‘కలలో కూడా అనుకోలేదు’ అవినాశ్ రెడ్డిపై వైఎస్ సునీత షాకింగ్ కామెంట్స్..
కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిపై వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.;
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిపై వైఎస్ సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నాన్న మర్డర్ కి అవినాశ్ రెడ్డికి సంబంధం ఉంటుందని కలలో కూడా ఊహించలేదు’ అంటూ సునీత వ్యాఖ్యానించారు. వివేకా హత్యపై విచారణ పూర్తయిందని రెండు రోజుల క్రితం సీబీఐ సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో వైఎస్ సునీత గురువారం కడప ఎస్పీ అశోక్ కుమార్ ను కలిశారు. ఈ సందర్భంగా అవినాశ్ రెడ్డిపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
కడపలో సునీత
వరుసకు సోదరుడు అయిన అవినాశ్ రెడ్డిపై వైఎస్ సునీత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రస్తుతం వారి సొంత నియోజకవర్గం పులివెందులలో జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ సందర్భంగా పులివెందుల మండలంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో కడపలో అడుగు పెట్టిన సునీత ఆరేళ్ల క్రితం జరిగిన హత్యను మళ్లీ గుర్తు చేశారు.
చిన్న పిల్లాడులా చూశా..
వివేకా హత్య జరిగిన తర్వాత తన వద్దకు వచ్చిన అవినాశ్ రెడ్డి ఓ లేఖ తీసుకువచ్చి ఆదినారాయణ రెడ్డి, సతీశ్ రెడ్డి, బీటెక్ రవి కారణమంటూ చెప్పాడని, అయితే వివేకా హత్యకు అవినాశ్ రెడ్డి కారణమవుతాడని అసలు అనుకోలేదని అన్నారు. అవినాశ్ రెడ్డి అంటే ఇప్పటికీ తమ వీధిలో తిరుగుతున్న పిల్లాడిలానే చూశామని, అవినాశ్ ఇలా మారిపోతాడని కలలో కూడా అనుకోలేదని సునీత వ్యాఖ్యానించారు.
ప్రజా కోర్టులో తేల్చుకోవాలనే..
తాజాగా సునీత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపుతున్నాయి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో అవినాశ్ రెడ్డిని ఇబ్బంది పెట్టేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. వివేకా హత్యపై ఆరేళ్లుగా సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా కడప ఎంపీ అవినాశ్ రెడ్డిని జైలుకు పంపి శిక్షించాలని ఆమె చేస్తున్న పోరాటం ఫలించలేదు. విచారణలో ఆయన నిందితుడిగా తేలినా, కోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేయడంతో జైలు తిప్పలు తప్పించుకున్నారు. అయితే తన తండ్రి హత్యను పరిగణలోకి తీసుకుని ప్రజలే న్యాయం చేయాలని సునీత తాజాగా అప్పీలు చేస్తున్నారు. న్యాయస్థానంలో తన వాదనకు తగిన మద్దతు లభించని కారణంగా, ప్రజా కోర్టులో అవినాశ్ రెడ్డిని శిక్షించాలని ఆమె పులివెందుల ఎన్నికల ముందు ఇలా ముందుకు వచ్చారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.