అడ కత్తెర లో పోతిన.. జనసేనలో కి రీ ఎంట్రీ.. ?
పోతిన మహేష్.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఫైర్‌బ్రాండ్ నాయకుడు, విజయవాడ రాజకీయాల్లో ఎదగాలని.. పదవులు చేపట్టాలని భావిస్తున్న యువ నేతగా ఆయనకు పేరుంది.
పోతిన మహేష్.. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఫైర్‌బ్రాండ్ నాయకుడు, విజయవాడ రాజకీయాల్లో ఎదగాలని.. పదవులు చేపట్టాలని భావిస్తున్న యువ నేతగా ఆయనకు పేరుంది. స్థానిక పశ్చిమ నియోజకవర్గంలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉందని అభిమానులు చెబుతారు. ఆయన రాజకీయం జనసేనతోనే ప్రారంభమైంది. పవన కల్యాణ్‌కు అత్యంత అభిమానిగా కూడా పోతిన పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అడ కత్తెరలో ఉందని ప్రచారం జరుగుతోంది.
వాస్తవానికి పశ్చిమ నియోజకవర్గం టికెట్‌పై పోతిన చాలానే ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి ఆయన ఈ టికెట్ వస్తుందని భావించి ప్రచారానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు. దీంతో పోతిన ఛాన్స్ మిస్సయ్యారు. అనంతర పరిణామాల తో ఆయన జనసేన ను వీడి వైసీపీలోకి వచ్చారు. ఈ పార్టీలోనూ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో మిస్సయిన ఛాన్స్ ఇప్పుడైనా దక్కుతుందా? అనేది పోతిన ఆలోచన.
కానీ, వైసీపీలోనూ పోతినకు అవకాశం చిక్కడం లేదు. విజయవాడలోని మూడు స్థానాల్లోనూ వైసీపీకి నాయకులు భారీగానే ఉన్నారు. ముఖ్యంగా పశ్చిమ సీటు నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో పోతిన పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పార్టీ తరఫున ఆయనకు గుంటూరు పార్ల మెంటు ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు. కానీ.. ఆయన పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. తనకు పశ్చిమ సీటు కావాలని పరోక్షంగా పార్టీపై ఒత్తిడి చేస్తున్నారు.
కానీ, పోతిన వాదనను పెద్దలు పట్టించుకోవడం లేదు. కట్ చేస్తే.. జనసేన వైపు నుంచి పోతినకు ఆఫర్లు వస్తున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. పోతిన స్థానం అలానే ఉందంటూ.. ఇటీవల విజయవాడకు చెందిన జనసేన నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో పోతినను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారన్న చర్చ సాగుతోంది. అయితే.. పవన్ కల్యాణ్ ఫ్యామిలీపై పోతిన కూడా విమర్శలు చేశారు. దీంతో ఆయన చేరికను కొందరు ఒప్పుకోవడం లేదు.
ఇదంతా జరగదని.. పార్టీలో ఆయనకు స్థానం లేదని అంటున్నారు. మొత్తంగా ఇటు వైసీపీలో సీటుపై బెంగ పట్టుకుంది. మరోవైపు.. జనసేనలోనూ స్థానం ఉందని అంటున్నా.. లేదన్న వాదనా వినిపిస్తోంది. ఫలితంగా పోతిన రాజకీయం అడకత్తెరలో పడిందన్న చర్చ అయితే ముమ్మరంగా సాగుతోంది.