కడపలో వైఎస్ సునీత.. పులివెందుల ఉప ఎన్నికపై షాకింగ్ కామెంట్స్
‘‘జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్నఘటనలు చూస్తుంటే మా నాన్న వివేకా హత్య గుర్తుకొస్తుంది.;
మాజీ సీఎం జగన్మోహనరెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిసిన ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల సమయంలో జరుగుతున్న పరిణామాల పట్ల భయాందోళన వ్యక్తం చేసిన ఆమె, గతంలో తన తండ్రి వివేకానందరెడ్డి హత్య మళ్లీ గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ సునీత ఎస్పీని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘జడ్పీటీసీ ఉప ఎన్నిక సందర్భంగా రెండు రోజులుగా పులివెందులలో జరుగుతున్నఘటనలు చూస్తుంటే మా నాన్న వివేకా హత్య గుర్తుకొస్తుంది. గొడ్డలి పోటుతో వివేకాను హత్య చేసి గుండెపోటుగా నమ్మించారు. టీడీపీ నేతలు చంపించారని నమ్మబలికారు. పోలీసులను బెదిరించి క్రైం సీన్ తుడిచేశారు. హత్య తర్వాత ఓ లేఖ తెచ్చి మా నాన్నను ఆదినారాయణరెడ్డి, సతీశ్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు సంతకం చేయమంటే నేను చేయలేదు. అవినాశ్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారు’’ అంటూ సునీత చెప్పారు.
అదేవిధంగా ఇప్పుడు జరుగుతోంది. మా బంధువు సురేశ్ పై అవినాశ్ రెడ్డి అనుచరులు దాడి చేశారనే అనుమానం ఉంది. ఆరేళ్లుగా వివేకా హత్యపై పోరాడుతున్నాను. ఇప్పటివరకు దోషులకు శిక్ష పడలేదు. వివేకాను నేను, నా భర్త చంపినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అని సునీత డిమాండ్ చేశారు. నాన్న మళ్లీ తిరిగిరాడు. ప్రజలు ఆలోచించి నిజం బయటకు వచ్చేలా చూడాలని సునీత కోరారు. రేపు వివేకానందరెడ్డి జయంతి. నా తల్లి నాకు పులివెందుల రావద్దని చెబుతోంది. న్యాయం కోసం పోరాడటానికి సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి ఉందని సునీత ఆవేదన వ్యక్తం చేశారు.