80s Trend : 'విష' పూరితమవుతున్న వినోదం !

కాంగ్రెస్ సేవాదళ్ రాహుల్ గాంధీ ఫోటోలు షేర్ చేసింది. శశిథరూర్ 1980నాటి తన ఒరిజినల్ ఫోటోలు షేర్ చేశారు.

Update: 2026-09-11 05:54 GMT

‘’Vibing to the 80s trend’’. ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నది. ఇన్ స్టా, ఫేస్ బుక్, ఎక్స్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల్లో చాట్ జీపీటీ, ఇతర ఏఐ టూల్స్ ఉపయోగించి 1980ల శైలిలో పాత హెయిర్ స్టైల్, ఫిల్మ్ గ్రెయిన్, వింటేజ్ లుక్ తో మార్చుకున్న ఫోటోలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. నాస్టాల్జిక్, ఫన్ ట్రెండ్ గా మొదలైన ఇది ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య యుద్ధానికి కారణమవుతున్నాయి.

మొదటగా బీజేపీ నాయకులు ఈ 80s ట్రెండ్ లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు, శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, అనురాగ్ ఠాకూర్ తదితరులు తమ ఏఐ 80 ఫోటోలు షేర్ చేశారు. బీజేపీ అధికారిక హ్యాండిల్ కూడా నరేంద్ర మోడీ ఫోటోలు షేర్ చేసింది. కాంగ్రెస్ సేవాదళ్ రాహుల్ గాంధీ ఫోటోలు షేర్ చేసింది. శశిథరూర్ 1980నాటి తన ఒరిజినల్ ఫోటోలు షేర్ చేశారు.

ఈ నేపథ్యంలో కేరళ కాంగ్రెస్ యూనిట్ దీనిని రాజకీయ విమర్శలు, వ్యంగ్యాస్త్రాలకు వినియోగించింది. ఓమ్ని వ్యానులో కూర్చున్న బట్టతల వ్యక్తి ఫోటో షేర్ చేసి ‘A Gujarat Street In the 1980s’ అనే క్యాప్షన్ ఇచ్చింది. దానిపక్కన గోడ మీద ‘ప్లీజ్ స్మైల్ . మీరు ఢిల్లీలో ఉన్నారు’ అని పేర్కొంది. ఇక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఉద్దేశించి ఈ ఇమేజ్ సృష్టించినట్లు అర్థమవుతోంది.

దీనికి స్పందించిన బీజేపీ తెలంగాణ బార్ టేబుల్ మీద ఎర్ర డ్రెస్ లో నృత్యం చేస్తున్న మహిళ ఏఐ ఇమేజ్ పెట్టి ‘Lusiana, Italy. Circa-1970s’ అని క్యాప్షన్ పెట్టారు. సోనియాగాంధీ జన్మస్థలం ఇటలీలోని లూసియానా నేపథ్యంలో ఇలా పెట్టారు. బీజేపీ కేరళ, బీజేపీ గుజరాత్ యూనిట్లు సోనియా గాంధీని లక్ష్యంగా చేసుకుని దాడిని తీవ్రం చేశాయి. 1980లలో కాంగ్రెస్ పాలన, సిక్కుల హక్కుల పరిణామాలు ఉదహరిస్తూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో దాడులు చేసుకున్నాయి. ఇది జాతీయస్థాయిలో తీవ్ర చర్చనీయాంశం అయింది.

ఈ వ్యవహారం శృతిమించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినోదాత్మకంగా, వివేకవంతంగా ఉండాల్సిన సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు సెన్స్ లెస్ గా ప్రవర్తిస్తున్నాయని అంటున్నారు. ఏఐని రాజకీయ క్యాంపెయిన్ లకు ఉపయోగించడం మూలంగా నెగటివ్ ప్రచారం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

కేరళ కాంగ్రెస్ యూనిట్ మొదలు పెట్టిన ఈ రాజకీయ వార్ తెలంగాణ, గుజరాత్ , కేరళ బీజేపీ యూనిట్ల నుండి జాతీయస్థాయికి చేరుకుంది. ఒక పార్టీ మీద మరొక పార్టీ పరస్పర దాడిలో మీమ్ వార్ గా మార్చేశాయి. ఏఐ సాధనాలు రాజకీయ ప్రచారంలో ఎంత వేగంగా ఉపయోగిస్తున్నారో ఈ పరిణామాలు అద్దం పడుతున్నాయి.

Tags:    

Similar News