గుంటూరు వెస్ట్ లో రజనీకి కలిసొస్తున్న కీలక అంశాలివే!

దీంతో... ఇది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజనీకి అదనపు బలం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-05-10 12:15 GMT

గుంటూరు పశ్చిమలో టీడీపీ పెను సవాళ్లను ఎదుర్కొంటుందనే చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో మరింత బలంగా నడుస్తుంది. ఇంతకాలం నియోజకవర్గాన్ని అంటిపెట్టుకున్న నేతను వేరే చోటికి పంపడం, ఉన్న వ్యక్తులు టిక్కెట్లు దక్కక అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తుండటంతో.. నడిపించే నాయకులు లేక పార్టీ క్యాడర్ అల్లాడుతోందనే చర్చ బలంగా వినిపిస్తుందని అంటున్నారు. దీంతో... ఇది వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజనీకి అదనపు బలం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును.. గుంటూరు వెస్ట్ లో టీడీపీ కేడర్ కు సమస్యలు వదిలిపెట్టడం లేదు. పోలింగ్ తేదీ దగ్గరపడుతున్నా కూడా వారి సమస్యలు తీరడంలేదని అంటున్నారు అందుకు కారణం... సుమారు నాలుగున్నరేళ్లు గుంటూరు పశ్చిమలో పార్టీకి సేవ చేస్తూ ఇంఛార్జిగా ఉన్న కోవెలమూడి రవీంద్ర (నానీ) కి టిక్కెట్ ఇవ్వలేదు బాబు! పైగా... స్థానికంగా అతని సేవలు కేడర్ వినియోగించుకునే అవకాశం లేకుండా రాయలసీమ ఇంఛార్జిగా పంపించేశారు.

దీంతో ఆయన క్యాడర్ అంతా చెల్లా చెదురైపోయిందని అంటున్నారు! కోవెలమూడి నానీ వద్దకు... అన్నా అంటూ వెళ్లి ఆప్యాయంగా పలకరించే నేతలు, కార్యకర్తలు, స్నేహితులు, సామాజికవర్గ నేతలు ఎవరూ కూడా ఇప్పుడు గళ్లా మాధవి వెంట లేరని చెబుతున్నారు. ఈ సమయంలో ఎందుకొచ్చిన తలపోట్లు అనుకుంటూ కొందరు గుంటూరు పశ్చిమను వదిలి వెళ్లిపోయారనే చర్చా మొదలవ్వడం గమనార్హం!

Read more!

పోనీ స్థానిక పరిస్థితిని కోవెలమూడి నానీకైనా చెబుదామంటే.. ఆయన రాయలసీమలో ఫుల్ బిజీగా బిజీగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారని తెలుస్తుంది. ఇది గుంటూరు వెస్ట్ టీడీపీలో మేజర్ సమస్యగా ఉందని అంటున్నారు. ఇదే క్రమంలో... ఆలపాటి రాజా కూడా తెలుగుదేశం పార్టీకి అంటీ ముట్టనట్లు ఉంటున్నారన్ని అంటున్నారు. ఎక్కడి నుంచో కొత్తగా వచ్చిన గళ్లా మాధవికి టిక్కెట్ ఇవ్వడంతో రాజా వర్గం సైలంట్ గా ఉన్నారని అంటున్నారు!

ఇక్కడ వైసీపీ బాగా కలిసొస్తున్న ఆసక్తికర విషయం ఏమిటంటే... టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మద్దాలి గిరి 2019లో వైసీపీలోకి జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి గుంటూరులోనే ఉంటూ పనిచేస్తున్నారు. దీంతో... ఆయనను జగన్ గుంటూరు నగర అధ్యక్షుడ్ని చేశారు.. గుంటూరులోనే ఉంచారు! దీంతో మద్దాలి గిరి గుంటూరు సిటీ, పశ్చిమ రెండు చోట్లా యాక్టివ్ గా తిరుగుతున్నారు. ఇది వైసీపీకి అదనపు బలంగా ఉంది!

ఇదే క్రమంలో... మంత్రి విడదల రజనీని అందరినీ కలుపుకుంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారని అంటున్నారు. అన్నిటికీ మించి చంద్రబాబు టిక్కెట్ ఇచ్చిన గళ్లా మాధవికి రాజకీయాలు కొత్త కావడంతో.. విడదల రజనీతో పోటీ పడలేక సతమతం అవుతున్నారనే చర్చ బలంగా వినిపిస్తుంది. ఎంతసేపు పక్కనే ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సూచనలపైనే ఆధారపడి ఆమె ప్రచారం చేస్తున్నారనే కామెంట్లూ తదనుగుణంగా వినిపిస్తున్నాయి.

ఇవి చాలవన్నట్లు.. గుంటూరు పశ్చిమలో ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న తెలుగుదేశం నేతలకి చంద్రబాబు టిక్కెట్లు ఇవ్వలేదనే ప్రచారం అన్నింటా వెళ్లిపోయింది. ఎంతసేపు టిక్కెట్లు ఇచ్చేవాళ్లకి డబ్బులున్నాయా..? లేదా..? ఎన్నికల్లో ఖర్చుపెట్టగలరా..? లేదా..? అనే ఆలోచనే తప్ప... స్థానికంగా బలమైన నేతా..? కాదా..? కేడర్ ను కలుపుకుపోగల సత్తా ఉన్న వ్యక్తా..? కాదా..? అనే ఆలోచన చేయలేదని చెబుతున్నారు.

ఇలా అన్నీ కలిపి.. కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు అన్నట్లుగా.. విడదల రజనీకి గుంటూరు వెస్ట్ లో అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి!

Tags:    

Similar News