ఐసీయూలో షర్మిల.. షాకింగ్ ఫొటో షేర్ చేసిన ఏపీసీసీ చీఫ్

అయితే ఆమె అనారోగ్యానికి గురైన సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచడంతో అనేక ఊహాగానాలు వ్యాపించాయి. ఆమె కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నారని కొందరు..

Update: 2026-07-26 06:42 GMT

ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మౌనం వీడారు. కొన్నాళ్లుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. అనారోగ్యం కారణంగా బెంగళూరు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు షర్మిల స్వయంగా వెల్లడించారు. ఐసీయూలో ఆక్సిజన్ సపోర్టుతో ఉన్న ఫొటోను షేర్ చేసిన షర్మిల తాను కోలుకుంటున్నట్లు ఎక్స్ లో ప్రకటించారు. దీంతో కొన్నాళ్లుగా షర్మిలపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లైంది. దాదాపు మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న షర్మిలను ఆస్పత్రి బెడ్ పై చూసిన అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఎక్కడున్నారనే సస్పెన్స్ కు తెరపడింది. కొన్నాళ్లుగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారని మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి. దీనికి ఆమె పార్టీ పట్ల అసంతృప్తిగా ఉండటమే కారణమంటూ పరిశీలకులు వ్యాఖ్యానాలతో పార్టీలో అలజడి వ్యక్తమైంది. రాష్ట్ర విభజన తర్వాత దిక్కుమొక్కు లేనట్లు తయారైన కాంగ్రెస్ పార్టీకి కాస్త ఊపిరి పోసిన షర్మిల ఒక్కసారిగా సైలెంటు అవ్వడంపై అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. దాదాపు మూడు నెలలుగా ప్రత్యక్ష రాజకీయ కార్యక్రమాల్లో ఆమె ఎక్కడా కనిపించలేదు. చివరిసారిగా మే నెలలో రాహుల్ గాంధీతో భేటీ అయిన షర్మిల ఆ తర్వాత ఎక్కడున్నారో? ఏమయ్యారో అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.

అయితే ఆమె అనారోగ్యానికి గురైన సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచడంతో అనేక ఊహాగానాలు వ్యాపించాయి. ఆమె కాంగ్రెస్ పై అసంతృప్తితో ఉన్నారని కొందరు.. కాంగ్రెస్ అధిష్టానమే ఆమెను మార్చాలని చూస్తుందని మరికొందరు.. ఎవరికి తోచిన విధంగా వ్యాఖ్యానాలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తల్లో గందరగోళం సృష్టించారు. ఈ పరిస్థితుల్లో షర్మిల స్వయంగా తనపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ ఎక్స్ లో పోస్టు చేశారు. పొత్తికడుపులో సమస్య కారణంగా ఆమె బెంగళూరులో శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తాను కోలుకున్నానని, తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ షర్మిల ట్వీట్ చేశారు. దీంతో షర్మిల అనారోగ్యంతో చికిత్స పొందిన విషయం వెలుగు చూసింది. బయటకు తెలియకుండా షర్మిల తన ఆరోగ్య పరిస్థితిని రహస్యంగా ఉంచడమే చర్చనీయాంశం అవుతోంది. ఇక ఆమె కోలుకున్నానని స్వయంగా తెలియజేయడంపై కాంగ్రెస్ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరికొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని, పూర్తిగా కోలుకున్నాకే రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచిస్తున్నారు. మొత్తానికి తనపై వస్తున్న ఊహాగానాలకు షర్మిల ఒక్క ఫొటోతోనే చెక్ పెట్టారని అంటున్నారు.

Tags:    

Similar News