మోడీతో ఢీ కొడుతున్న జగన్ కేసీఅర్ ?

సరే ఆ గండం అలా తప్పింది అనుకుంటే ఇపుడు వక్ఫ్ బిల్లు పేరుతో మరొకటి వచ్చింది.;

Update: 2025-04-02 08:32 GMT

అవును ఇపుడు పిక్చర్ క్లియర్ గా వస్తోంది. నిన్నటి దాకా కధ వేరు. ఇపుడు వేరే కధ సాగుతోంది. పార్టీల అస్తిత్వానికే అసలైన సమస్యగా వక్ఫ్ బిల్లు వచ్చింది. దీంతో ఆ రెండు పార్టీల అధినేతలకు అగ్ని పరీక్షగా మారింది. ఆ పార్టీలు వైసీపీ బీఆర్ఎస్ అయితే వాటి అధినేతలు వైఎస్ జగన్ కేసీఆర్.

ఈ ఇద్దరు నేతలూ కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతను పూర్తి స్థాయిలో బాహాటంగా చాటుకుంటున్నా బీజేపీ విషయంలో అంత దూకుడు అయితే చూపించలేరు అనే అంటూ వచ్చారు. దానికి తగినట్లుగానే గడచిన అయిదేళ్ళ పాటూ అంతా సాగింది. బీజేపీ ఏ బిల్లు ప్రవేశపెట్టినా లోక్ సభ రాజ్యసభలలో ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చేవి. మరీ ముఖ్యంగా వైసీపీ అయితే ఫుల్ సపోర్టుగా ఉండేది.

ఇక వైసీపీ ఏపీలో ఓటమి చెందినా పది నెలలుగా కూటమి సర్కార్ రాజ్యం చేస్తున్నా అందులో బీజేపీ కూడా ఉన్నా వైసీపీ బీజేపీ మీదకు వెళ్ళడం లేదు. అంతవరకూ ఎందుకు డీలిమిటేషన్ మీద చెన్నై వేదికగా డీఎంకే అధినేత స్టాలిన్ అఖిలపక్ష సమావేశం పెడితే దానికి వైసీపీ హాజరు కాలేదు. అదే సమయంలో మెత్త మెత్తగా ప్రధానికి ఒక లెటర్ రాసి ఊరుకుంది.

సరే ఆ గండం అలా తప్పింది అనుకుంటే ఇపుడు వక్ఫ్ బిల్లు పేరుతో మరొకటి వచ్చింది. బీజేపీ ప్రాణ సమామైన ఈ బిల్లుకు వైసీపీ మద్దతు ఇవ్వడం లేదు. ఇస్తే కనుక వైసీపీకి మొదటి నుంచి అండగా ఉన్న ముస్లిం ఓట్లు మొత్తం పోతాయి. అందుకే ఈ బిల్లుకు మేము వ్యతిరేకం అని వైసీపీ చెబుతోంది. చాలా కాలంగా చూస్తే కనుక బీజేపీని ఇంత బాహాటంగా వైసీపీ ఎదిరించడం ఇదే మొదటిసారి అని అంటున్నారు.

ఇక ఇప్పటిదాకా మద్దతు ఇచ్చిన వైసీపీ ఇలా ఎదురు నిలవడాన్ని బీజేపీ ఏ విధంగా చూస్తుంది అన్నది కూడా ఒక చర్చగా ఉంది. బీజేపీకి లోక్ సభలో మద్దతు సరిపోతుంది. కానీ ఎక్కువ మంది ఓట్లు వస్తే బాగుంటుంది అన్నది ఆ పార్టీ ఉద్దేశ్యం. అలాగే రాజ్యసభలో తక్కువ ఓట్లతో అయినా బిల్లు పాస్ అవుతుంది. కానీ అక్కడ వైసీపీకి 7మంది ఎంపీలు ఉన్నారు. వారి మద్దతు ఉంటే ఘనంగా ఉంటుంది అని ఆలోచిస్తోంది.

ఇక తమకు మద్దతు అని కాదు ఈ బిల్లుని తుదికంటా వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి వైపు ఉండి అపోజ్ చేయడం అంటే వైసీపీ మీద బీజేపీకి ఏ రకమైన ఆగ్రహం వస్తుందో అన్న చర్చ కూడా ఉంది. అందుకే మాజీ మంత్రి పేర్ని నాని ఒక మాట అన్నారు. మేము వక్ఫ్ బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తాం, దాని వల్ల రాజకీయంగా మాకు ఇబ్బందులు వచ్చినా అని. మరి రాజకీయంగా ఏ ఇబ్బందులు వస్తాయన్నది ఆయన చెప్పలేదు. కానీ ఎవరికి వారే ఊహించుకోవాల్సి ఉంది అని అంటున్నారు.

ఇక తెలంగాణాలో చూస్తే కేసీఆర్ ది అదే పరిస్థితి. బీజేపీని పూర్తిగా వ్యతిరేకినలేకపోయినా ఇపుడు అనివార్యత అలా వచ్చింది. లోక్ సభలో బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ లేరు కానీ రాజ్యసభలో ఉన్నారు. ఆ పార్టీకి కేసుల భయం ఉంది అని అంటారు. కవిత ఇప్పటికే జైలుకు వెళ్ళి వచ్చారు. ఇంత బాహాటంగా బీజేపీ వ్యతిరకతను చాటుకుంటే ముందు ముందు ఎలా ఉంటుందో అన్న కలవరం అయితే ఉంది. మొత్తానికి వక్ఫ్ బిల్లు కాదు కానీ జగన్ కేసీఆర్ లకు ఇపుడు అసలైన అగ్ని పరీక్షగానే ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News