మహేష్, రాజమౌళి, వీవీఎస్ లకు నోటీసులు

ఈ జాబితాలో అగ్ర హీరో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, విక్టరీ వెంకటేష్ దంపతులు, నటి సమంత, యువ కథానాయకులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వంటి టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు.

Update: 2026-09-11 07:11 GMT

ఓటు హక్కు పొందడం సాధారణ పౌరుడికే కాదు.. వెండితెరను ఏలే హీరోలకు, ఆస్కార్ స్థాయి దర్శకులకు కూడా అంత సులువేమీ కాదని తెలంగాణ ఎన్నికల సంఘం నిరూపించింది. రాష్టంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా అధికారులు పంపిన నోటీసులు చూసి టాలీవుడ్, స్పోర్ట్స్ సెలబ్రెటీలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ సినీ, క్రీడా, వ్యాపార ప్రముఖులకు గట్టి షాకే ఇచ్చింది. ఆగస్టు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించిన అనంతరం అధికారుల పరిశీలనలో పలువురు దిగ్గజాల పేర్లు వ్యత్యాసాల జాబితాలోకి ఎక్కడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ జాబితాలో అగ్ర హీరో మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత శిరోద్కర్, విక్టరీ వెంకటేష్ దంపతులు, నటి సమంత, యువ కథానాయకులు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వంటి టాలీవుడ్ ప్రముఖులు ఉన్నారు. కేవలం చిత్ర పరిశ్రమకే పరిమితం కాకుండా క్రీడా రంగానికి చెందిన భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, బ్యాడ్మింటన్ దిగ్గజాలు పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ప్రముఖ వ్యాపారవేత్త ఉపాసన కొణిదెలతో పాటు దివీస్ లేబొరేటరీస్ అధినేత మురళీకృష్ణ ప్రసాద్ దివి పేర్లు కూడా ఈ పరిశీలన నోటీసుల్లో దర్శనమిచ్చాయి.

కోట్ల మంది అభిమానులను తన విజువల్ వండర్లతో మెప్పించే దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇంటి పేరులో స్పెల్లింగ్ సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాల్సి రావడం, థియేటర్లలో రికార్డులు తిరగరాసే మహేష్ బాబు వివరాలు పాత ఎస్ఐఆర్ రికార్డులతో సరిపోలకపోవడం నిజంగానే ఒక విచిత్రమైన పరిస్థితి. అధికారులు నోటీసులు జారీ చేయడానికి చెప్పిన కారణాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. పేర్లలో అక్షర దోషాలు, తల్లిదండ్రుల వివరాల్లో తేడాలు, పాత డేటాతో పొసగకపోవడం వంటి సాంకేతిక కారణాలు చూపుతుండగా.. కొన్ని చోట్ల అసలు వ్యత్యాసం ఏమిటో చెప్పే కాలమ్‌ను కూడా ఖాళీగా వదిలేసి నోటీసులు పంపడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.

ఈ వ్యవహారంపై స్పందించిన హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్ చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. సాధారణ ఓటర్ల మాదిరిగానే ప్రముఖుల వివరాల్లోనూ వ్యత్యాసాలు రావడం వల్లే ఈ నోటీసులు జారీ చేశామని.. నోటీసు అందుకున్నంత మాత్రాన ఓటు హక్కు రద్దయినట్లు కాదని వివరణ ఇచ్చారు. అయితే ఈ విచారణ ప్రక్రియకు ప్రముఖులు స్వయంగా రావలసిన అవసరం లేదని.. వారి తరఫున ప్రతినిధులను పంపే వెసులుబాటు ఉందనడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.

సినిమాల్లో విలన్లను ధూళిపటం చేసే హీరోలు, ఆన్-ఫీల్డ్ సిక్సర్లతో ప్రత్యర్థులను భయపెట్టే క్రీడాకారులు ఇప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్ ముందు ప్రూఫ్‌లు పట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి రావడం ఒక రీల్ వర్సెస్ రియల్ డ్రామాను తలపిస్తోంది. వెండితెరపై మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్లు తీసే రాజమౌళికి కూడా ఈసారి బిఎల్ఓ క్రియేట్ చేసిన సస్పెన్స్ అర్థం కాక తలపట్టుకోవాల్సి వచ్చింది.

అయితే ఈ సరదా అంశం వెనుక ఒక తీవ్రమైన సామాజిక ప్రశ్న దాగి ఉంది. కోట్ల విలువైన సామ్రాజ్యాలు, లాయర్లు, ప్రతినిధులు ఉన్న సెలబ్రిటీలు ఎలాగోలా తమ ఓటు హక్కును కాపాడుకోగలరు. కానీ ఏ మారుమూల గ్రామంలోనో ఒంటరిగా జీవించే నిరక్షరాస్య వృద్ధురాలి పేరులో చిన్న తప్పు దొర్లి నోటీసు వస్తే.. ఆమె పరిస్థితి ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ విలువైందే అయినప్పుడు, ఇటువంటి సాంకేతిక లోపాల వల్ల ఏ ఒక్క సామాన్య పౌరుడి ఓటు హక్కు మాయమైపోకుండా చూడాల్సిన గురుతర బాధ్యత ఎన్నికల యంత్రాంగంపైనే ఉంది. ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News