అచ్చెన్నాయుడు ది బెస్ట్...మంత్రుల ర్యాంకులు ఇలా !

ఇక తాజాగా జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మంత్రులు వివిధ విభాగాల అధిపతులు కలెక్టర్లు ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో పనితీరుని మధింపు చేశారు. బాగా పని చేసిన వారిని మెచ్చుకున్నారు.

Update: 2026-09-12 02:21 GMT

ఏపీలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తన పనితీరుతో పాటు అందరి గురించి కూడా మధింపు చేసి ర్యాంకులు ఇస్తూంటారు. ఈ విషయంలో ఆయన ఎక్కడా ఉపేక్షించేది ఉండదు, బాగా పనిచేసిన వారిని మెచ్చుకుంటూనే చేయని వారి తొందరగా చేయమని దిశా నిర్దేశం చేస్తూంటారు. ఇక తాజాగా జరిగిన 8వ కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మంత్రులు వివిధ విభాగాల అధిపతులు కలెక్టర్లు ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో పనితీరుని మధింపు చేశారు. బాగా పని చేసిన వారిని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రుల జాబితాలో చూస్తే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి ఈ ఫైల్స్ క్లియరెన్స్‌లో వరుసగా మూడోసారి మొదటి స్థానం దక్కడం విశేషం.

చంద్రబాబు ప్రశంసలు :

ఇదిలా ఉంటే ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు సృష్టించారని అంటున్నారు. అత్యంత వేగంగానే కాకుండా పారదర్శకంగా సమర్థవంతంగా ఫైళ్లను పరిష్కరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడిని బాబు అభినందించారు. ఫైళ్ల పరిష్కారంలో వేగంతో పాటు స్పష్టత, పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రి అచ్చెన్నాయుడు ముందుకు సాగుతున్నారని సమావేశంలోనే బాబు ప్రశంసించారు. ప్రభుత్వ పరిపాలనలో జాప్యాన్ని తగ్గిస్తూ, నిర్ణయాలను వేగంగా తీసుకోవడంలో ఈ-ఫైలింగ్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో వరుసగా మూడోసారి మొదటి స్థానాన్ని సాధించడం అచ్చెన్నాయుడు పనితీరుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. గంటల వ్యవధిలోనే ఫైళ్లను పరిశీలించి పరిష్కరించడం ద్వారా అచ్చెన్నాయుడు ప్రత్యేకతను చాటుతున్నారని అభినందించారు. అచ్చెన్నాయుడు కొనసాగిస్తున్న పనితీరు ఇతర శాఖలకు కూడా ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు.

ఆ మంత్రులు మెరుగుపడాలి :

ఇక ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో లో మిగిలిన మంత్రుల వివరాలు చూస్తే రాంప్రసాద్‌రెడ్డి, కొల్లు రవీంద్ర, పయ్యావుల కేశవ్‌ వద్ద ఫైళ్ల క్లియరెన్స్‌కు ఎక్కువ సమయం పడుతోందని చంద్రబాబు ప్రస్తావించారు. తాను కూడా కొన్ని ఫైల్స్‌ క్లియర్‌ చేయడానికి నాలుగు రోజులు తీసుకుంటున్నానని స్వయంగా చంద్రబాబు చెప్పడం విశేషం. ఇక హోంమంత్రి అనిత సహా ప్రతి ఒక్కరూ నిర్ణయాల వేగాన్ని మెరుగుపరుచుకోవాలని బాబు సూచించారు. ప్రభుత్వంలో ఫైల్‌ కదలికకు పట్టే ప్రతి రోజు పాలనపై ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. అలాగే అధికారులు వేగంగా స్పందించి ప్రజలకు ప్రభుత్వానికి ఫలితాలు అందించేలా పని చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

జాప్యం ఉండరాదు :

ప్రభుత్వంలో పాలన వేగంగా సాగాలంటే ఫైళ్ళ పరిష్కరించడంలో జాప్యం ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు. మంత్రులు, కార్యదర్శులు, కలెక్టర్లు ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫైళ్లను సకాలంలో క్లియర్ చేయకుండా జాప్యం చేస్తున్న అధికారుల తీరుపై బాబు ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. రెండు రోజులు లేదా అంతకంటే తక్కువ సమయంలో ఫైళ్లను క్లియర్ చేసిన అధికారులను ప్రశంసించిన బాబు అదే సమయంలో గంటల్లోనే ఫైళ్లను క్లియర్ చేసిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఇక ఆన్‌లైన్ ద్వారానే ఫైళ్లను నిర్వహించాలని, ఇందుకు నెల రోజుల గడువు ఇస్తున్నామని తెలిపారు. మాన్యువల్ ఫైళ్లు నడిపితే ఇకపై తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. మాన్యువల్ ఫైళ్ల నిర్వహణపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ఈ అంశంపై మంత్రులు కూడా దృష్టి పెట్టాలని బాబు సూచించారు.

Tags:    

Similar News