వైసీపీ వస్తే ఆమెకే హోంమంత్రి పదవి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్!

తనను అంతా భావి హోంమంత్రి అంటూ పిలుస్తున్నారని ఆమె ఓ అడియో సంభాషణలో బయటపెట్టారు. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తీవ్ర చర్చ జరుగుతోంది.;

Update: 2025-05-21 10:50 GMT

వైసీపీ తిరిగి అధికారంలోకి ఎప్పుడు వస్తుందో కానీ, ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే పదవులను పంచుకుంటున్నారు. కళ్లు మూసుకుంటే నాలుగేళ్లు పూర్తవుతాయని, మనం మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి జగన్ పదేపదే చెబుతుండటంతో వైసీపీ నేతలకు ఆశ పుడుతుందా? అనే అనుమానులు వ్యక్తమవుతున్నాయి. దీంతో పార్టీ అధికారంలోకి వస్తే హోంమంత్రి అంటూ మాజీ ఎంపీ నందిగాం సురేశ్ భార్య బేబీలత ప్రచారం చేసుకుంటున్నారు. తనను అంతా భావి హోంమంత్రి అంటూ పిలుస్తున్నారని ఆమె ఓ అడియో సంభాషణలో బయటపెట్టారు. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో తీవ్ర చర్చ జరుగుతోంది.

బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ ఇటీవల అరెస్టు అయిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఓ హత్య కేసులో అరెస్టు చేశారు. ఆ తర్వాత సుమారు మూడు నెలల పాటు ఆయనను గుంటూరు జైలులోనే పెట్టారు. ఎట్టకేలకు విడుదలైన రెండు నెలలకే తిరిగి మరో కేసులో అరెస్టు అయ్యారు. సురేశ్ అరెస్టు, జైలు, బెయిలు వంటి సమయాల్లో ఆయన తరఫున యాక్టివ్ గా పనిచేశారు సురేశ్ భార్య బేబిలత. సురేశ్ ఎంపీగా ఉండగా, ఎప్పుడూ బయటకు రాని ఆమె ఇప్పుడు ఆయన కోసం న్యాయపోరాటం చేయడమే కాకుండా, పోలీసులను ఎదుర్కోవడంలో ధైర్యంగా వ్యవహరిస్తుండటం సోషల్ మీడియాను ఆకర్షిస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె వీడియోలు రెండు రోజులుగా వైరల్ అవుతుండగా, వైసీపీ అధికారంలోకి వస్తే ఆమెకే హోంమంత్రి పదవి అంటూ ఓ న్యాయవాది చెప్పిన ఆడియో తాజాగా వైరల్ అవుతోంది. మాజీ ఎంపీ సురేశ్ తరపున ఆయన కేసులను వాదిస్తున్న ఓ మహిళా న్యాయవాది ఇటీవల ఆయన భార్య బేబిలతకు ఫోన్ చేశారట.. ఈ సందర్భంగా వారి మాటల మధ్యలో ఈ సారి సురేశ్ బదులుగా బేబీలతకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బేబీలత రాష్ట్ర హోంమంత్రి అవుతారంటూ ఆ మహిళా న్యాయవాదితో మిగిలిన న్యాయవాదులు చెప్పినట్లు ఆ అడియోలో ఉంది. ఇదే సమయంలో తాను సురేశ్ తో ములాఖత్ అయ్యేందుకు జైలుకు వెళ్లగా అక్కడ గతంలో తనతో దురుసుగా వ్యవహరించిన ఓ సీఐ కూడా ఇదే విషయాన్ని తనతో చెప్పారని బేబీలత కూడా తన మనసులో ఉన్న మాటలను బయటపెట్టారు. మేడం.. మీరు కాబోయే హోంమంత్రి.. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి అంటూ ఆ సీఐ తనతో చెప్పినట్లు బేబీలత ఆ అడియోలో పేర్కొన్నారు.

అయితే ఈ అడియోపై బేబీలత కానీ, వైసీపీ నేతలు కానీ ఎవరూ స్పందించలేదు. అయితే ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగానే వైసీపీ నేతలు అధికారంలోకి వచ్చేస్తున్నట్లు కలలు కనడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉండగా రెండు సార్లు మహిళలు, అందునా ఎస్సీ సామాజికవర్గానికే హోంమంత్రి పదవి కేటాయించారు. భవిష్యత్తులోనూ అదే ఆనవాయితీ కొనసాగుతుందని, తాను ఎమ్మెల్యే అవ్వడమే కాకుండా హోంమంత్రి పదవి తనదేనంటూ బేబీలత చెప్పుకోవడం గమనార్హం. దీనిపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది.

Full View
Tags:    

Similar News