జగన్ కి మైలేజా...డ్యామేజా ?
రాజకీయాలో ఏమి జరిగితే అది జరగని అని ఊరుకుంటే ఇబ్బందే. జనాలు అన్నీ చూస్తారు. ప్రతీదీ లెక్క వేస్తారు.;
రాజకీయాలో ఏమి జరిగితే అది జరగని అని ఊరుకుంటే ఇబ్బందే. జనాలు అన్నీ చూస్తారు. ప్రతీదీ లెక్క వేస్తారు. హెచ్చిస్తారు, భాగిస్తారు, కూడికలూ తీసివేతలూ సరేసరి. ఇదంతా ఎందుకు అంటే జగన్ ఈ మధ్య వరుసగా పర్యటనకు చేస్తున్నారు. వాటి వల్ల ఆయనకు కానీ పార్టీకి గానీ దక్కే పొలిటికల్ మైలేజ్ ఎంత డ్యామేజ్ ఎంత అన్నదే చర్చగా ఉంది.
జగన్ తాజాగా సత్తెనపల్లి లోని రెంటపాళ్ళ వెళ్ళారు. ఆయన తమ పార్టీకి చెందిన ఉప సర్పంచ్ నాగ మల్లేశ్వరావుని పరామర్శించారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఈ ఉప సర్పంచ్ ఆత్మ హత్య చేసుకున్నది గత ఏడాది జూన్ 9న అని చెబుతున్నారు. జగన్ వెళ్ళింది పూర్తిగా ఏడాది దాటిన తర్వాత.
తమ పార్టీ నేత చనిపోతే పరామర్శించవద్దా అని జగన్ అడుగుతున్నారు కానీ మరీ ఇంత ఆలస్యంగానా అన్నది ఆ వెంటనే వస్తున్న ప్రశ్న. ఇక ఆయన చనిపోయేనాటికి కేర్ టేకర్ గా ఉన్నది వైసీపీ ప్రభుత్వమే అని చంద్రబాబే చెప్పారు. మరి ఆయన ఆత్మహత్యకు పోలీసులు కారణం అంటే ఆ ప్రభుత్వం ఏమి చేస్తున్నట్లు అని సూటిగా ప్రశ్నించారు.
ఇక బెట్టింగ్ కాసి నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారు. మరి దీనిని ఎలా సమర్థించుకుంటారు అన్నది వెంటనే వచ్చే మరో ప్రశ్న. ఇక తెనాలిలో నడి రోడ్డున కొందరు యువకులను పెట్టి పోలీసులు కొట్టారు. వారిని స్వయంగా జగన్ పరామర్శించారు. గంజాయి బ్యాచ్ అని పోలీసులు శిక్షించారు అని ప్రత్యర్థి వర్గం అంటోంది. అలా గంజాయి బ్యాచ్ కి మద్దతుగా నిలుస్తారా అన్నది మరో ప్రశ్న.
ఇక ఈ మధ్యనే పొదిలిలో జగన్ పర్యటించారు. పొగాకు రైతులకు పరామర్శించడానికి అని ఆయన చెప్పుకున్నా నలభై వేల మంది జనంతో పరామర్శిస్తారా అన్నది కూటమి వైపు నుంచి వస్తున్న ప్రశ్న. ఇక్కడ ఘర్షణలు జరిగాయి. రెంటపాళ్ళ పర్యటనలో ఇద్దరు చనిపోయారు. ఈ రెండు పర్యటనలలో భారీగా ట్రాఫిక్ జాం జనాలకు కష్టాలు ఎదురయ్యాయి.
ఇక పోలీసుల ఆంక్షలను దాటి మరీ ఈ విధంగా బలప్రదర్శనలు వైసీపీ చేస్తోంది అని కూటమి పెద్దలు అంటున్నారు. అయితే తమ పార్టీ వారిని పరామర్శించేందుకు ఆంక్షలు పెడతారా అని వైసీపీ అంటోంది. అయితే పరామర్శలు చేయవద్దు అనడం లేదు. కానీ దానికి సమయం సందర్భం, పరిస్థితులు అన్నీ చూడాలని అంటున్నారు. ఏడాది తరువాత పరామర్శ ఏంటి అన్నదే ఇపుడు నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నగా ఉంది.
మరో వైపు జగన్ కి జనాలు వస్తున్నారు అని వైసీపీ హుషార్ చేస్తున్నా ఇది ఎన్నికల సమయం కాదు కదా ఇంతలా జనాలతో ఒక ఇరుకు ప్రాంతానికి వెళ్ళాలా అని మరో వైపు ప్రశ్నలు వస్తున్నాయి. ఇక చూస్తే కనుక ఈ పరామర్శలు కూడా బెట్టింగ్ బ్యాచ్ గంజాయ్ బ్యాచ్ ని సపొర్ట్ చేయడానికా అని కూటమి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి.
మొత్తానికి చూస్తే ఈ టూర్ల వల్ల వివాదాలు వైసీపీ నేతలు కార్యకర్తల మీద కేసులు జనాలలో కూడా పాజిటివిటీ కంటే వేరే విధంగా చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. ఇక ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు పోరాడుతున్నరు, వాటి మీద వైసీపీ పోరాడితే బాగుంటుంది కదా అంటున్నారు. అంతే కాదు ప్రత్యేక హోదా మీద ఎందుకు మాట్లాడరు అంటున్నారు.
విభజన సమస్యలు అనేకం ఉన్నాయని వాటి మీద కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని అంటున్నారు. అలాగే ప్రజా సమస్యల మీద కూటమికి వ్యతిరేకంగా జనాల్లోకి వెళ్తే కనుక ఆ వచ్చే ఇంపాక్ట్ వేరే విధంగా ఉంటుంది కదా అని అంటున్నారు. అలా కాకుండా చేసే ఈ తరహా పర్యటనలు ప్రచార ఆర్భాటాల కోసమో లేక బల ప్రదర్శన కోసమో అన్న విమర్శలు వస్తున్నాయి. మరి వైసీపీ దీని మీద ఏమి ఆలోచిస్తుందో చూడాల్సి ఉంది.
ఇప్పటికైతే వైసీపీని గంజాయ్ బ్యాచ్ కి బెట్టింగ్ బ్యాచ్ కి మద్దతుగా ఉన్న పార్టీగా కూటమి ప్రభుత్వ పెద్దలు చిత్రీకరించి ఆ విధంగా జనంలోకి మెసేజ్ ని పంపుతున్నారు. నేరస్థులు రాజకీయాల్లోకి వస్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు. అదే తీరున జనంలోకి సందేశం వెళ్ళిందంటే దాన్ని విప్పుకోవడం తప్పించుకోవడం ఒక పట్టాన అయ్యేది కాదని అంటున్నారు.