విజయ్ కి పవన్ కి పోలిక అంతవరకే !

తమిళనాడులో విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా విజయం సాధించిన నేపథ్యంలో అందరూ పవన్ కళ్యాణ్ మీద పడ్డారు.;

Update: 2026-05-06 02:30 GMT

తమిళనాడులో విజయ్ తన టీవీకే పార్టీ ద్వారా విజయం సాధించిన నేపథ్యంలో అందరూ పవన్ కళ్యాణ్ మీద పడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆయన్ని ట్రోల్ చేయడం ప్రారంభించారు. దానికి కారణం పవన్ విజయ్ ఇద్దరూ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారే. ఇద్దరూ సినీ రంగంలో టాప్ స్టార్స్ గా ఉన్న వారే. దాంతోనే ఈ పోలిక వచ్చింది. పవన్ పదేళ్ళ రాజకీయం తరువాత మూడు ఎన్నికలు చూసి ఉప ముఖ్యమంత్రి అయితే విజయ్ పార్టీ పెట్టిన రెండేళ్ళలోనే సీఎం అవుతున్నారు. దాంతో పవన్ అక్కడికి ఏదో తక్కువ అన్నట్లుగా ట్రోల్స్ చేస్తున్నారు. రాజకీయాలు అంటేనే చిత్రమైనవి. పైగా ప్రజా జీవితంతో ముడిపడి ఉన్నవి. వాటిలో విజయాలు అన్నవి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటాయి. ఏపీకి తమిళనాడుకు అనేక విషయాలలో తేడాలు ఉన్నాయి. అక్కడ జనాలు చూసే దానికి ఏపీ ప్రజలు ఆలోచించే దానికి కూడా చాలా తేడాలు కనిపిస్తాయి అని విశ్లేషిస్తున్నారు.

సినీ రాజకీయ బంధం :

తమిళనాడులో మొదటినుంచి స్టార్ హీరోలకు జనాలు పట్టం కడుతున్నారు. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు. అది ఈనాటిది కాదు ఒక కరుణానిధి ఎంజీఆర్ జయలలిత ఇలా చూసుకుంటే సినీ రంగం నుంచి రాజకీయాలకు వచ్చి అద్భుతాలు సృష్టించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా టీవీకే అధినేత విజయ్ విజయం కూడా ఆ విధమైనదే అని టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు భావిస్తున్నారు. తెలుగు నాట చూస్తే కనుక అంతటి సినీ రాజకీయ బంధం లేదు. తమిళనాడులో ఈ బంధం దశాబ్దాలు గా కొనసాగుతోంది. అందుకే విజయ్ రాజకీయ రంగ ప్రవేశం అంత సులువుగా జరగడమే కాదు మంచి విజయాలను కూడా అందుకునేలా చేసింది.

కలసి వచ్చిన నేపథ్యం :

ఇక తమిళనాడులో అధికార డిఎంకె పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది అదే సమయంలో విపక్షంలో ఉన్న అన్నాడీఎంకెలో సరైన నాయకత్వం లేదు చరిష్మా ఉన్న లీడర్ షిప్ లేదు. దాంతో రాజకీయ శూన్యత అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. దానిని సరిగ్గా అంచనా వేసుకున్న విజయ్ తమిళనాడు ప్రజల సెంటిమెంటును కూడా బలంగా నమ్మి సినీ రంగం నుంచి నేరుగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అది కూడా కరెక్ట్ టైం తో టైమింగ్ తో జరిగింది. దాంతో విజయ్ పార్టీ టీవీకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక సునామీనే సృష్టించింది. అయితే తెలుగులో ముఖ్యంగా ఏపీలో పవన్ కళ్యాణ్ కి ఎందుకు ఈ సినీ మ్యాజిక్ పనిచేయలేదు అంటూ చాలా మంది అడుగుతున్నారు. సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎన్టీఆర్ ది ప్రత్యేకం :

కానీ తెలుగులో మరీ ముఖ్యంగా ఆంధ్రాలో తమిళనాడు అంతగా సినీ రాజకీయ బంధం పెనవేసుకోలేదు. ఒక్క ఎన్టీ రామారావు విషయం ఒక ప్రత్యేకత, అది ఎలా అంటే ఆయన రామాయణ మహాభారత పురాణ గాధల నుంచి ఎన్నో పాత్రలు తీసుకొని వెండితెరపై నటుడుగా ఎన్టీఆర్ అందంగా ఆవిష్కరించారు. ఆయనను తెలుగు ప్రజానీకం ఒక దేవుడిగా రాముడుగా భావించింది. ఆయన సినిమాల్లోనే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా చేపట్టడం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యారు. ఇక నలభై రెండేళ్ల క్రితం రాజకీయం వేరు. అప్పట్లో కాంగ్రెస్ ఒక్కటే ప్రధాన పక్షం. సరైన ప్రతిపక్షం లేకపోవడం ఏకధాటిగా మూడున్నర దశాబ్దాలు కాంగ్రెస్ పాలన సాగడంతో జనాలు విసిగి పోయారు. ఆ సమయంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టి సక్సెస్ అయ్యారు. అలా తమిళనాడు కి తెలుగునాడుకూ చాలా విషయాల్లో తేడాలు ఉన్నాయి. అందువల్లనే పవన్ కళ్యాణ్ విషయంలో ఒంటరి పోరాటం తెలుగులో సరైన ఫలితాలు ఇవ్వలేకపోయింది. అదే విజయ్ తమిళ సెంటిమెంట్లు కలిసి రావడంతో సక్సెస్ అయ్యారన్నది టాలీవుడ్ ప్రముఖుల రాజకీయ విశ్లేషణగా కనిపిస్తోంది. అక్కడ సినీ రాజకీయ అనుబంధంతో విజయ్ సాధించిన విజయం కూడా ఎంజీఆర్ కోవలోకి చెందినదేనని వారు అంటున్నారు. అందువల్ల తెలుగులో పవన్ కళ్యాణ్ కి సినీ ఇమేజ్ పూర్తిగా ఉపయోగపడలేదు అనడం తప్పు అని చాలామంది భావిస్తున్నారు.

Tags:    

Similar News