షర్మిలకు తోడుగానే రాజారెడ్డి !

ఏపీలో కాంగ్రెస్ బలం పెద్దగా లేదు అన్నది అందరికీ తెలిసిందే. వరుసగా మూడు ఎన్నికలు జరిగితే మూడింటా డిపాజిట్లు గల్లతు అయి కాంగ్రెస్ చతికిలపడింది.;

Update: 2025-09-09 04:15 GMT

ఏపీలో కాంగ్రెస్ బలం పెద్దగా లేదు అన్నది అందరికీ తెలిసిందే. వరుసగా మూడు ఎన్నికలు జరిగితే మూడింటా డిపాజిట్లు గల్లతు అయి కాంగ్రెస్ చతికిలపడింది. ఇక 2014 ఎన్నికల వేళ పీసీసీ చీఫ్ గా ఎన్ రఘువీరా రెడ్డి ఉన్నారు. 2019 నాటికి సాకే శైలజానాధ్ వ్యవహరించారు. 2024 నాటికి వైఎస్ షర్మిల ఉన్నారు. అయితే రఘువీరా రెడ్డి శైలజానాధ్ అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు కూడా నిర్వహించారు. దాంతో వారి అనుభవం ఎంతో కొంత ఉన్నా కాంగ్రెస్ లేవలేకపోయింది. ఇక 2024 లో తొలిసారి కడప నుంచి ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఓటమి పాలు అయ్యారు. దాంతో పాటు కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమంత మారలేదు.

ఏణ్ణర్ధ కాలంలోనూ అంతే :

ఇక కాంగ్రెస్ గత ఏణ్ణర్ధంగా చూసినా అలాగే ఉంది. ఆ పార్టీలో నేతలు ఉన్నారు, కానీ వారు సీనియర్లుగా ఉంటూ కాంగ్రెస్ లోనే మారకుండా తమ రాజకీయాన్ని ముగించాలని చూస్తున్నారు. మరో వైపు యువత ఇతర వర్గాలు ఏవీ కాంగ్రెస్ లో చురుకుగా లేవనే చెప్పాలి. షర్మిల కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు అభివృద్ధి చేశారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఈ క్రమంలో ఆమె పీసీసీ పీఠం కూడా కదులుతుందని ఆ మధ్య దాకా ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్ కి ఒక రాజకీయ వ్యవహారాల కమిటీని పాతిక మంది సభ్యులతో నియమించారు. అలాగే ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. వారంతా కలసి సమిష్టిగా పనిచేసి కాంగ్రెస్ ని ఏపీలో పెంచాలని పెద్దలు సూచించారు.

వైఎస్సార్ బంధంతోనే :

ఇక షర్మిల వైఎస్సార్ తనయగానే కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ పదవిని అందుకున్నారు. అయితే వైఎస్సార్ రాజకీయ వారసత్వం మాత్రం జగన్ కే వెళ్ళింది. జగనే ఆయన వారసుడు అని ఇప్పటికే జనాలు తీర్పు ఇచ్చారు. 2014, 2019 ఎన్నికలు చూసినా లేక 2024లో వైసీపీ ఓటమి పాలు అయినా ఆ పార్టీకి గణనీయంగా ఓట్ షేర్ ఉంది. అందుకే వైఎస్సార్ వారసత్వం జగన్ నుంచి వేరు చేయడం అన్నది షర్మిల వల్ల కావడం లేదు అన్నది ఒక విశ్లేషణ గా ఉంది. ఈ క్రమంలోనే ఆమె తన తనయుడిని రాజకీయాల్లోకి తెస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది.

వైఎస్సార్ మనవడిగా :

వైఎస్సార్ రాజకీయ వారసత్వం కోసం అన్నతో పోటీ పడి పార్టీ కూడా సొంతంగా తెలంగాణాలో పెట్టి దానిని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా కూడా తన బలమైన ముద్ర అయితే వేయలేకపోయారు అని విమర్శలు ఉన్నాయి. దీంతో మనవడుగా రాజా రెడ్డి తాతా వారసత్వాన్ని అందుకుంటారని ఆ విధంగా జనంతో కొత్త తరాన్ని కనెక్ట్ చేయడం వల్ల ఏమైనా వర్కౌట్ అవుతుందా అన్న ఆలోచనలతోనే రాజా రెడ్డిని తెస్తున్నారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. అయితే వైఎస్సార్ వారసత్వం అన్నది ఆయనకు కుమారుడు జగన్ కే అని జనాలు గట్టిగానే చెప్పేశారు.

జగన్ కూడా రాజకీయంగా ఇంకా యువకుడే. దాంతో మరింత కాలం ఆయన రాజకీయంగా బలంగా ఉండగలరని వైసీపీ నేతలు అంటున్నారు. మనవడు రాజకీయాల్లోకి వస్తే వైఎస్సార్ వారసత్వం ఏ మేరకు కలసి వస్తుంది అన్నది కూడా ప్రశ్నగా ఉంది అని అంటున్నారు. సహజంగానే వారసులు అంటే కుమారుల నుంచి వచ్చిన వారే అవుతారు అని అది సంప్రదాయంగా వస్తోంది అని అంటారు. అయితే ఇక్కడ జగన్ సీఎం గా కూడా చేసి సొంత పార్టీతో బలంగానే ఉన్నారు. దాంతో రాజా రెడ్డి కాంగ్రెస్ తరఫున పొలిటికల్ ఎంట్రీ ఇస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News