వక్ఫ్ సవరణ బిల్లు-2025 లోక్‌సభ ఆమోదం!
నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025 బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది.;
నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వక్ఫ్ (సవరణ) బిల్లు–2025 బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుకు అనుకూలంగా 288 మంది సభ్యులు ఓటు వేయగా, 232 మంది వ్యతిరేకించారు. అంతకుముందు ఈ బిల్లుపై దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘమైన చర్చ జరిగింది.
ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని విపక్ష ఇండియా కూటమి ఆరోపించగా, ప్రభుత్వం మాత్రం పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకువచ్చామని సమర్థించుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు జరిగిన వాడివేడి చర్చలో ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నిందని విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.
హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభలోనే బిల్లు కాపీని చించేశారు. అధికార ఎన్డీయే కూటమి ఎంపీలు మాత్రం ఈ బిల్లును సమర్థించారు. విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని వారు ఆరోపించారు.
వక్ఫ్ సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఎగువ సభలో దీనిపై చర్చ కోసం 8 గంటల సమయం కేటాయించారు. అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో కూడా ఎన్డీయేకు తగినంత మెజారిటీ ఉండటంతో ఈ బిల్లు అక్కడ కూడా సులువుగా ఆమోదం పొందే అవకాశం ఉంది.
- యూపీఏ ప్రభుత్వ తప్పిదమే కారణం: కిరెణ్ రిజిజు
వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు బుధవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటుచేసుకుంది. ముస్లింల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎన్డీయే పేర్కొనగా, ఈ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని విపక్షాలు తీవ్రంగా ఆక్షేపించాయి.
ఈ బిల్లు పేరును ఉమ్మీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్‌మెంట్–యూఎంఈఈడీ)గా మారుస్తున్నట్లు రిజిజు ప్రకటించారు. చర్చను ప్రారంభిస్తూ తాము ప్రతిపాదించిన సవరణలు లేకపోతే పార్లమెంటు భూమిని కూడా వక్ఫ్ ఆస్తిగా పరిగణించాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఆలిండియా ముస్లిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్, పార్లమెంటు భవనం.. దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్ ఆస్తుల్లో భాగమేనని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ బిల్లు కేవలం వక్ఫ్ ఆస్తుల నిర్వహణకు సంబంధించినదని, ముస్లింల మత విశ్వాసాల్లో ఎలాంటి జోక్యం చేసుకోబోదని రిజిజు స్పష్టం చేశారు. వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేపీసీ) ద్వారా సుదీర్ఘంగా చర్చలు జరిపామని, జేపీసీ సూచించిన అనేక సవరణలను అంగీకరించామని ఆయన తెలిపారు. అయినప్పటికీ, విపక్షాలు అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. యూపీఏ హయాంలో వక్ఫ్ చట్టానికి చేసిన మార్పుల వల్లనే ఈ సమస్యలు వచ్చాయని, ఆ చట్టాన్ని ఇతర చట్టాలకు అతీతంగా మార్చేశారని, అందుకే ఈ సవరణలు తప్పనిసరి అయ్యాయని రిజిజు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏ మత సంస్థల వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోదని ఆయన హామీ ఇచ్చారు. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో వక్ఫ్ ఆస్తులు భారతదేశంలోనే ఉన్నాయని, వాటిని పేద ముస్లింల సంక్షేమానికి మాత్రమే ఉపయోగించాలని, అలా జరిగేలా చూడటమే ఈ బిల్లు లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నవారెవరో, వ్యతిరేకిస్తున్నవారెవరో దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని ఆయన అన్నారు.
కాంగ్రెస్ తరఫున గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ రిజిజు వాదనను తీవ్రంగా ఖండించారు. ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూపంపై దాడి అని ఆయన అభివర్ణించారు. రిజిజు చర్చకు సమాధానమిస్తూ మైనారిటీలకు భారతదేశం కంటే సురక్షితమైన దేశం ప్రపంచంలో లేదని అన్నారు. అత్యల్ప సంఖ్యాకులైన పార్సీలు కూడా ఇక్కడ సగర్వంగా జీవిస్తున్నారని ఆయన ఉదాహరించారు.
- అందరూ అంగీకరించాల్సిందే: అమిత్ షా
వక్ఫ్ బిల్లు విషయంలో దేశంలో గందరగోళం సృష్టించేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. ముస్లింలను భయపెట్టి వారిని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ బిల్లు ముస్లింల మత సంబంధిత అంశాల్లో జోక్యం చేసుకుంటుందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. భారత ప్రభుత్వం మరియు పార్లమెంటు చేస్తున్న చట్టాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. యూపీఏ నిర్ణయం వల్ల ఢిల్లీలోని ల్యూటెన్స్ జోన్‌లో కేవలం 25 రోజుల్లో 123 ఆస్తులు వక్ఫ్ ఆస్తులుగా మారిపోయాయని ఆయన తెలిపారు. ఇలాంటి అవకతవకలను సరిదిద్దడం, వక్ఫ్ భూములు మరియు ఆస్తుల నిర్వహణ పూర్తిగా ప్రజాస్వామికంగా మరియు పారదర్శకంగా జరిగేలా చూడటమే ఈ తాజా బిల్లు యొక్క ఉద్దేశ్యం అని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు కోసం చట్టాలు చేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటు లేదని ఆయన తేల్చిచెప్పారు. పౌరుల వ్యక్తిగత మరియు ప్రభుత్వ ఆస్తులన్నింటినీ పరిరక్షించడం తమ బాధ్యత అని ఆయన అన్నారు. కేవలం వక్ఫ్ ఆస్తి అని ప్రకటించినంత మాత్రాన ఎవరి భూమీ వక్ఫ్ భూమిగా మారకుండా తగిన రక్షణలను ఈ బిల్లు కల్పిస్తుందని ఆయన వివరించారు.
అనంతరం బీజేపీతో పాటు విపక్షాల నుంచి పలువురు సభ్యులు అర్ధరాత్రి వరకు బిల్లుపై మాట్లాడారు. ఓటింగ్ ద్వారా బిల్లు ఆమోదం పొందిన తర్వాత విపక్షాలు ప్రతిపాదించిన అనేక సవరణలు ఒక్కొక్కటిగా వీగిపోయాయి.
- చర్చకు రాహుల్ గైర్హాజరు
కీలకమైన వక్ఫ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చకు .. ఓటింగ్‌కు విపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కాలేదు. ఆయన సోదరి , వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా బుధవారం సభకు రాలేదు. ఉదయం సభలో ఆయన పార్టీ ఎంపీలతో బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినప్పటికీ, చర్చలో పాల్గొనరాదని రాహుల్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌కు కేటాయించిన సమయంలో గౌరవ్ గొగోయ్, ఇతర పార్టీ ఎంపీలు మాట్లాడారు.