విజయమ్మ పుట్టిన రోజున షర్మిల శుభాకాంక్షాలు.. మరి జగన్ రెడ్డి చెప్పారా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఈ రోజు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.;

Update: 2025-04-19 09:36 GMT

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్ విజయమ్మ ఈ రోజు 69వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆన్ లైన్ వేదికగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. విజమమ్మ కుమార్తె ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కూడా తన ఎక్స్ ద్వారా విజయమ్మకు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. అయితే విజయమ్మ కుమారుడు జగన్ తన తల్లికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారా? లేదా? అని ఎక్కువ మంది ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నారు.

‘‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా.. వచ్చే రోజులు అన్నీ మంచే జరగాలి. నీవెప్పుడూ నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నాపట్ల నీకున్న ప్రేమకు తగినంతగా కృతజ్ఞతలు చెప్పలేను’’ అంటూ భావోద్వేగంతో షర్మిల ట్వీట్ చేశారు. అంతేకాకుండా బైబిల్ కొటేషన్ ను తన ట్వీట్ లో జత చేశారు. తల్లిని తానెంతో ప్రేమిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే విజయమ్మకు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం, ఆ ట్వీట్ ఎంతో ఆకట్టుకునేలా ఉండటంతో అంతా విజయమ్మ కుమారుడు, వైఎస్ జగన్ స్పందన కోసం ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు మాజీ సీఎం జగన్ ఎక్స్ అకౌంట్ లోకాని, వైసీపీ అధికారిక ఎక్స్ అకౌంటులో కాని విజయమ్మకు శుభాకాంక్షలు తెలిపే పోస్టు ఒక్కటి కూడా కనిపించలేదు.

గత కొంత కాలంగా తల్లి, చెల్లితో మాజీ సీఎం జగన్ కు గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుండటం తెలిసిందే. సరస్వతి పవర్ షేర్లపై ఆ ఇద్దరికి వ్యతిరేకంగా జగన్ కోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ గొడవపై ప్రతి ఇంట్లోనూ ఇలాంటి చిన్నచిన్న సమస్యలు ఉంటాయని జగన్ గతంలో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లినప్పుడు జగన్ వెంట విజయమ్మ ఉండటంతో వాటాల సమస్య తీరిపోయిందని అనుకున్నారు. కానీ, తల్లి విజయమ్మ పుట్టిన రోజున ఆయన శుభాకాంక్షలు చెబుతూ పోస్టు పెట్టకపోవడంపై చర్చ జరుగుతోంది. అయితే ఆన్ లైనులో శుభాకాంక్షలు చెప్పకపోయినా విజయమ్మతో ఫోనులో మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై వైసీపీ క్లారిటీ ఇవ్వాల్సిఉంది.

Tags:    

Similar News