పాపం పద్మాలు... దూకుడుతోనే ఆమెకు అసలు తంటా.. !
దీంతో టిడిపిలో అసలు ఆమె పేరు లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసిపి నుంచి బయటికి వచ్చిన కర్రి పద్మశ్రీ ఇటీవల టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.;
రాజకీయాల్లో దూకుడు మంచిదే అయినా.. ఒక్కొక్కసారి అదే తంటాలు తీసుకొస్తుంది. ఇలాంటి వారిలో మహిళా నాయకులకు కూడా ఉన్నారు. తద్వారా వాళ్లు సాధించింది ఎలా ఉన్నప్పటికీ పోగొట్టుకున్నదే ఎక్కువగా కనిపిస్తుంది. వాస్తవానికి రాజకీయంగా ఒక రేంజ్ లో ఉండాల్సిన మహిళా నాయకులు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిలో వాసిరెడ్డి పద్మ, ప్రస్తుత ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీలు స్పష్టంగా కనిపిస్తున్నారు.
వైసీపీ హయంలో మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వాసిరెడ్డి పద్మ వ్యవహరించారు. పార్టీలోనూ ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఎంతో మంది ఈ పదవి కోసం ప్రయత్నించినప్పటికీ అప్పటి సీఎం జగన్ వాసిరెడ్డి పద్మకు పెద్దపేట వేశారు. ఇదిలావుంటే.. పలు రాజకీయ కారణాలతో గత ఎన్నికల తర్వాత వాసిరెడ్డి పద్మ వైసిపి నుంచి బయటకు వచ్చారు. పార్టీలు మారడం తప్పు కాకపోయినా వైసిపి నుంచి బయటికి వచ్చిన తర్వాత జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకరకంగా నిప్పులు జరిగారు.
ఇది ఆమెకు ఇబ్బందికర పరిణామంగా మారింది. అనంతర కాలంలో టిడిపిలో చేరతారని ప్రచారం జరిగినప్పటికీ అది సాధ్యం కాలేదు. దీనికి ప్రధాన కారణం ఆమె దూకుడనని తెలుస్తోంది. సాధారణంగా చాలామంది పార్టీలు మారినా వైసీపీపై పెద్దగా విమర్శలు చేయలేదు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు వంటి సీనియర్ నాయకులు కూడా వైసిపి విషయంలో ఒక మాట కూడా అనకుండా బయటికి వచ్చారు. కానీ వాసిరెడ్డి పద్మ మాత్రం నోరు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
దీంతో టిడిపిలో అసలు ఆమె పేరు లేకుండా పోయిందన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసిపి నుంచి బయటికి వచ్చిన కర్రి పద్మశ్రీ ఇటీవల టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అయితే ఆమెకు కూడా ఆశించిన మద్దతు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆమె దూకుడేనని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. స్థానికంగా కర్రి పద్మశ్రీ వ్యవహరించిన తీరు, దూకుడు స్వభావం వంటివి టిడిపితో చర్చనీయాంసంగా మారాయి. దీంతో ఇప్పుడు ఆమె పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే మారింది అన్నది స్పష్టమవుతోంది. మరి భవిష్యత్తు అయిన బాగుంటుందా లేక ఇదే పరిస్థితి కొనసాగుతుందా అనేది చూడాలి.