యూపీలో బుల్లెట్ రాజ్.. 8 ఏళ్లలో 15 వేల ఎన్‌కౌంటర్లు
రాష్ట్రంలో గుండా రాజ్ ను అదుపులోకి తీసుకువచ్చేందుకు 2017 నుంచి ఇప్పటివరకు సుమారు 15 వేల ఎన్‌కౌంటర్లు చేసినట్లు డీజీపీ ప్రకటించారు.;
యూపీలో బుల్లెట్ రాజ్యం నడుస్తోందన్న ప్రతిపక్షాల విమర్శలకు మరింత బలం చేకూరుస్తూ డీజీపీ రాజీవ్ కృష్ణ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో గుండా రాజ్ ను అదుపులోకి తీసుకువచ్చేందుకు 2017 నుంచి ఇప్పటివరకు సుమారు 15 వేల ఎన్‌కౌంటర్లు చేసినట్లు డీజీపీ ప్రకటించారు. ఇదులో 238 మంది రౌడీలు, గుండాలు మరణించగా, 9,467 మంది గాయపడినట్లు డీజీపీ వెల్లడించారు. దీంతో యోగి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విపక్షానికి సరైన అస్త్రం లభించినట్లైంది. శాంతిభద్రతల అదుపు పేరిట బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే యోగి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉత్తరప్రదేశ్ అత్యంత సురక్షిత రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని ప్రభుత్వం చెబుతోంది.
డీజీపీ ప్రకటనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విపక్షాల విమర్శలు ఎలా ఉన్నప్పటికి ఆటవిక సంస్కృతికి చరమ గీతం పాడేలా యోగి ప్రభుత్వం రౌడీలపై కఠిన వైఖరి అవలంభించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యోగి అధికారంలోకి వచ్చాక పలువురు రౌడీలు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. మరికొందరు పేరుమోసిన రౌడీలు, రాజకీయ నేతల ముసుగు వేసుకున్న క్రిమినల్స్ ను ఏరిపారేశారని చెబుతున్నారు.
2017లో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యేనాటికి ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతల సమస్య ఘోరంగా ఉండేదని చెబుతారు. ఈ పరిస్థితులను రూపుమాపేందుకు సీఎం యోగి కఠిన చర్యలు తీసుకున్నారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతోపాటు అదనపు బలం కోసం కొత్త నియామకాలు చేపట్టారు. రౌడీయిజం చేసే వారిని నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేయమని ఆదేశించడంతో గత 8 ఏళ్లలో సుమారు 15 వేల ఎన్‌కౌంటర్లు జరిగినట్లు ప్రభుత్వ గణంకాలు చెబుతున్నాయి. ‘క్రైమ్‌కు జీరో టాలరెన్స్’ కోసం తరచుగా వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా క్షేత్ర స్థాయి పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేరుగా సంభాషించి, స్పష్టమైన ఆదేశాలిచ్చేవారు. దీంతో రౌడీమూకలు తోక ముడిచినట్లు చెబుతున్నారు. ప్రభుత్వ చర్యలతో మొత్తం 30,694 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అరెస్టు అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.