హల్క్ హోగన్ మరణానికి కారణమేంటి?
హోగన్ మరణవార్త రెజ్లింగ్ అభిమానులను, ప్రపంచ క్రీడాభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.;
అమెరికా ప్రఖ్యాత రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం హల్క్ హోగన్ (71) ఇకలేరు. ఫ్లోరిడాలో గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఇటీవలే ఆయన కోమాలో ఉన్నారన్న వార్తలను ఆయన భార్య స్కై డైలీ ఖండించినప్పటికీ కాలం ఆ హామీలను తిప్పికొట్టింది. హోగన్ మరణవార్త రెజ్లింగ్ అభిమానులను, ప్రపంచ క్రీడాభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
హల్క్ హోగన్ అసలు పేరు టెర్రీ .జీ. బొలియా. 1953 ఆగస్టు 11న జార్జియాలో జన్మించిన ఆయన, 1977లో తన రెజ్లింగ్ ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే 1980లలో వరల్డ్ రెజ్లింగ్ ఫెడరేషన్ (WWF)లో చేరిన తర్వాతే ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. మిలియన్ల మంది అభిమానులను సంపాదించిన హోగన్, రెజ్లింగ్‌ను కేవలం ఓ క్రీడగా కాకుండా ఓ వినోదమయ ప్రపంచంగా తీర్చిదిద్దారు. ఆయన రింగ్‌పై వేసిన ప్రతి అడుగు, చింపిన ప్రతి షర్ట్, గర్జించిన ప్రతి నినాదం రెజ్లింగ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.
ఐకానిక్ డ్యూయల్స్.. స్మరణీయ క్షణాలు
2000వ సంవత్సరం తర్వాత మళ్లీ రింగ్‌లోకి అడుగుపెట్టిన హోగన్, యువతరం రెజ్లర్లతో పోటీపడ్డారు. 'రాక్' డ్వైన్ జాన్సన్‌తో జరిగిన పోరు "ఐకాన్ వర్సెస్ ఐకాన్"గా పేరుగాంచింది. ఆ పోరు నేటికీ రెజ్లింగ్ చరిత్రలో నిలిచిపోయింది. హోగన్ మొత్తం ఆరు సార్లు WWF/WWE ఛాంపియన్‌షిప్ గెలుచుకున్నారు.
స్క్రీన్‌పై 'హోగన్ నోస్ బెస్ట్'
హోగన్ కేవలం రింగ్‌కే పరిమితం కాలేదు. 2005 నుండి 2007 వరకు VH1 చానల్‌లో ప్రసారమైన రియాలిటీ షో "హోగన్ నోస్ బెస్ట్" ద్వారా ఆయన కుటుంబ జీవితం ప్రజల ముందు ప్రత్యక్షమైంది. అందులో ఆయన తన కడుపు నొప్పులను, జీవితంలోని ఒడిదుడుకులను ఎంతో అన్వయంగా చూపించారు.
రాజకీయ పథాల్లో పయనించిన హీరో
గత అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో హోగన్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతు ప్రకటించారు. ఓ కార్యక్రమంలో తన స్టైల్‌లో షర్ట్ చింపుతూ, ఉత్సాహంగా ప్రసంగించడం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ట్రంప్ సహా పలువురు హోగన్‌ను నిలబెట్టి చప్పట్లతో అభినందించడం అరుదైన ఘట్టంగా మిగిలిపోయింది.
ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన హోగన్ నివాసానికి వైద్య బృందాలు చేరుకుని ఆసుపత్రికి తరలించాయి. కానీ అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మెడకు శస్త్రచికిత్స వికటించి బ్రెయిన్ డెట్ అయినట్లు తెలిసింది. ఆయన మరణంతో రెజ్లింగ్ ప్రపంచం ఓ శాశ్వత గుర్తుగా నిలిచే దిగ్గజాన్ని కోల్పోయింది. హల్క్ హోగన్ ఇక లేరు... కానీ ఆయన రక్తం, చెమట, కన్నీళ్లతో కూడిన అపార ప్రయాణం, రెజ్లింగ్ రంగాన్ని మార్చివేసిన ఆయన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది.