వైసీపీకి ఇప్పటికీ అర్ధం కాని విషయం ?
ఏపీలో వైసీపీ ఏర్పాటు అయి 15 ఏళ్ళు అవుతోంది. ఒక వ్యక్తిగా జగన్ ఈ పార్టీని స్థాపించారు. ఆయన తన తల్లితో కలిసి ఉప ఎన్నికలను కడపలో తీసుకుని వచ్చారు.
ఏపీలో వైసీపీ ఏర్పాటు అయి 15 ఏళ్ళు అవుతోంది. ఒక వ్యక్తిగా జగన్ ఈ పార్టీని స్థాపించారు. ఆయన తన తల్లితో కలిసి ఉప ఎన్నికలను కడపలో తీసుకుని వచ్చారు. అలా జరిగిన కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే ఉప ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సొంతం చేసుకుంది. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మొత్తం 18 సీట్లకు గానూ 16 గెలిచి తన స్థానం సుస్థిరం చేసుకుంది. 2014లో అయితే అధికారం దరిదాపుల్లోకి వచ్చి మరీ బలమైన ప్రతిపక్షంగా అవిర్భవించింది. ఇక 2019 ఎన్నికల్లో అయితే 151 సీట్లతో అనూహ్యమైన తీరులో సక్సెస్ అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇలా వైసీపీ అన్ని దశలనూ చూసింది. ఇక వైసీపీ సంస్థాగతంగా కూడా వార్డు స్థాయి నుంచి పార్లమెంట్ వరకూ బలపడుతూ వచ్చింది. ఈ క్రమంలో అనేక మందికి పార్టీ పరంగా ప్రభుత్వ పదవుల పరంగా అవకాశాలు ఇచ్చింది.
ఎంత దగ్గరకు తీసినా :
ఇక వైసీపీ అధినాయకత్వం ఒక సూత్రాన్ని పదవుల భర్తీలో అనుసరిస్తూ వచ్చింది. సామాజిక వర్గాన్ని ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటోంది. అలాగే దానితో పాటుగా వారి విషయంలో ఎమోషనల్ టచ్ ని కూడా గమనంలోకి తీసుకుని పదవులు ఇస్తూ వచ్చింది. పార్టీ మొదటి నుంచి ఉన్నారనో లేక అధినేతకు దగ్గరగా ఉన్నారనో కారణాలు చూసి పదవులు ఇచ్చింది. ఈ విషయంలో కొందరికి మరీ ఎక్కువ చేసి పదవులు కట్టబెట్టింది. ఒకటి కంటే ఎక్కువ పదవులు దక్కించుకున్న వారు ఉన్నారు, వరసగా ఒకదాని తరువాత మరో పదవి అందుకున్న వారూ ఉన్నారు అని గుర్తు చేస్తున్నారు. ఇలా ఎక్కువ పదవులు దక్కించుకున్న వారే చివరికి పార్టీని వదిలి బయటకు పోతున్నారు అన్నది చాలా ఆలస్యంగా వైసీపీ గుర్తించింది అని అంటున్నారు.
రివర్స్ లో ఉందిగా :
సాధారణంగా పార్టీలో పదవులు దక్కని వారు అసంతృప్తితో పార్టీని వీడుతారు. కానీ పదవులు దక్కిన వారు కూడా వెళ్ళిపోవడమే వైసీపీని కలవరపెడుతోంది అని అంటున్నారు. వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి చెందాక వరసగా పార్టీని వీడిన వారి జాబితా పరిశీలిస్తే ఎవరికీ అధినాయకత్వం అన్యాయం చేయలేదని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆళ్ళ నాని, మోపిదేవి వెంకటరమణ, టీడీపీ నుంచి వచ్చిన బీద మస్తాన్ రావు, బీసీ నేత ఆర్ క్రిష్ణయ్యలతో పాటు, ఎమ్మెల్సీలుగా చాన్స్ ఇచ్చిన వారు కూడా పార్టీని వీడిపోయారు అని గుర్తు చేసుకుంటున్నారు. ఇక పరాకాష్టగా విజయసాయిరెడ్డి వైసీపీని వీడడం అని అంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే చిన్న శ్రీను చేతిలో నాలుగైదు పదవులు ఉండగానే వైసీపీకి గుడ్ బై చెప్పడంతో వైసీపీలో ఒక విధంగా అంతర్మధనం సాగుతోంది అని అంటున్నారు.
మహిళల విషయంలో :
ఇక వైసీపీ మహిళా నాయకురాళ్ళ విషయం తీసుకుంటే ఎక్కువ మంది పార్టీని అట్టిపెట్టుకొని ఉన్నారని అంటున్నారు. వారికి పదవులు ఇస్తే పార్టీ కష్ట కాలమలో ఉన్నపుడు గొంతు పెంచి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు అని గుర్తు చేసుకుంటున్నారు. మహిళా నాయకురాళ్ళలో కూడా వాసిరెడ్డి పద్మ అలాగే పోతుల సునీత గంటా పద్మశ్రీ లాంటి వారు వైసీపీని వీడినా ఎక్కువ మంది ఇప్పటికీ కలిసే ప్రయాణిస్తున్నారు అని అంటున్నారు. దాంతో వైసీపీ ఇక మీదట పార్టీ పదవుల పంపిణీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తీవ్రంగా ఆలోచిస్తోంది అని అంటున్నారు. సమీకరణలు చూసో లేక భావోద్వేగాలతోనో పదవులు కట్టబెడితే తీరా వారు కష్టంలో ఉండక చాప చుట్టేసి పోతున్నారు అని అంటున్నారు. ఇక మీదట టీడీపీ అధినాయకత్వం మాదిరిగా ఒకటికి పది మార్లు మధింపు చేసుకుని పదవులు ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. అలాగే విశ్వాసం నిబద్ధత కూడా ప్రధాన అంశాలుగా ఉండాలని యోచిస్తున్నారు. మొత్తం మీద వరసగా వైసీపీని వీడుతున్న వారిని చూస్తున్న వైసీపీ అయితే ఇక మీదట పదవుల పందేరంలో సరికొత్త సూత్రాలను అనుసరించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మరి పదవులు ఇచ్చే ముందు వైసీపీ ఇకనైనా తగిన చర్యలు తీసుకుంటుందా అంటే వేచి చూడాల్సి ఉంది.