వరంగల్ కాంగ్రెస్ Vs కొండా దంపతులు.. మీనాక్షికి 16 పేజీల లేఖ
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్సులో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను కొండా దంపతులు ప్రత్యేకంగా కలిశారు.;
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు డైలీ ఎపిసోడ్ ను తలపిస్తున్నాయి. కొన్ని రోజులుగా జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రి కొండా సురేఖ దంపతులకు మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు సమావేశాలు నిర్వహించడం, పార్టీ అధిష్టానికి ఫిర్యాదులు చేయడం జరుగుతోంది. జిల్లా ఎమ్మెల్యేలపై మంత్రి సురేఖ భర్త సీనియర్ నేత కొండా మురళి వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. దీనిపై ఎమ్మెల్యే నాయిని రాజేంద్రనాథ్ రెడ్డి నివాసంలో మిగిలిన నేతలు సమావేశమై కొండా తీరుపై పార్టీ పెద్దలకు ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వారం పార్టీ క్రమశిక్షణ సంఘానికి ఎమ్మెల్యేలపై ఓ నివేదిక సమర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, గురువారం పార్టీ రాష్ట్ర ఇన్ చార్జి మీనాక్షి నటరాజన్ ను కలిసి మరో నివేదిక సమర్పించారు.
హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్సులో పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ను కొండా దంపతులు ప్రత్యేకంగా కలిశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుమారు 16 పేజీలతో నివేదిక ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న మొత్తం 12 నియోజకవర్గాల్లో ఎక్కడ ఏం జరుగుతుందో ఆ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. తమపై జిల్లా ఎమ్మెల్యేలు చేసిన ఫిర్యాదుపైనా మంత్రి కొండా సురేఖ దంపతులు వివరణ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. తమపై వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి నిజాలు తెలుసుకున్న తర్వాత ఎవరిది తప్పుంటే వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ను కోరినట్లు తెలుస్తోంది.
అనంతరం బయటకు వచ్చిన కొండ దంపతులు ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్దే మీడియాతో మాట్లాడారు. తనకు కేటాయించిన శాఖలకు న్యాయం చేస్తున్నానని, రూల్స్ ప్రకారమే నడుచుకుంటున్నానని మంత్రి సురేఖ తెలిపారు. తను చూస్తున్న డిపార్టుమెంట్ల ఫైల్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చని, మంత్రిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని వివరించారు. నా మంత్రి పదవిపై ఎవరు మాట్లాడినా స్పందించాను. సుష్మితలో పారేది కొండా మురళీ, కొండా సురేఖ రక్తం. మా కూతురికి మా ఆలోచనలు వంశపారంపర్యంగా రావడంలో తప్పులేదని సురేఖ వ్యాఖ్యానించారు.
కాగా, కొండా మురళీ మాట్లాడుతూ తాను బీసీ కార్డు పట్టుకునే బతుకుతున్నట్లు చెప్పారు. అణగారిన వర్గాలు బలం ఉన్నవాడి దగ్గరికే వస్తారు. పేదల సమస్యలు తీర్చుతాను కాబట్టే జనం తన వద్దకు వస్తారని తెలిపారు. నాకు ప్రజా బలం ఉంది. పనిచేసే వారిపైనే బండలు వేస్తారు. నడిచే ఎద్దునే పొడుస్తారు. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చిన గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కు హామీ ఇచ్చినట్లు మురళీ తెలిపారు. ‘కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం. రాహుల్ గాంధీని ప్రధాని చేయడం నా ఉద్దేశం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేండ్లు ముఖ్యమంత్రిగా చూడడం నా ఉద్దేశం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌కు అండగా నిలుస్తా’ అని కొండా మురళి స్పష్టం చేశారు.
గత కొద్దిరోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ర రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాయిని రాజేంద్రనాథ్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎంపీ ఆర్.సురేంద్రరెడ్డితో కొండా దంపతులు విభేదిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే జిల్లా కాంగ్రెస్ అంతా ఒకవైపు కొండా దంపతులు మరోవైపు అన్నట్లు పరిస్థితి మారిపోయింది. జిల్లాలోని కీలక నేతలు అయిన మంత్రి సీతక్క, వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, సీనియర్ నేత బలరాం నాయక్ వంటివారు తటస్థంగా ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీ నిలువునా రెండుగా చీలిపోయే ప్రమాదం ఉందన్న సమాచారంతో అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ వివాదాన్ని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఎలా చక్కదిద్దుతారనేది ఉత్కంఠ రేపుతోంది.