ఇరాన్ పై దాడి చేసే దమ్ము అమెరికాకు ఉందా? ట్రంప్ వి ఉత్తమాటలేనా?
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గతేడాది ఇజ్రాయెల్ జరిపిన దాడి తర్వాత ఇరాన్-అమెరికా మధ్య సంబంధాలు అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి.;
మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. గతేడాది ఇజ్రాయెల్ జరిపిన దాడి తర్వాత ఇరాన్-అమెరికా మధ్య సంబంధాలు అత్యంత క్లిష్ట దశకు చేరుకున్నాయి. అయితే ఈ సంక్షోభంలో ఇటు అమెరికాకు.. అటు ఇజ్రాయెల్‌కు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆశించిన రీతిలో అనుకూలించకపోవడం గమనార్హం.
మిత్రదేశాల విముఖత.. అమెరికాకు తప్పని వెనకడుగు
గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు బలమైన మిత్రదేశాలు ఉన్నప్పటికీ ఇరాన్‌పై నేరుగా దాడి చేసే విషయంలో అవి సముఖత చూపడం లేదు. ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు తమ భూభాగం నుంచి ఇరాన్‌పై దాడులు చేయడానికి విముఖత వ్యక్తం చేశాయి. ఇరాన్ ప్రతీకార దాడులకు దిగితే తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయనే భయం ఈ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఇజ్రాయెల్-అమెరికా కూటమి కాల్పుల విరమణకు అంగీకరించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.
ట్రంప్ ప్లాన్-బి కూడా అమలు చేయడానికి రెడీ అవుతున్నారు. నేరుగా సైనిక దాడి చేయడం కంటే, ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోవడమే ఉత్తమమని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ అంతటా ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. ఇస్లామిక్ విప్లవం తర్వాత దేశం విడిచిన రేజా పహ్లావీ మళ్లీ తెరపైకి రావడం, నిరసనకారులకు మద్దతు తెలపడం వెనుక పాశ్చాత్య దేశాల హస్తం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. వెనెజులాలో మదురోపై అనుసరించిన కఠిన వ్యూహాలనే ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీపై కూడా అమలు చేస్తామని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి.
ప్రత్యక్ష దాడి సాధ్యమేనా?
అమెరికా ఇరాన్‌పై దాడి చేయాలంటే ఎదురయ్యే ప్రధాన సవాళ్లున్నాయి. మిత్రదేశాల సహకారం లేనిదే ఇరాన్ వంటి పటిష్ట రక్షణ వ్యవస్థ ఉన్న దేశాన్ని ఢీకొట్టడం కష్టమని అమెరికాకు తెలుసు. పట్టణ ప్రాంతాలపై దాడులు జరిగితే పౌర నష్టం జరిగి, అమెరికాపై ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ దాడి జరిగితే ఇరాన్ ప్రజలు తమ అంతర్గత విభేదాలను మర్చిపోయి ప్రభుత్వానికి అండగా నిలబడే ప్రమాదం ఉంది. ఇది ప్రస్తుత నిరసనలను నీరుగారుస్తుంది.
ఇది కేవలం మాటల యుద్ధమేనా?
ప్రస్తుతానికి ట్రంప్ చేస్తున్న హెచ్చరికలు కేవలం ఇరాన్‌పై మానసిక ఒత్తిడి పెంచడానికే పరిమితమైనట్లు కనిపిస్తున్నాయి. అటు సైనిక సహకారం లేకపోవడం ఇటు ఆర్థిక పరిణామాలు అమెరికాను వెనక్కి లాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇవి 'నిజమైన యుద్ధ సంకేతాల' కంటే అంతర్జాతీయ రాజకీయ చదరంగంలో భాగంగా చేస్తున్న వ్యూహాత్మక హెచ్చరికలే అని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.