టీడీపీ మహానాడులో సరికొత్త సంచలనం.. ట్రాన్స్‌జెండర్ వర్షిణికి అరుదైన అవకాశం!
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ‘మహానాడు’ ప్రతినిధుల సభల్లో ఈ సారి ఒక విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది.
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ‘మహానాడు’ ప్రతినిధుల సభల్లో ఈ సారి ఒక విప్లవాత్మక మార్పు చోటుచేసుకుంది. సమాజంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొనే ట్రాన్స్‌జెండర్ వర్గానికి మహానాడు వేదికగా సముచిత స్థానం దక్కింది. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి పిఏగా పనిచేస్తున్న వర్షిణిని సీఎం చంద్రబాబు తన పక్కనే కూర్చొబెట్టుకున్నారు. అంతేకాకుండా మహానాడు వేదికపై మాట్లాడే అరుదైన అవకాశాన్ని కల్పించారు. టీడీపీ చరిత్రలో ఒక ట్రాన్స్‌జెండర్ పార్టీ ప్రధాన వేదికపై ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం విశేషంగా చెబుతున్నారు.
వర్షిణి భావోద్వేగ ప్రసంగం
వేదికపై తనకు వచ్చిన అవకాశాన్ని వర్షిణి చక్కగా వినియోగించుకున్నారు. గత ప్రభుత్వాల పాలనకు, ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. వివక్ష ఎదుర్కొనే తమకు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలోనే గుర్తింపు, గౌరవం దక్కిందని భావోద్వేగం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో 2014-2019 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు.
తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం తమ వర్గాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని వాపోయారు. తమకు దక్కాల్సిన కనీస సౌకర్యాలను కూడా దూరం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ తమ జీవితాల్లో మార్పులు ప్రారంభమయ్యాయని వివరించారు. తమకు గుర్తింపుతో పాటు సమాజంలో గౌరవం దక్కుతోందని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ‘సమాజం మమ్మల్ని చూసే కోణాన్ని మార్చడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది. నాడు చంద్రబాబు గారు మాకు పెన్షన్లు ఇస్తే.. నేడు ఎమ్మెల్యే గళ్లా మాధవి గారు నన్ను పీఏగా పెట్టుకుని సమాజంలో తల ఎత్తుకుని బతికే గౌరవాన్ని ఇచ్చారు.’ అంటూ వర్షిణి ఆనందంగా చెప్పారు.
ఎమ్మెల్యే గళ్లా మాధవిపై ప్రశంసలు
వర్షిణిని కేవలం ఒక కార్యకర్తగానే కాకుండా, తన పర్సనల్ అసిస్టెంట్ (PA)గా నియమించుకుని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి అప్పట్లోనే ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు ఏకంగా మహానాడు వంటి ప్రతిష్టాత్మక వేదికపై వర్షిణికి మాట్లాడే అవకాశం కల్పించడం వెనుక పార్టీ అధిష్ఠానం, స్థానిక నాయకత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ సభలు అంటే కేవలం ఉపన్యాసాలు, విమర్శలకే పరిమితం కాకుండా సమాజంలో వెనుకబడిన, వివక్షకు గురవుతున్న వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడమే నిజమైన సామాజిక న్యాయం అని టీడీపీ ఈ ఘట్టం ద్వారా నిరూపించిందని అభినందిస్తున్నారు. వర్షిణి చేసిన ప్రసంగం మహానాడుకు వచ్చిన ప్రతినిధులను ఎంతగానో ఆకట్టుకోవడమే కాకుండా, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారిందని చెబుతున్నారు.