలువురు టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ పోస్టుల ద్వారా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు. సామాజిక, రాజకీయ సమీకరణాల పేరుతో ప్రత్యర్థులను పార్టీలోకి తేవడం వల్ల సొంత కేడర్ నష్టపోతుందన్న విషయాన్ని పార్టీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.
కాగా, చిన్నశ్రీను చేరికను టీడీపీలో జిల్లాస్థాయి నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ కొందరు నేతలు మాత్రం స్వాగతిస్తున్నారని అంటున్నారు. చిన్నశ్రీనును తీసుకోవడం వల్ల వైసీపీ వెన్నుముక విరిచేసినట్లైందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం జిల్లాలో ఉన్న నేతల్లో దూకుడుగా రాజకీయం చేసే నేతలు తక్కువగా ఉన్నారని, ఉన్న ఒకరిద్దరికి చిన్నశ్రీను జత కలిస్తే భవిష్యత్తులో పార్టీ మరింత బలపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న వారు సైతం ఎక్కువగానే ఉన్నారంటున్నారు. ఇప్పటివరకు జిల్లాకు పెద్ద దిక్కుగా వ్యవహరించిన అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్ గా వెళ్లిపోవడం, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఇప్పటికీ జిల్లాపై పట్టుసాధించలేకపోవడం వల్ల చిన్న శ్రీను రాక కలిసివస్తుందని మరికొందరు సమర్థిస్తున్నారు. మొత్తానికి చిన్న శ్రీను టీడీపీ కండువా కప్పుకోవడంపై ఆ పార్టీలో రెండు రోజులుగా వాడివేడి చర్చలు కొనసాగుతూనే ఉన్నాయని అంటున్నారు.