2029 లో కుప్పంలో జగన్ .. పులివెందులలో లోకేష్ ఇదే ట్రెండ్ నా ?

మాజీ ఎమ్మెల్యేలు కావడమేంటి, ఎన్నికలు జరిగితే ఒక పార్టీ గెలుస్తుంది మరో పార్టీ ఓడుతుంది, కానీ ఏకంగా అధినేతలనే ఓడించడం ఏమిటి.;

Update: 2026-05-05 18:03 GMT

సిట్టింగ్ ముఖ్యమంత్రులు ఓడిపోతారు. మాజీ ముఖ్యమంత్రులు కావడం వేరు. మాజీ ఎమ్మెల్యేలు కావడమేంటి, ఎన్నికలు జరిగితే ఒక పార్టీ గెలుస్తుంది మరో పార్టీ ఓడుతుంది, కానీ ఏకంగా అధినేతలనే ఓడించడం ఏమిటి. ఇది నయా పొలిటికల్ ట్రెండ్ నా అన్న చర్చ సాగుతోంది. 2021లో మమతా బెనర్జీ ఈ విధంగానే నందిగ్రాం లో ఓటమి పాలు అయ్యారు. ఉప ఎన్నికల్లో గెలిచి సీఎం అయ్యారు. అప్పటికి తమ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి. ఈసారి భవానీపూర్ లో మళ్ళీ ఆమె ఓడారు, పార్టీ కూడా ఓటమి పాలు అయింది. ఇలా డబుల్ బొనంజాలా భారీ షాకులు తగిలాయి మమతా బెనర్జీకి. అదే విధంగా తమిళనాడులో స్టాలిన్ కూడా సీఎం సీటుని కోల్పోయారు అనుకుంటే ఎమ్మెల్యేగానూ ఓటమి పాలు అయ్యారు. అది కూడా కొత్తగా పార్టీ పెట్టిన టీవీకే అభ్యర్ధి చేతిలో.

టార్గెట్ చేస్తున్నారా :

ఇది గతంలో ఎక్కడా చూడని సీన్. ఇటీవల కాలంలో పెరిగిన ట్రెండ్. తమకు నచ్చని నాయకులు ఎమ్మెల్యేలుగా కూడా సభకు వచ్చి విపక్షంలో కూర్చోరాదని పెట్టుకున్న నియమంగా కనిపిస్తోంది. అదే పట్టుదలగా మారి ఓడిస్తోంది. ఇంతకు ముందు అయితే ఓడిన వారు ప్రతిపక్షంలో ఉండి విపక్ష నేతగా సలహా సూచనలు ఇచ్చేవారు. అలా సలహాలు ఇవ్వాలని కోరుకునే వారు కూడా. కానీ ఇపుడు అంతా తారు మారు అవుతోంది. రాజకీయ ప్రత్యర్ధులు పోయి శతృవులు వస్తున్నారు. అందుకే ఏకంగా ప్రజా ప్రతినిధులుగా వారు ఉండకూడదు సభకే రాకూడదు అని నేతలు సభలలోనే పిలుపు ఇస్తున్నారు. అధినేతల మీద గట్టి అభ్యర్ధులను పెట్టి మరీ ఓటమికి కృషి చేస్తున్నారు. ప్రత్యేక వ్యూహాలతో పనిచేసి మరీ చిత్తు చేస్తున్నారు.

కట్టడి చేసే వ్యూహం :

పార్టీ అధినేతలు అయితే ఎన్నో బాధ్యతలు ఉంటాయి. వారు తాము నామినేషన్ వేసిన సీట్లో నామ మాత్రం ప్రచారం చేస్తారు. వారు రాష్ట్రమంతా తిరిగి తమ అభ్యర్ధులకు ప్రచారం చేయాల్సి ఉంటుంది. అయితే ఇదే అదనుగా చేసుకుని వారి సీట్లో రాజకీయ సమరాన్నే రాజేసి పెడితే వారు ఒక విధంగా కట్టడి అవుతారు. వారి ఏకాగ్రత మొత్తం దెబ్బ తింటుంది, వారి చూపు తమ సొంత సీటు మీదనే ఉంటుంది, దాంతో వారు రాష్ట్రమంతా ప్రచారం చేయలేకపోవచ్చు, ఇది ఒక ఎత్తుగడ. ఒకవేళ ప్రచారం చేస్తే మాత్రం రాష్ట్రంలో వేరే చోటకు వెళ్ళని పరిస్థితి ఉంటుంది. అలా చేసి ఓడించాలన్న ఎత్తుగడ బాగా అమలు చేస్తున్నారు. 2021లో అదే చేశారు, 2026 లో అదే జరిగింది. దాంతో ముఖ్యమంత్రులుగా చేసిన వారు మాజీ ఫలితాల తరువాత మాజీ ఎమ్మెల్యేలు అవుతున్నారు.

ఏపీలో తీరు చూస్తే :

ఏపీలో రాజకీయం చూస్తే భీకరంగా సాగుతోంది. ఇక్కడ ప్రత్యర్ధులు అన్న మాట మరచిపోయి ముందుకు పోతున్న నేపధ్యం ఉంది. దాంతో 2029 ఎన్నికలలో ఇలాగే చేయబోతారా అన్న చర్చ బయలుదేరింది. కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని వైసీపీ అధినేత జగన్ ప్రయత్నం చేస్తారా అక్కడ గట్టి అభ్యర్ధిని పోటీకి పెట్టి బాబుని కట్టడి చేసే వ్యూహాన్ని అమలు చేస్తారా అన్న చర్చ సాగుతోంది. మరి అదే సమయంలో టీడీపీ కూడా ఊరుకోదు కదా అని అంటున్నారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా లోకేష్ టీడీపీ ద్వారా ఈ తరహా కట్టడి అండ్ కంట్రోల్ పాలిటిక్స్ కి తెర తీస్తే రేపటి ఏపీ ఎన్నికలు మరింత వేడెక్కిపోవడం ఖాయమని అంటున్నారు. ప్రజా స్వామ్యంలో ప్రతిపక్షం కూడా కీలకమైనది. అందులో అనుభవం ఉన్న వారు సభలో ఉండాలని గతంలో కోరుకునేవారు. అదే మంచి సంప్రదాయం. ఆ విధానం కొనసాగిస్తేనే అందరికీ మేలు కానీ ఇలా రాజకీయ ఎత్తులతో ప్రత్యర్ధులను చిత్తు చేయాలని చూస్తే అంతిమంగా ప్రజా ప్రయోజనాలకే విఘాతం కలుగుతుందని మేధవులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News