వైసీపీకి వైఎస్సార్ ఫ్లేవర్...వారి కోసం ?
వైఎస్సార్ కాంగ్రెస్ లో వైఎస్సార్ ఉన్నారు. అది 2014 ఎన్నికల్లో బాగా పనిచేసింది. అందుకే బలమైన ప్రతిపక్షంగా నాడు అవతరించింది.;
వైఎస్సార్ కాంగ్రెస్ లో వైఎస్సార్ ఉన్నారు. అది 2014 ఎన్నికల్లో బాగా పనిచేసింది. అందుకే బలమైన ప్రతిపక్షంగా నాడు అవతరించింది. 2019 నాటికి జగన్ ఇమేజ్ కూడా అమాంతం ఆకాశానికి ఎగిసింది. దాంతో రెండూ తోడై బంపర్ విక్టరీ కొట్టింది. కానీ 2024 ఎన్నికలలో మాత్రం కేవలం జగన్ ఇమేజ్ మీదనే ఫ్యాన్ పార్టీ నమ్ముకుని వెళ్ళింది. అయితే జగన్ పట్ల జనంలో అభిమానం ఉన్నా కూడా అదే సమయంలో కూటమి కట్టడంతో ఏకంగా 11 సీట్లకే పరిమితం అయింది. కానీ 40 శాతం ఓటు షేర్ అయితే వైసీపీకి రావడం మాత్రం గ్రేట్ అనే అంటున్నారు.
వైఎస్సార్ కావాల్సిందే :
ఇక 2024 ఎన్నికల్లో వైఎస్సార్ వారసులు వేరు వేరు పార్టీలలో ఉండడం తల్లి సైతం సైలెంట్ కావడంతో వైసీపీ మీద బాగానే ప్రభావం చూపించింది అని అంటున్నారు. మరో వైపు చూస్తే కనుక పోటీ సైతం తీవ్రంగా ఉండడంతో వైసీపీకి మొదటి నుంచి బలంగా ఉంటూ వస్తున్న సామాజిక వర్గాలలో సైతం చీలిక వచ్చిందని అంటున్నారు. దీంతో వైసీపీ చతికిలపడాల్సి వచ్చింది. ఇక అధికారం కోల్పోయి పద్దెనిమిది నెలల కాలం అయింది. వైసీపీ మళ్ళీ జనంలోకి వెళ్ళాలని చూస్తోంది. అయితే మరోసారి వైఎస్సార్ ని కూడా గట్టిగా తలచుకుంటే మంచిది అన్న మాట వైసీపీలో ఉందని ప్రచారం సాగుతోంది.
వైఎస్సార్ సన్నిహితులు :
వైఎస్సార్ కి సన్నిహితులుగా పేరు పడిన వారు చాలా మంది ఏపీలో ఉన్నారు వారంతా విశేష అనుభవం కలిగిన వారు అని చెప్పాల్సి ఉంది. అయితే వారిలో పెద్దగా ఎవరూ వైసీపీ వైపు వచ్చిన దాఖలాలు లేవు. అయితే వీరిలో కొందరిని అయినా తమ వైపు తిప్పుకుంటే బాగుంటుంది అన్నది వైసీపీ కీలక నేతలలో ఉంది అని అంటున్నారు. వారి సీనియారిటీ ప్రజలలో ఉన్న సానుకూలత ఇవన్నీ రాజకీయంగా వైసీపీకి ఎంతో కొంత ఉపయోగపడతాయని అంటున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారిని పార్టీలోకి ఆవ్హానించాలని కూడా చర్చ అయితే సాగుతోంది.
రాజకీయ మేధావిగా :
ఇక ఉండవల్లి రాను పదవులు ఏవీ చేపట్టేది లేదని రాజకీయాలకు దూరం అని చెబుతున్నా ఆయనకు వైఎస్సార్ కుమారుడిగా జగన్ మీద ఎంతో కొంత అభిమానం ఉంది అని అంటున్నారు. దాంతో ఆయనను తీసుకుని వస్తే మేధావి వేర్గంతో పాటు తటస్థులు పట్టణ ప్రాంతాల ప్రజలలో ఎంతో కొంత మార్పు వస్తుందని భావిస్తున్నారు. ఈ మధ్యనే ఉండవల్లి గుంటూరు జిల్లాకు వెళ్ళారు, అక్కడ సీనియర్ నేత అంబటి రాంబాబుతో కలసి ఆయన పర్యటించారు. దాంతో ఉండవల్లి వైసీపీలో చేరుతారు అని చర్చ సాగింది. కానీ అదేమీ లేదని అంటున్నారు. కానీ ఉండవల్లిని వైసీపీలో చేర్చుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుందని చెబుతున్న వారు ఉన్నారు.
కాంగ్రెస్ సీనియర్లతో :
అంతే కాదు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇబ్బంది పడుతోంది. దాంతో ఆ పార్టీలో ఉన్న సీనియర్లను కొందరిని వైసీపీ తీసుకుని తమతో కలుపుకుని ముందుకు సాగితే ఫ్యాన్ పార్టీకి బాగానే రాజకీయ ప్రయోజనం చేకూరుతుందని అంటున్నారు. కానీ జగన్ ఈ విషయంలో ఏమి అంటారు అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీలో అయితే చాలా మందిలో పార్టీలోకి వైఎస్సార్ సన్నిహితులు కొందరు అయినా వస్తే బాగుంటుంది అన్న భావన అయితే ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.