18 నెలల్లో 18 రోజులు కూడా లేరు! అనిత ర్యాగింగ్ మామూలుగా లేదు

ఐదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహనరెడ్డి.. సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత 18 నెలల కాలంలో 18 రోజులు కూడా రాష్ట్రంలో ఉండలేదని అనిత ఆరోపించారు.;

Update: 2025-12-05 10:58 GMT

మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ప్రతివారం హైదరాబాద్ వెళ్లడాన్ని ఎత్తిచూపుతూ వైసీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా చేస్తున్న ప్రచారంపై అనిత కౌంటరు ఇచ్చారు. ఐదేళ్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహనరెడ్డి.. సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత 18 నెలల కాలంలో 18 రోజులు కూడా రాష్ట్రంలో ఉండలేదని అనిత ఆరోపించారు. పదవి పోయిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలంటూ సవాల్ విసిరారు.

కూటమిలోకి ముగ్గురు ముఖ్యనేతల పర్యటనలు, విమాన చార్జీలపై కొద్దిరోజులుగా వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తోంది. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో లోకేశ్ 77 సార్లు విమాన ప్రయాణాలు చేశారని, పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపిస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వారం వారం హైదరాబాద్ వెళుతున్నారని, రాష్ట్ర ముఖ్య నేతలకు పక్క రాష్ట్రంలో పనేంటని ప్రశ్నిస్తోంది. మంత్రులుగా ఉన్న పవన్, లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రజాధనం వినియోగించడం లేదని చెబుతున్నారని, అయితే ప్రతి వారం రూ.20 లక్షల చొప్పున వారి విమాన చార్జీలు ఎవరు భరిస్తున్నారో చెప్పాలంటూ సవాల్ విసురుతోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా ఎదురుదాడి మొదలుపెట్టింది. జగన్ ఐదేళ్లు సీఎంగా ఉండగా, రూ.222 కోట్లతో గాలి షికార్లు చేశారంటూ ప్రతి విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన హోంమంత్రి అనిత విపక్ష నేతపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ ప్రతివారం బెంగళూరు వెళుతున్న విషయాన్ని ఎత్తిచూపుతూ 18 నెలల్లో 18 రోజులు కూడా రాష్ట్రంలో లేరని అనిత చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చే జరుగుతోంది. విపక్ష నేత జగన్ సైతం ప్రతివారం బెంగళూరు వెళ్లిపోవడాన్ని టీడీపీ ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. శుక్రవారం బెంగళూరు వెళ్లిపోతున్న జగన్ మళ్లీ మంగళవారం తాడేపల్లి వస్తున్నారని, రెండు రోజులు గడిపి మళ్లీ బెంగళూరు వెళ్లిపోతున్నారని టీడీపీ అంటోంది.

ఇలా అధికార, విపక్ష నేతల టూర్లపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ నివాసాలు హైదరాబాదులో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉండవిల్లిలో అధికారిక నివాసం ఉన్నప్పటికీ ఆయన ఎక్కువగా వారాంతాల్లో హైదరాబాదు వెళ్లడాన్ని వైసీపీ ఆక్షేపిస్తోంది. అదే సమయంలో పవన్, లోకేశ్ కూడా వారాంతాల్లో తెలంగాణకు వెళ్లడాన్ని తప్పుబడుతోంది. ఇదే సమయంలో జగన్ కర్ణాటక వెళ్లడంపై టీడీపీ ఎత్తిచూపుతోంది. మొత్తానికి రాష్ట్రానికి చెందిన నలుగురు నేతలు వారంతాల్లో స్థానికంగా ఉండటం లేదన్న విషయంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News