పిల్లల గురించి యూట్యూబ్ సీఈఓ సంచలన వ్యాఖ్యలు.. వారు చూస్తున్న కంటెంట్ గురించి తెలిస్తే షాక్..
ఇప్పటి పిల్లల ప్రపంచం రెండు గదుల (స్కూల్, ఇళ్లు) మధ్య కాదు.. రెండు స్క్రీన్ల మధ్య ఎదుగుతున్నారు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ చేతిలో మొబైల్, కళ్ల ముందు వీడియోలు, చెవుల్లో హెడ్‌ఫోన్లు.;
ఇప్పటి పిల్లల ప్రపంచం రెండు గదుల (స్కూల్, ఇళ్లు) మధ్య కాదు.. రెండు స్క్రీన్ల మధ్య ఎదుగుతున్నారు. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకూ చేతిలో మొబైల్, కళ్ల ముందు వీడియోలు, చెవుల్లో హెడ్‌ఫోన్లు. చదువు, ఆట, స్నేహం, వినోదం అన్నీ స్క్రీన్‌లోనే దొరికిపోతున్న ఈ కాలంలో.. ‘మా పిల్లలకు యూట్యూబ్‌పై ఆంక్షలు పెట్టాం’ అని అదే యూట్యూబ్ సంస్థ సీఈవో చెప్పడం చాలా మందిని ఆలోచనలో పడేసింది. టెక్నాలజీని ప్రపంచానికి అందిస్తున్న పెద్దలే తమ ఇంట్లో దానికి గీతలు వేస్తుంటే.. మనం మాత్రం ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నాం అన్న ప్రశ్న మొదలవుతుంది.
సోషల్ మీడియాను ఎలా వాడాలో తెలియాలి..
సోషల్ మీడియా ఇప్పుడు తప్పించుకునే వస్తువు కాదు. పిల్లలు దాన్ని పూర్తిగా వాడకూడదు అని చెప్పడం కూడా వాస్తవ దూరం. కానీ ఎంత వాడాలి, ఎప్పుడు వాడాలి, ఎందుకోసం వాడాలి అన్న నియంత్రణ లేకపోతే అది అలవాటుగా మారి, చివరికి వ్యసనం అవుతుంది. ఈ విషయాన్ని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ తన మాటల్లో స్పష్టంగా చెప్పారు. వారాంతాల్లో మాత్రమే, అదీ పరిమితులతో తమ పిల్లలకు యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా వాడేందుకు అనుమతిస్తామని తెలిపారు. మిగతా రోజుల్లో చదువు, ఆట, కుటుంబ సమయం ఇవే ప్రాధాన్యమని ఆయన చెప్పిన మాటల్లో ఒక తండ్రి బాధ్యత కనిపిస్తుంది, ఒక నాయకుడి స్పష్టత కనిపిస్తుంది.
ఏ మీడియా మంచిదనే దానిపై చర్చ వద్దు..
ఇక్కడ అసలు ప్రశ్న యూట్యూబ్ మంచిదా? చెడ్డదా? అన్నది కాదు. ఏ సాధనైనా దాన్ని ఎలా వాడుతున్నామన్నదే అసలు విషయం. ఒకే యూట్యూబ్‌లో విజ్ఞానాన్ని పెంచే వీడియోలూ ఉన్నాయి, మెదడును ఖాళీ చేసే కంటెంట్ కూడా ఉంది. పిల్లలు దేనని చూస్ చేసుకుంటున్నారు. ఎందుకు చూస్తున్నారు? ఎంతసేపు చూస్తున్నారు? అన్నది తల్లిదండ్రులు గమనించకపోతే.. ఆ ఖాళీని అల్గరిథమ్ నింపేస్తుంది. అది పిల్లల మానసిక ఆరోగ్యానికి, ఆలోచనా శక్తికి మెల్లగా గండం పెట్టడం మొదలుపెడుతుంది.
అధిక స్క్రీన్ టైంతో చాలా అనర్థాలు..
చిన్న వయసులోనే పిల్లలు తక్కువ సహనంతో ఉండడం, కోపం ఎక్కువ కావడం, ఏకాగ్రత తగ్గిపోవడం, ఒంటరిగా ఉండాలనుకోవడం లాంటి మార్పులకు కారణం అధిక స్క్రీన్ టైమేనని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలా మంది ఇళ్లలో మాత్రం ‘వాడేదేగా.. అందరూ వాడుతున్నారు’ అనే సులువైన సమాధానం దొరుకుతుంది. అదే సమయంలో పిల్లలు చదువులో వెనుకపడితే, మాట వినకపోతే, మొండిగా మారితే మాత్రం ఆశ్చర్యపడతాం. సమస్య మూలం మన కళ్ల ముందు ఉన్నా, దాన్ని చూడకపోవడమే అసలు సమస్య.
పిల్లల కోసం ప్రత్యేక యాప్..
నీల్ మోహన్ చెప్పిన మరో విషయం.. పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన యూట్యూబ్ కిడ్స్ యాప్. ఇది కేవలం ఒక యాప్ కాదు.. ఒక ఆలోచన. పిల్లలకు సరైన కంటెంట్ మాత్రమే అందాలి, వారి వయసుకు తగిన భాష, విలువలు ఉండాలి అన్న భావన. కానీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తే సరిపోదు. పిల్లలతో మాట్లాడాలి, వాళ్లకు ఏది నచ్చుతోంది, ఏది ప్రభావం చూపుతోంది అన్నది తెలుసుకోవాలి. స్క్రీన్‌ను బేబీ సిట్టర్‌గా మార్చేసిన రోజునే తల్లిదండ్రుల పాత్ర వెనక్కి నెడుతుంది.
ఇది టెక్నాలజీకి వ్యతిరేకంగా చేసే వాదన కాదు.. ఇది అవగాహనతో టెక్నాలజీని వాడుకోవాలనే పిలుపు. పిల్లలు భవిష్యత్తులో డిజిటల్ ప్రపంచంలోనే జీవించబోతున్నారు. కానీ ఆ ప్రపంచాన్ని అర్థం చేసుకునే మేధస్సు, నిర్ణయం తీసుకునే శక్తి, మానవ సంబంధాల విలువలు.. ఇవన్నీ స్క్రీన్ బయటే నేర్చుకోవాలి. అవి లేకపోతే టెక్నాలజీ తోడుగా కాకుండా, ఆధిపత్యంగా మారుతుంది.
సీఈఓ మాటలు హెచ్చరికలేనా?
యూట్యూబ్ సీఈవో మాటలు ఒక హెచ్చరికలాంటివి. ‘నేను ఈ వ్యవస్థలోనే ఉన్నాను, కానీ నా పిల్లలకు గీతలు గీశాను’ అన్న ఆ నిజాయితీ మనకూ ఒక అద్దంలా నిలుస్తుంది. మన పిల్లల భవిష్యత్తును అల్గరిథమ్ లకు అప్పగించాలా? లేక మనమే కఠినంగా అయినా సరే దారిచూపాలా? ఈ ప్రశ్నకు సమాధానం మన ఇంటి డ్రాయింగ్‌రూమ్‌లోనే ఉంది. టీవీ ముందు కాదు, మొబైల్ స్క్రీన్ వెనుక కాదు.. మన మనసులోనే..