వైఎస్ జగన్ ఇంట విషాదం.. పెద్దమ్మ సుశీలమ్మ కన్నుమూత

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.;

Update: 2025-03-27 04:30 GMT

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్దమ్మ, వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు ఆనంద్ రెడ్డి సతీమణీ సుశీలమ్మ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె వయసు 85 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా వచ్చిన ఆరోగ్య సమస్యలతో ఆమె గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నారు. పులివెందులలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సుశీలమ్మను రెండు నెలల క్రితమే వైఎస్ జగన్ పరామర్శించారు.

దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అన్నయ్య ఆనంద్ రెడ్డి భార్య సుశీలమ్మ. ఆనంద్ రెడ్డి గతంలోనే మృతి చెందారు. సుశీలమ్మ అంత్యక్రియలు గురువారం పులివెందులలోనే నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంత్యక్రియలకు వైఎస్ జగన్ కూడా హాజరవుతున్నారు. ఆయన గురువారం ఉదయం తాడేపల్లి నుంచి పులివెందులకు బయలుదేరనున్నారు.

ఇటీవల వైఎస్ జగన్ పులివెందులకు వెళ్లారు. బెంగళూరు నుంచి నేరుగా పులివెందుల చేరుకొని అకాల వర్షాల కారణంగా నష్టపోయిన అరటి రైతులకు ఆయన అండగా నిలిచారు. బుధవారం రాత్రి విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. మరుసటి రోజే ఆయన తన పెద్దమ్మ అంత్యక్రియల కోసం పులివెందులకు వెళ్లాల్సి రావడం బాధాకరం.

వైఎస్ జగన్ కుటుంబంలో ఇది వరుస విషాదంగా చెప్పుకోవచ్చు. గతేడాది చివరలో ఆయన సోదరుడు అభిషేక్ రెడ్డి మృతి చెందారు. డాక్టర్‌గా పనిచేస్తున్న అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే కన్నుమూయడం అందరినీ కలిచివేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకే వైఎస్ జగన్ బాబాయి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ కూడా మరణించారు. బాపట్ల జిల్లా మేదరమెటల్లో జరిగిన పిచ్చమ్మ అంత్యక్రియలకు వైఎస్ జగన్ స్వయంగా వెళ్లి నివాళులర్పించారు. ఇలా వైఎస్ జగన్ కుటుంబంలో వరుసగా జరుగుతున్న మరణాలు ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేస్తున్నాయి.

కాగా, బుధవారం రాత్రి విజయవాడలో జరిగిన ఇఫ్తార్ విందుకు వైఎస్ జగన్ హాజరయ్యారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు విరమించే సమయంలో ముస్లిం సోదరుల కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఈ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అందరికీ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు నెరవేరాలని, అల్లాహ్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

మొత్తానికి వైఎస్ జగన్ కుటుంబంలో నెలకొన్న వరుస విషాదాలు ఆయన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. పెద్దమ్మ సుశీలమ్మ మృతితో ఆయన మరోసారి దుఃఖసాగరంలో మునిగిపోయారు.

Tags:    

Similar News