వైసీపీ టచ్ చేయకూడని సబ్జెక్టులు...బూమరాంగే !
అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇష్యూ కూడా వైసీపీకి ఇబ్బందిగానే ఉందని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు అయిదేళ్ల కాలంలో టీడీపీని ఎలా టార్గెట్ చేసిందో దాని కంటే ఎక్కువగా పవన్ ని టార్గెట్ చేసింది.;
ఏపీలో వైసీపీ ఒక ప్రత్యేకమైన పార్టీ. ఆ పార్టీ ప్రత్యేక సందర్భంలో ఏర్పాటు అయింది. అలాగే ఈ రోజుకీ కొనసాగుతోంది. చాలా ప్రత్యేకతలు వైసీపీలో ఉన్నాయి. ఏ పార్టీతోనూ పొత్తులు లేని పార్టీ. అయితే వైసీపీకి ఎవరూ మిత్రులు లేరని ఉండరని ప్రత్యర్ధులు విమర్శలు చేస్తూ ఉంటారనుకోండి. వైసీపీది యాంటీ కాంగ్రెస్ స్టాండ్. సాధారణంగా రాజకీయ పార్టీలు కాలానికి తగిన విధంగా తమ ఆలోచనలు మార్చుకుంటాయి. ఇక్కడా వైసీపీ డిఫరెంట్ అని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఒంటరే. ఏ ఒక్క పార్టీ పక్కన చేరదు. మాట సాయం ఉండదు, వైసీపీ ఒంటి స్తంభం మేడ మాదిరిగా అధినాయకుడి ఇమేజ్ తో ఆయన ప్రజాకర్షణతో ఆయన ఆలోచనలతో నడిచే పార్టీగా ఉంటూ వస్తోంది.
దెబ్బ కొట్టేశాయి :
ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినపుడు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. అది అనివార్యం కూడా. అయితే ఆ నిర్ణయాల వల్ల ఫలితాలు తేడా కొడితే ఇక వాటి జోలికి వెళ్లదు, ఎందుకంటే అపుడే విషయం మొత్తం అర్ధమవుతుంది. అలా వైసీపీ గురించి తీసుకుంటే కొన్ని విషయాలు ఆ పార్టీని ఇబ్బంది పెట్టి ఏకంగా 11 సీట్లకే పరిమితం చేశాయి. ఇందులో ప్రాంతం, సామాజిక పరిస్థితులు ఇతర రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. అలా అమరావతి రాజధాని విషయం తీసుకుంటే ఇది వైసీపీకి బాగా ట్రబుల్ ఇచ్చింది. మూడు రాజధానులు అంటూ వైసీపీ తన పదవీ కాలంలో చేసిన విన్యాసాల మూలంగా ఇటు కోస్తా అటు ఉత్తరాంధ్రా మరో వైపు రాయలసీమలో కూడా దెబ్బ పడింది అని విశ్లేషణలు ఉన్నాయి.
పవన్ ఇష్యూతో :
అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇష్యూ కూడా వైసీపీకి ఇబ్బందిగానే ఉందని చెప్పాలి. వైసీపీ అధికారంలో ఉన్నపుడు అయిదేళ్ల కాలంలో టీడీపీని ఎలా టార్గెట్ చేసిందో దాని కంటే ఎక్కువగా పవన్ ని టార్గెట్ చేసింది. అయితే పవన్ వెనక ఒక బలమైన సామాజిక వర్గం ఉందని అది హర్ట్ అవుతోందని మరచింది. ఇక పవన్ విమర్శలు చేసినా హుందాగా తిప్పికొట్టాల్సి ఉండేది. అదే సమయంలో ఎంతో కొంత లైట్ తీసుకునే వ్యూహాన్ని అనుసరించాల్సి వచ్చింది. అలా కాకుండా ఆయనను ముందు పెట్టి టార్గెట్ చేసేలా వ్యవహరించడంతో ఒక అతి పెద్ద సెక్షన్ వైసీపీకి యాంటీ అయ్యారు అని అంటారు.
అభివృద్ధి విషయంలో :
వైసీపీ హయాంలో అభివృద్ధి చేయలేదు అని కాదు కానీ ఎక్కువగా సంక్షేమం గురించే ఆలోచించింది. ఇక టీడీపీ కూటమి వచ్చాక పెట్టుబడులు తెస్తున్నారు, అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో లోపాలు ఏమైనా ఉంటే కనుక వాటిని ప్రస్తావించి అంతటితో సరి పెట్టవచ్చు కానీ ఎక్కువగా ఫోకస్ పెట్టి విమర్శల దాడి చేస్తే వైసీపీ అభివృద్ధి నిరోధకమైన పార్టీగా జనాల్లో ముద్ర పడుతుంది అని అంటున్నారు.
సున్నితమైన అంశాలలో :
అదే విధంగా మతపరమైన సున్నితమైన అంశాలలో కూడా వైసీపీ నేతలు ఎక్కువగా మాట్లాడకపోవడమే మేలు అని అంటున్నారు. అవి జనంలో సెంటిమెంట్ గా ఉంటాయి. ఆ టాపిక్ ని తీసుకుని వచ్చేటపుడు అన్ని రకాలైన విషయాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి ఇవన్నీ మానేస్తే వైసీపీ ఏమి మాట్లాడాలి అంటే వైసీపీ మార్క్ అభివృద్ధి అజెండాను జనం ముందు ఉంచడం తో పాటు తాము చేసిన సంక్షేమం గురించి జనంలో అధికంగా ప్రచారం చేసుకోవడం మళ్ళీ తాను పవర్ లోకి వస్తే ఏమి చేస్తామన్నది సవివరంగా వివరించేందుకే ఎక్కువ టైం వెచ్చిస్తే మంచిదని అంటున్నారు. ఎందుకంటే ఇపుడు ఏపీ ప్రజలు కూటమి పాలన చూస్తున్నారు, అంతకు ముందు వైసీపీ ఏలుబడిని చూశారు దాంతో వారు తమకు ఏమి కావాలో నిర్ణయించుకోగలరు, అయినా సరే ఒక పార్టీగా వైసీపీ తన గురించి ఎక్కువగా చెప్పుకోవడం ప్రత్యర్ధుల మీద విమర్శల దాడి తగ్గించడమే మేలు అని అంటున్నారు. లేకపోతే బూమరాంగే అని కూడా విశ్లేషణలు అయితే ఉన్నాయని అంటున్నారు.