అరకుకు చిన్న శ్రీను...కుమార్తెకు టికెట్ ?
ఇదిలా ఉంటే చిన్న శ్రీనుకు టీడీపీలో చేరిన నెల రోజులకే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో పరిశీలకుడి బాధ్యత అంటే కీలకమే కాదు గౌరవంగా అనుచరులు భావిస్తున్నారు.
కాంగ్రెస్ వైసీపీలలో దశాబ్దాల పాటు పనిచేసి ఆల్ ఆఫ్ సడెన్ గా టీడీపీలోకి వెళ్ళిన సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చిన్న శ్రీనుకు టీడీపీ అధినాయకత్వం కీలక పదవిని ఇచ్చింది. ఆయనను అరకు పార్లమెంట్ టీడీపీ పరిశీలకుడిగా నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పార్టీని అక్కడ పటిష్టం చేయడం నాయకత్వాన్ని కో ఆర్డినేట్ చేసుకుంటూ విజయం దిశగా నడిపించడం కోసం ఈ బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు. అరకు పార్లమెంట్ పరిధిలో పాడేరు, అరకు, సాలూరు, పార్వతీపురం, కురుపాం, పాలకొండ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో చాలా వరకూ ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఉండడంతో చిన్న శ్రీను రాజకీయ అనుభవం దృష్ట్యా ఈ బాధ్యతలు అప్పగించారు అని అంటున్నారు.
హర్షం వ్యక్తం అయినా :
ఇదిలా ఉంటే చిన్న శ్రీనుకు టీడీపీలో చేరిన నెల రోజులకే ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో పరిశీలకుడి బాధ్యత అంటే కీలకమే కాదు గౌరవంగా అనుచరులు భావిస్తున్నారు. టీడీపీలో తమ నాయకుడికి తగిన గుర్తింపు దక్కిందని వారు అంటున్నారు. అయితే విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా చిన్న శ్రీనుని నియమిస్తారు అని అంతా భావించారు. కానీ ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో నాయకత్వం మార్పు అన్నది చేయకుండా తగిన సమయంలోనే నిర్ణయాలు తీసుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా చిన్న శ్రీను సేవలను పార్టీ ఉపయోగించుకుంటుంది అనడానికి నిదర్శనంగా ఆయనకు దక్కిన పదవి అని గుర్తు చేస్తున్నారు. అయితే చిన్న శ్రీను వరకూ బాగానే ఉన్నా విజయనగరం జిల్లాలో పార్టీలో ఆయన ప్రభావం ఎంత ఆయన వెంట వచ్చిన అనుచరులకు ఏ విధంగా అకామిడేషన్ కల్పిస్తారు, అన్నింటికీ మించి ఆయన వారసురాలు అయిన కుమార్తెకి టికెట్ దక్కుతుందా లేదా అన్న చర్చ అయితే సాగుతోంది.
రెండు చోట్ల పోటీ :
ఇక విజయనగరం కార్పొరేషన్ మేయర్ పదవి కోసం జనసేన గట్టిగా ప్రయత్నం చేస్తోంది. పొత్తులో భాగంగా కేటాయిస్తారు అని ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. మరో వైపు చూస్తే మేయర్ జనసేనకు పోతే టీడీపీకి జిల్లా పరిషత్ పీఠం ఉంటుందని అంటున్నారు. ఈ పీఠం కోసం కూడా పలువురు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో ఎవరికి ఈ అభ్యర్ధిత్వం దక్కుతుందన్నది చర్చగా ఉంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తన వారసుడి కోసం ఈ పదవి మీద ఫోకస్ పెట్టారు అని అంటున్నారు. అలాగే పలువురు సీనియర్ నేతల దృష్టి కూడా ఉంది. మరి చిన్న శ్రీను కుమార్తె సిరి సహస్ర కూడా ఈ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఆమెకు టికెట్ ఇస్తారా లేదా అన్నదే ఇపుడు హాట్ టాపిక్ గా ఉంది.
సముచిత స్థానం :
అయితే స్థానిక సంస్థల ఎన్నికలు టీడీపీకి చాలా ముఖ్యం. కూటమి నూరు శాతం స్ట్రైక్ రేటు తో సక్సెస్ కొట్టాలని చూస్తోంది. అసంతృప్తులకు తావు లేకుండా మూడు పార్టీలు ముందుకు సాగాలని అనుకుంటున్నాయి. దాంతో మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఇక టీడీపీలో చేరిన చిన్న శ్రీను బృందానికి కూడా సముచిత స్థానం ఉంటుందని అంటున్నారు. అందుకే చిన్న శ్రీనుకు పదవి ఇచ్చారని చెబుతున్నారు. దాంతో ఆయన కుమార్తె పోటీ చేస్తారా లేదా అన్నది అయితే చర్చగా ఉన్నా కొద్ది రోజులలో జవాబు వస్తుందని అంటున్నారు.