పార్లమెంటులో పొట్టు పొట్టు కొట్టుకున్నారు.. వీడియో వైరల్!
వాస్తవానికి గుర్లెక్ గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన సమయంలో... ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సభ్యులకు సంబంధించిన అనేక హైప్రొఫైల్ కేసులను పర్యవేక్షించారట.;
సాధారణంగా భారతదేశంలోని పార్లమెంట్ తో పాటు పలు రాష్ట్రాల శాసనసభల్లోనూ విపక్ష సభ్యుల నిరసనలు గరిష్టంగా నినాదాలు చేయడం, స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం, కాగితాలు చింపి విసరడం చేస్తుంటారు. మరికొంతమంది మరో అడుగు ముందుకేసి నీతిమాలిన సంజ్ఞలు చేస్తుంటారు! గరిష్టంగా జరిగేవి ఇవే!! కానీ తాజాగా టర్నీ పార్లెమెంటులో మాత్రం అధికార, విపక్ష సభ్యులు పిడి గుద్దులు గుద్దుకుంటూ పొట్టూ పొట్టూ కొట్టుకున్నారు.
అవును... తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్... అకిన్ గుర్లెక్ ను కొత్త న్యాయశాఖ మంత్రిగా నియమించారు. ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అయిన ఈయన నియామకాన్ని ప్రతిక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆయన పక్షపాత రాజకీయంతో ఉన్నారని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఆయన ప్రమాణస్వీకారానికి సిద్ధమవ్వగా... దాన్ని అడ్డుకునేదుకు ప్రతిపక్షాలు పోడియం వద్దకు దూసుకొచ్చాయి! ఈ సమయంలో అధికార, విపక్ష సభ్యుల మధ్య ఘర్షణ నెలకొంది.
ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారడంతో ప్రమాణ స్వీకారాన్ని స్పీకర్ తాత్కాలికంగా నిలివేశారు. ఈ క్రమంలో తిరిగి ఓ 15 నిమిషాల తర్వాత సభ మళ్లీ ప్రారంభమవ్వగా... అధికార పార్టీ నేతలు గుర్లేక్ చుట్టూ రక్షణగా నిలబడి మరీ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ స్థాయిలో గుర్లేక్ ను వ్యతిరేకించడం వెనుక బలమైన కారణాలున్నాయని అంటున్నారు. అందులో ఒకటి.. గతంలో ఆయన చేసిన పక్షపాత పనులని అంటున్నారు!
వాస్తవానికి గుర్లెక్ గతంలో ఇస్తాంబుల్ చీఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసిన సమయంలో... ప్రధాన ప్రతిపక్షమైన రిపబ్లికన్ పీపుల్స్ పార్టీ సభ్యులకు సంబంధించిన అనేక హైప్రొఫైల్ కేసులను పర్యవేక్షించారట. ఈ సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకోవడానికే ఈ నియమాకం చేపట్టారని.. ఇది న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను దెబ్బతీస్తుందని ఆరోపిస్తున్నారు!
కాగా ఇటీవల కాలంలో ప్రతిపక్ష రిపబ్లికన్ పీపుల్స్ పార్టీతో అనుబంధంగా ఉన్న వందలాదిమంది స్థానిక అధికారులను ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ దర్యాప్తుల్లో చిక్కుకున్న వారిలో ఇస్తాంబుల్ మేయర్ ఎక్రెమ్ ఇమామోగ్లు కూడా ఉన్నారు. ఆయనను తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఎర్డోగాన్ విస్తృతంగా భావిస్తారు. ఈయనను గత ఏడాది నవంబర్ లో అరెస్ట్ చేయగా.. ఈయనపై గుర్లెక్ 142 అభియోగాలు మోపారు!
పైగా ఈయనకు 2,000 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు కోరడంతో ఈ విషయం స్వదేసంతో పాటు విదేశాల్లోనూ విస్తృతంగా చర్చనీయాంశం కావడమే కాదు.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. అలాంటి గుర్లెక్ ను న్యాయశాఖ మంత్రిగా నియమించడాన్ని ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి!