విశాఖ లవర్ ఎవరు... బాబా జగనా ?

విశాఖ అంటేనే బ్యూటీఫుల్ సిటీ అన్నది తెలిసిందే. విశాఖ నగరానికి ఒక్కసారి ఎవరైనా వస్తే చాలు ఆ ప్రేమలో పడక మానరు. వారంతట వారే లవర్స్ గా మారిపోతారు.;

Update: 2025-12-14 03:54 GMT

విశాఖ అంటేనే బ్యూటీఫుల్ సిటీ అన్నది తెలిసిందే. విశాఖ నగరానికి ఒక్కసారి ఎవరైనా వస్తే చాలు ఆ ప్రేమలో పడక మానరు. వారంతట వారే లవర్స్ గా మారిపోతారు. అందుకే విశాఖకు సిటీ ఆఫ్ డెస్టినీ అని పేరు వచ్చింది. జీవిత కాలంలో కాశీకి వెళ్ళమని హిందూ మతాన్ని నమ్మే వారికి చెబుతారు. ఇతర మతాల వారికి అధ్యాంతిక ప్రదేశాలు ఉన్నాయి. అందరికీ మాత్రం నచ్చే మెచ్చే ఏకైక ప్రదేశం మాత్రం విశాఖ అని నిర్వివాదాంశంగా అంతా అంగీకరిస్తారు.

కూటమి ఫోకస్ :

విశాఖ పట్ల ప్రేమ మాకు ఉంది అంటే మాకు ఉందని టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పెద్ద డైలాగ్ వార్ సాగుతోంది. దానికి కారణం విశాఖ ఇపుడు రెండు ప్రభుత్వాలకు కేంద్ర బిందువుగా మారింది. నిజానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత అమరావతి అయినా కూడా అది ఇప్పటికిప్పుడు తయారవదు కాబట్టి విశాఖ నుంచే కూటమి అన్ని కార్యక్రమాలను నిర్వహిస్తోంది. విశాఖలోనే గత నెలలో భాగస్వాముల పెట్టుబడుల సదస్సుని గొప్పగా నిర్వహించింది. ఇక మాటకు వస్తే చాలు విశాఖకు వస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నారా లోకేష్ ఇతర మంత్రులు. లేటెస్ట్ గా తొమ్మిది ఐటీ కంపెనీలకు బాబు లోకేష్ కలసి భూమి పూజ చేశారు.

గ్రోత్ ఇంజన్ విశాఖ :

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బాబు మంత్రి నారా లోకేష్ కూడా విశాఖను గ్రోత్ ఇంజన్ గా అభివర్ణించారు. విశాఖ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని అన్నారు. ఎన్నో పరిశ్రమలు విశాఖ వస్తున్నాయని చెప్పరు. ఐటీ హబ్ గా విశాఖ మారబోతోంది అని కూడా అంటున్నారు. విశాఖ అభివృద్ధితో ఏపీకి కూడా దశ తిరుగుతుందని చెబుతున్నారు. అలా విశాఖ గురించి ఎక్కువగా బాబు చెబుతూ వస్తున్నారు. ఎకనామిక్ కారిడార్ గా విశాఖ ఉంటుందని కూడా చెప్పుకొస్తున్నారు.

క్రెడిట్ మాదే అంటూ :

అయితే వైసీపీ నేతలు ముందుకు వచ్చి విశాఖ మీద ప్రేమ మాకే ఉందని క్లెయిం చేస్తున్నారు జగన్ హయాంలోనే విశాఖ మీద ఫోకస్ పెట్టామని దాని ఫలితాలు ఇపుడు వస్తున్నాయని చెబుతున్నారు. విశాఖలో కాగ్నిజెంట్ రావడం అయినా ఐటీ కంపెనీలు వచ్చినా పారిశ్రామికంగా విశాఖని అభివృద్ధి చేసే యాక్షన్ ప్లాన్ ని తమ ప్రభుత్వంలోనే డిజైన్ చేసి అమలు చేశామని దానినే కూటమి పాలకులు అనుసరిస్తున్నారు అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అంటున్నారు. ఒకనాడు విశాఖ అంటే వద్దు అని అన్న చంద్రబాబుకు విశాఖ మీద ప్రేమ ఎందుకు పుట్టుకు వస్తోంది ఆయన ప్రశ్నించారు. తాము విజన్ తో ఆలోచించాం కాబట్టే విశాఖ ఈ రోజున ఇలా ఉందని దానినే కూటమి ఫోకస్ చేస్తోందని ఆయన అన్నారు.

బాబు కంటే ఎవరున్నారు :

ఇక దీని మీద విశాఖ జిల్లా ఇంచార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ బాబు కంటే విశాఖను అభిమానించే వారు ఎవరూ లేరని స్పష్టం చేశారు. విశాఖ అభివృద్ధికి బాబు కట్టుబడి పనిచేస్తున్నారు అని చెప్పారు. ఏపీలో అన్ని ప్రాంతలా సమగ్ర అభివృద్ధి బాబు ధ్యేయమని కూడా ఆయన అన్నారు. మొత్తం మీద చూస్తే కనుక విశాఖ మీద మాకు ప్రేమ ఉందని వైసీపీ అంటే మాకే ఎక్కువ ఉందని టీడీపీ అంటోంది. అయితే విశాఖ వాసులే వైజాగ్ లవర్స్ ఎవరో తేల్చాల్సి ఉందని అంటున్నారు.

Tags:    

Similar News