'నేను మాజీ ముఖ్యమంత్రిని.. అరెస్టు చేస్తే.. పరువు పోతుంది'.. జగన్
ఇతరుల సంగతి ఎలా ఉన్నా.. జగన్ దాఖలు సుదీర్ఘ పిటిషన్(12 పేజీలు)లో ఆయన చేసిన వాదన.. ఆశ్చర్యంగా ఉందని న్యాయవాదులు చెబుతున్నారు.;
తప్పు జరిగినప్పుడు హుందాగా ఒప్పుకోవాలి. డిగ్నిటీ అనేది వేసుకునే బట్టల్లోను.. తిరిగే కార్లలోనూ రాదంటారు. అనుసరించే విధానంలోనే డిగ్నిటీ ఉంటుంది. ప్రజల ముందు ఒకమాట.. నాలుగు గోడల మధ్య మరోమాట మాట్లాడితే డిగ్నిటీ ఉంటుందా? ఇవీ.. ఇప్పుడు వైసీపీ అధినేత పై వస్తున్న కామెంట్లు. గుంటూరు జిల్లా రెంటపాళ్ల గ్రామానికి జగన్ ఈ నెల 18న వెళ్లారు. అక్కడ ఎప్పుడో ఏడాది కిందట ఆత్మహత్య చేసుకుని నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి.. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే.. ఈప్రయాణం.. రాజకీయ ర్యాలీని, బలప్రదర్శనను తలపించిందని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించారు.
మరోవైపు.. జగన్ ప్రయాణించి బుల్లెట్ ప్రూఫు వాహనం కింద సింగయ్య అనే దళిత వైసీపీ కార్యకర్త నలిగి ప్రాణాలు పోయాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ రమణారెడ్డిని ఏ1గా, జగన్‌ను ఏ2గా పేర్కొన్నారు.ఇప్పటికే రమణారెడ్డిని అరెస్టు చేశారు. ఇక, మిగిలింది జగను, ఆయన పరివారంలోని మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజనీ, పీఏ. వీరంతా ఇప్పుడు తమపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఇతరుల సంగతి ఎలా ఉన్నా.. జగన్ దాఖలు సుదీర్ఘ పిటిషన్(12 పేజీలు)లో ఆయన చేసిన వాదన.. ఆశ్చర్యంగా ఉందని న్యాయవాదులు చెబుతున్నారు.
జగన్ వాదనలు ఇవీ..
+ నేను ప్రయాణించిన కారు బరువు 3500 కిలోలు. నాతోపాటు.. మరో ఏడుగురు వరకు కారులో ఉన్నారు. వీరి బరువు ఎంత లేదన్నా 500 కిలోలు ఉంటుంది. అంటే.. మొత్తంగా 4 వేల కిలోలు. ఇంత బరువుతో ఉన్న వాహనం సింగయ్యపై ఎక్కితే, ఆయన తల కు చిన్నపాటి గాయాలే ఎందుకు అయ్యాయి? ఇది నిస్సందేహంగా నాపై మోపిన కుట్ర పూరిత కేసు.
+ ఎస్పీ సతీష్‌కుమార్ ముందు అసలు తమ వాహనం కానీ.. తమ కాన్వాయ్ కానీ.. ఈ కేసులో లేవని చెప్పారు. నాలుగు రోజుల తర్వాత.. తామే తొక్కి చంపామని చెబుతున్నారు. ఆయనను విచారించాలి. ఇంతగా మాట మార్చేయడంపై మాకు అనుమానాలు ఉన్నాయి.
+నేను మాజీ ముఖ్యమంత్రిని. ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించా. పైగా ఒక పార్టీకి అధ్యక్షుడిని. సమాజంలో గౌరవంగా ప్రతిష్టాత్మకంగా జీవిస్తున్నా. ఇప్పుడు నన్ను అరెస్టు చేస్తే.. నా ప్రతిష్ఠకు భంగం కలుగుతుంది. నన్ను అరెస్టు చేయడాన్ని మా పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేరు. కాబట్టి కేసును కొట్టి వేయండి.
కట్ చేస్తే..
ప్రతిష్ట, కార్యకర్తలు సహించలేరు.. అనే పదాలపై న్యాయవాదులు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేసులకు, ప్రతిష్టలకు సంబంధం ఉండదని చెబుతున్నారు. నేరం జరిగినప్పుడు హుందాగా ఒప్పుకొంటే శిక్ష తీవ్రత తగ్గించే అవకాశం ఉంటుంది తప్ప.. ఇలా వితండవాదం చేయడం సరికాదని అంటున్నారు. కాగా.. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేయనుంది.