గోధుమ పిండి ఎఫెక్ట్.. ఈ రేంజ్‌లో దెబ్బేస్తుందని అనుకోలేదు.. స్టాక్ మార్కెట్ బెంబేలు!
గోధుమ పిండి ధరలను కేంద్రం తగ్గించడంతో.. ఇతర సరుకుల ధరలపైనా మార్కెట్‌లో అనుమానాలు ప్రారంభమయ్యాయి.
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. వచ్చే సార్వత్రిక ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన ప్రయోగం.. స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. తాజాగా గోధుమ పిండిని దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు కిలో 27.50 రూపాయలకు విక్రయించాలని మోడీ సర్కారు నిర్ణయించింది. అంతే! వెంటనే స్టాక్ మార్కెట్ సూచీలు టపాటపా పడిపోయాయి.
ఏం జరిగిందంటే..
గోధుమ పిండి ధరలను కేంద్రం తగ్గించడంతో.. ఇతర సరుకుల ధరలపైనా మార్కెట్‌లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అసలే ఎన్నికల సీజన్ కావడంతో ఇంకా ఏయేం ధరలు తగ్గిస్తారోననే భయం వెంటాడింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్176 పాయింట్ల నష్టంతో 64,781 దగ్గర ట్రేడవుతోంది.
నిఫ్టీ 48 పాయింట్లు తగ్గి 19,363 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 దగ్గర ప్రారంభమైంది. టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎల్‌అండ్‌టీ, టైటన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ షేర్లు అత్యధికంగా నష్టపోతున్న షేర్ల జాబితాలో ఉన్నాయి.
ఎందుకిలా?
గోధుమల పంటలో భారత్ ముందంజలోనే ఉన్నప్పటికీ.. దేశీయంగా వినియోగిస్తున్న గోధుమల పిండి విషయంలో మాత్రం అంతర్జాతీయ దేశాలపై ఆధారపడి ఉంది. దీంతో ఆయా దేశాల నుంచి స్టాకును నిలిపివేసి.. దేశీయంగా ఉన్న గోధుమలకే ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే.. ఈ పరంపర ఇక్కడితో ఆగేది కాదని, ఇంకా నిత్యావసరాలకు బ్రేకులు పడతాయనే చర్చ స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతోంది. దీంతో మదుపరులు ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.