మన హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కు ప్రపంచస్థాయి గుర్తింపు.. అరుదైన ఘనత

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో మరొక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

Update: 2026-07-31 04:53 GMT

సాధారణంగా ఎయిర్‌పోర్ట్ అంటే గుర్తొచ్చేది సెక్యూరిటీ చెకింగ్ లాలీపాప్‌లు.. క్యూలైన్ల విసుగులు.. గంటల తరబడి నిరీక్షణలు.. కానీ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అడుగుపెడితే మాత్రం ప్రయాణం ఒక 'హాట్ అండ్ స్వీట్' ఎక్స్‌పీరియన్స్.. పక్కా లోకల్ ఆతిథ్యానికి విదేశీ హైటెక్ హంగులు తోడవ్వడంతో... ప్రపంచంలోనే బెస్ట్ ఎయిర్‌పోర్ట్‌ల సరసన నిలిచి రేర్ రికార్డు కొట్టింది. ఏకంగా గ్లోబల్ విమానాశ్రయాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఏసీఐ సంస్థ ఇచ్చే అత్యున్నత 'లెవల్-5' కిరీటాన్ని తన ఖాతాలో వేసుకుంది.

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో మరొక అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల పనితీరు, ప్రయాణికుల అనుభవాన్ని అంచనా వేసే 'ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్' (ఏసీఐ) అందించే ఎయిర్‌పోర్ట్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ అక్రిడిటేషన్ ప్రోగ్రామ్ కింద అత్యున్నతమైన ‘లెవల్-5’ అక్రిడిటేషన్ ను దక్కించుకుంది. ఈ గుర్తింపు ద్వారా ప్రపంచ స్థాయి ప్రయాణికుల సేవలను అందిస్తున్న అగ్రగామి విమానాశ్రయంగా హైదరాబాద్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది.

లెవల్-5 అక్రిడిటేషన్ ప్రత్యేకత ఏమిటి?

'లెవల్-5' అనేది విమానాశ్రయాల నిర్వహణలో లభించే అత్యున్నత స్థాయి గుర్తింపు. ఏసీఐ సంస్థ కింది అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత మాత్రమే దీనిని ఖరారు చేస్తుంది. ప్రయాణికుల సేవలు.. మౌలిక సౌకర్యాలు.. అంతర్జాతీయ నిర్వహణ ప్రమాణాలు.. ఆధునిక సాంకేతిక వినియోగం.. ప్రయాణికుల సంతృప్తి, అభిప్రాయాలు తీసుకుంటారు. ఈ గుర్తింపు లభించడంతో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ పూర్తిస్థాయి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలను అందిస్తోందని మరోసారి స్పష్టమైంది.

ఈ ఘనతకు కారణమైన కీలక అంశాలు

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సులభమైన ప్రయాణ అనుభవాన్ని కల్పించేందుకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నిరంతరం కృషి చేస్తోంది. ముఖ్యంగా వేగవంతమైన డిజిటల్ సేవలు.. సమర్థవంతమైన చెక్-ఇన్ ప్రక్రియ మరియు భద్రతా తనిఖీలు... నాణ్యమైన వాతావరణం, అత్యంత పరిశుభ్రమైన టెర్మినల్స్. ప్రత్యేక అవసరాలున్న ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యాలు కల్పిస్తోంది. దీంతో పాటు భారతీయ ఆతిథ్యం ఇస్తోంది. దేశీయ ఆతిథ్య సంప్రదాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో మేళవిస్తూ సిబ్బంది అందించే మర్యాదపూర్వక సేవలు ఆకట్టుకుంటున్నాయి. భారతీయ ఆతిథ్య సంప్రదాయాలను అంతర్జాతీయ ప్రమాణాలతో మేళవిస్తూ ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభవాన్ని అందించడంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను, నిరంతర సేవా మెరుగుదలను ఏసీఐ ప్రత్యేకంగా ప్రశంసించింది.

దేశానికే గర్వకారణంగా హైదరాబాద్ ఎయిర్ పోర్టు

ఇటీవలి కాలంలో భారత్‌లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో ఒకటిగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టు నిలుస్తోంది. పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక వసతులను విస్తరించడం, నిరంతరం అత్యాధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అంతర్జాతీయంగా తన ముద్రను మరింత బలోపేతం చేసుకుంటోంది.

ఈ లెవల్-5 అక్రిడిటేషన్తో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులో కూడా ప్రయాణికులకు మరింత మెరుగైన, అత్యుత్తమ సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ పురస్కారం నిరూపిస్తోంది.

Tags:    

Similar News