శభాష్...పాక్ ని గేటు బయటే ఉంచిన భారత్ !
ఏ చిన్న పాటి అవకాశం దొరికినా భారత్ మీద దాయాది పాక్ విరుచుకుపడడానికి చూస్తుంది అన్నది తెలిసిందే.
ఏ చిన్న పాటి అవకాశం దొరికినా భారత్ మీద దాయాది పాక్ విరుచుకుపడడానికి చూస్తుంది అన్నది తెలిసిందే. భారత్ తో వెయ్యేళ్ళ పాటు యుద్ధం చేస్తామని ప్రకటించిన ఆ దేశం నోటితో కూడా మంచి మాట చెప్పదు, నొసటితో మాత్రమే కాదు నిలువెల్లా భారత్ పట్ల అసూయను ద్వేషాన్ని వెళ్ళగక్కుతోంది. అందుకే భారత్ పాక్ ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టింది. తాజాగా చూస్తే ఢిల్లీ వేదికగా అంగరంగ వైభవంగా బ్రిక్స్ అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది. ఇందులో పదకొండు దేశాలు ఉన్నాయి. ప్రత్యేకించి చైనా రష్యా కూడా ఉన్నాయి. కానీ పక్కనే ఉన్న పాక్ కి మాత్రం బ్రిక్స్ లో ప్లేస్ లేదు, ఇలా ఎందుకు అంటే పాక్ బుద్ధి చూసే భారత్ పక్కన పెట్టింది అని అంటున్నారు.
చేరుతామని అంటున్నా :
బ్రిక్స్ లో చేరడానికి పాకిస్తాన్ చాలా కాలంగానే ప్రయత్నం చేస్తోంది. జీ 7 కంటే పవర్ ఫుల్ గా మారుతున్న బ్రిక్స్ గురించి అంతర్జాతీయ సమాజమే ఆలోచిస్తున్న వేళ తాను కూడా అందులో చేరి తన ఆర్ధిక పరిస్థితిని మెరుగుపరచుకోవడమే కాదు బహు పాక్షిక సంబంధాలను అభివృద్ధి చేసుకుంటే తన ప్రతిష్ట కూడా పెరుగుతుందని పాక్ ఆశ పెట్టుకుంటోంది. కానీ బ్రిక్స్ లో చేరాలీ అంటే భారత్ అనుమతి ఉండాలి. అక్కడే పాక్ కి తేడా కొడుతోంది. పాక్ ఎంతగా ఒత్తిడి పెడుతున్నా మరెంతలా ప్రయత్నం చేస్తున్నా భారత్ అయితే ససేమిరా అనే అంటోంది.
మూడేళ్ళ నుంచి :
ఇక పాక్ తీరు చూస్తే బ్రిక్స్ లో చేరి పోవాలన్న అతి ఉత్సాహం కనిపిస్తోంది. మూడేళ్ళుగా ఆ దేశం చేయని ప్రయత్నం లేదు, 2023 లోనే పాక్ తన సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది అని గుర్తు చేస్తున్నారు. అయితే బ్రిక్స్ లో ఉన్న నిబంధనలు ప్రకారం అన్ని దేశాలూ అంగీకరిస్తేనే ఏ కొత్త దేశానికి అయినా సభ్యత్వం లభిస్తుంది. అలా బ్రిక్స్ లో ఎంట్రీ కోసం పాక్ ఎంతలా ప్రాధేయపడుతున్నా భారత్ నుంచి మాత్రం సానుకూలత రాకపోవడంతో పాక్ ఆశలు అడియాసలు అవుతున్నాయి. ఇక తాజాగా సెప్టెంబర్ 12, 13 తేదీలలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ లో సభ్యత్వం సంపాదించేందుకు పాక్ ఎత్తులే వేసింది అని అంటున్నారు. తనకు సన్నిహితంగా ఉంటూ వస్తున్న చైనా రష్యా దేశాల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నించింది అని కధనాలు వచ్చాయి. రష్యాలో పాకిస్తాన్ రాయబారి మహమ్మద్ ఖలీద్ జమాలీ అయితే దీని మీద మాట్లాడుతూ బ్రిక్స్ సభ్య దేశాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా కూడా వెల్లడించారు.
భారత్ కీలకం :
బ్రిక్స్ లో భారత్ అత్యంత కీలక దేశంగా ఉంది. ఇప్పటికి 18 ఏళ్ళ క్రితం బ్రిక్స్ ఏర్పడితే ఇప్పటికి నాలుగు సమావేశాలు భారత్ వేదికగా జరిగాయి. అంతే కాదు ఇపుడు సభ్య దేశాల సంఖ్య కూడా పెరిగింది. భారత్ వాణిజ్యం కూడా బ్రిక్స్ దేశాలతో కలసి బాగా పెరిగింది. బ్రిక్స్ దేశాలకు భారత్ ఎగుమతులు 48.8 శాతం విస్తరించాయి. అవి 64.3 బీల్యన్ డాలర్ల నుంచి 95.7 బిలియన్ డాలర్లకు ఎగబాకాయి. ప్రపంచంలో కూడా భారత్ ప్రతిష్ట విస్తరించింది. దీంతో దాయాది పాక్ కి కన్ను కుడుతోంది. తనను కూడా చేర్చుకోవాలని ఎంతగానో ఆరాటపడుతోంది. అందుకు చేయని ప్రయత్నం లేదు. అయితే భారత్ ఆమోదం లేకపోతే పాక్ బ్రిక్స్ గేట్ బయటనే ఉంటుంది తప్పించి లోపలికి నో ఎంట్రీ అని అంతర్జాతీయ నిపుణులు అంటున్నారు. భారత్ మాత్రం పాక్ విషయంలో కఠినంగా ఉండడం పట్ల భారతీయులతో సహా అంతా శభాష్ అని అంటున్నారు.