లైవ్ అప్ డేట్స్ ... జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు బిగ్ విక్టరీ!
ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు బీహార్ లోనూ ఎన్నికల ఫలితాల సందడి మొదలైంది.;
ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ, అటు బీహార్ లోనూ ఎన్నికల ఫలితాల సందడి మొదలైంది. ఇందులో భాగంగా... యూసుఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. ఈ నేపథ్యంలో లెక్కింపు కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వచ్చేస్తుందని అధికారులు వెల్లడించారు. మరోవైపు బీహార్ లోనూ కౌంటింగ్ మొదలైంది. ఈ రెండు ఎన్నికల ఫలితాలకు సంబంధించిన లైవ్ అప్ డేట్స్ కోసం తుపాకీ.కామ్ ఫాలో అవ్వండి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నిమో (నితేశ్ - మోడీ) కాంబోలోని ఎన్డీయే కూటమి సూపర్ విక్టరీ దిశగా దూసుకెళ్తోంది. ఇందులో భాగంగా... ఎన్డీయే కూటమి అభ్యర్థులు 200 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇందులో భాగంగా... బీజేపీ - 90, జేడీయూ - 81, ఎల్‌జేపీ (ఆర్ వీ) 23, హెచ్‌ఏఎం (ఎస్) - 4, ఆర్‌ఎల్‌ఎం - 3 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తున్నాయి.
మరోవైపు 38 స్థానాల్లో (ఆర్జేడీ - 29, కాంగ్రెస్ - 4) మహాగఠ్ బంధన్ ముందంజలో ఉండగా... 5 స్థానాల్లో ఇతరులకు ఆధిక్యంలో ఉన్నారు. దీంతో... ఐదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యదవ్ ఘన విజయం సాధించారు. ఇందులో భాగంగా బీఆరెస్స్ అభ్యర్థి మాగంటి సునీతపై 25వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. కౌంటింగ్ మొదలైనప్పటి నుంచీ ప్రతి రౌండ్ లోనూ నవీన్ యాదవ్ ఆధిక్యం ప్రదర్శించారు. దీంతో.. అటు నవీన్ యాదవ్ ఇంటి వద్ద, అటు గాంధీభవన్ లోనూ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
ఈ నేపథ్యంలో సాయంత్రం మంత్రులతో భేటీ అయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ ఉండనుంది!
మరోవైపు... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోయిన నేపథ్యంలో నందినగర్ నివాసంలో పార్టీ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. తాజా ఫలితంపై పార్టీ నాయకులతో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి నిర్ణయాత్మక విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ తన దాడిని తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగా... గత రెండు దశాబ్దాలలో రాహుల్ గాంధీ 95 ఎన్నికల ఓటములను చూపించే మ్యాప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇది కాస్తా వైరల్ గా మారుతోంది!
బీజేపీ ఐటీ సెల్ అమిత్ మాల్వియా ఈ మేరకు 2004 నుండి 2025 వరకు జరిగిన ఎన్నికల వివరాలను గ్రాఫిక్ పోస్ట్ చేశారు. అందులో రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ రాష్ట్ర అధికారాన్ని కోల్పోయిన విషయాలను పొందుపరిచారు! "రాహుల్ గాంధీ! మరో ఎన్నిక, మరో ఓటమి!” అని మాల్వియా రాశారు.
కాగా... తాజా అప్ డేట్స్ ప్రకారం ఎన్డీయే కూటమిలో బీజేపీ 84, జెడి(యు) 76, చిరాగ్ పాశ్వాన్ కు చెందిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) 23, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్తానీ అవామ్ మోర్చా 4, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
మరోవైపు.. ప్రతిపక్ష మహాఘఠ్ బంధన్ 49 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇందులో.. ఆర్జేడీ 34, కాంగ్రెస్ 6, సీపీఐ(ఎంఎల్)(ఎల్) 6, సీపీఎం ఒక స్థానంలో ముందంజలో ఉన్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ నుంచీ ఆధిపత్యం కనబరిచిన ఆయన... ఎనిమిదో రౌండ్ లోనూ భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఇందులో భాగంగా... ఎనిమిది రౌండ్లు పూర్తయ్యే సరికి 23 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.
ఇలా తమ అభ్యర్థికి స్పష్టమైన మెజారిటీ వస్తోన్న నేపథ్యంలో... గాంధీ భవన్ వద్ద సంబరాలు మొదలైపోయాయి. మరోవైపు నవీన్ యాదవ్ ఇంటి వద్ద శ్రేణులు సందడి చేస్తున్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించే దిశగా ఫలితాలు వెలువడుతోన్న నేపథ్యంలో.. నితీశ్ - మోడీ (నిమో) సూపర్ పెర్ఫార్మెన్స్ గురించిన చర్చతో పాటు మరో యంగ్ లీడర్ గురించిన చర్చ ఆసక్తిగా మారింది. ఆయనే... లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్. 2020లో.. అప్పటి ఎల్‌జెపి, జెడియు చీఫ్ నితీష్ కుమార్ తో విభేదాల కారణంగా స్వతంత్రంగా పోటీ చేసి.. పోటీ చేసిన 130 సీట్లలో ఒకదాన్ని మాత్రమే గెలుచుకున్న ఈ పార్టీ ఈ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతోంది!
గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ విజయం సాధించిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్).. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 29 స్థానాల్లోనూ 22 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇలా సుమారు 75% స్ట్రైక్ రేట్ తో దూసుకుపోతుండటంతో.. యంగ్ లీడర్ చిరాగ్ పాస్వాన్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.
వాస్తవానికి బీహార్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన నేతగా పరిగణించబడే తన తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆకర్షణ, రాజకీయ చతురత చిరాగ్ కు లేదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ, వారి అంచనాలను తలకిందులు చేస్తూ 43 సంవత్సరాల వయస్సులో చిరాగ్ తనను తాను యువ నాయకుడిగా నిలబెట్టుకున్నారు!
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది. ప్రస్తుతం వెలువడుతోన్న ఫలితాల సరళి ప్రకారం.. 192 స్థానాల్లో ముందంజలో ఎన్డీయే కూటమి ఉంది. మరోవైపు మహాగఠ్ బంధన్ కూటమి 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఈ సరళి ఇలానే కొనసాగితే ఎన్డీయే కూటమికి భారీ విజయం కన్ఫాం! ఇక.. 5 చోట్ల ఇతరులకు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
దీంతో... జేడీయూ కార్యాలయం ఎదుట సంబరాలు మొదలైపోయాయి. ఇందులో భాగంగా... కార్యకర్తలు, నేతలు బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా... నితీశ్ కుమార్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారంటూ జేడీయూ నేతలు ఆనందం వ్యక్తం చేస్తోన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తొలి రౌండ్ నుంచి ఆధిక్యంలో దుసుకుపోతున్నారు. ఇదే క్రమంలో ఏడో రౌండ్ ముగిసే సరికి 19,619 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు.
మరోవైపు.. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వస్తోన్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు!
బీహార్ ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా ఎన్డీయే కూటమి దూసుకుపోతున్నట్లు తాజా ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ పరిస్థితి 2020లో కంటే మరీ దారుణంగా మారడం గమనార్హం! ఇక ఎంఐఎం విషయానికొస్తే.. గత ఎన్నికలతో పోలిస్తే ఫలితాలు మరింత నీరసంగా ఉన్నాయని తెలుస్తోంది. వాస్తవానికి గత ఎన్నికల్లో ఆ పార్టీ అద్భుత ప్రదర్శన చేసి ఐదు స్థానాలను గెలుచుకుంది.
ఆ ఐదు స్థానాలూ అరారియా, కతిహార్, కిషన్ గంజ్, పూర్నియా అనే నాలుగు జిల్లాలతో కూడిన సీమాంచల్ ప్రాంతంలోవి కాగా... ఈ ప్రాంతంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండటంతో ఈసారీ ఆశలు పెద్దగానే పెట్టుకొంది! అయితే, ఈ దఫా ఆ పార్టీ ఈ ప్రాంతంలో కేవలం రెండు స్థానాల్లోనే ఆధిక్యంలో ఉంది! ఆ రెండు స్థానాలు కతిహార్ జిల్లాలోని బలరాంపూర్, పూర్నియాలోని బైసి.
కాగా... 2020 ఎన్నికల్లో గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేలలో నలుగురు ఆర్జేడీలోకి ఫిరాయించగా.. అమౌర్ నుండి గెలిచిన అఖ్తరుల్ ఇమాన్ మాత్రమే పార్టీలోనే ఉన్నారు. అయితే తాజాగా ఇమాన్ ఇప్పుడు ఆ స్థానం నుండి ఓడిపోతున్నారని తెలుస్తోంది!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మొదటి రౌండ్ నుంచీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రౌండ్ రౌండ్ కు మెజార్టీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు గాంధీ భవన్ లోనూ సంబరాలు స్టార్ అయిపోయాయి. ఈ క్రమంలో కాసేపట్లో మంత్రులు గాంధీ భవన్ కు చేరుకోనున్నారని తెలుస్తోంది.
ఈ సందర్భంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్... అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మంచి మెజార్టీ వస్తుందని తెలిపారు! మరోవైపు ఆరో రౌండ్ లోనూ నవీన్ యాదవ్ దే పైచేయి అయ్యింది. ప్రస్తుతం ఆయన 15వేలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు!
బీహార్ లోని భోజ్ పూర్ బెల్ట్ లో మహాఘఠ్ బంధన్ కు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే గట్టి సవాలు విసురుతోంది. వాస్తవానికి భోజ్ పూర్ బెల్ట్ ను ఆర్జేడీకి బలమైన కోటగా భావిస్తారు. అయితే ఇప్పుడు లెక్కలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతంలోని 49 సీట్లలో 30 సీట్లలో ఎన్డీయే ముందంజలో ఉండగా.. మహాఘఠ్ బంధన్ 17 సీట్లలో ఆధిక్యంలో ఉంది! కాగా... 2020 ఎన్నికల్లో భోజ్ పూర్ బెల్ట్ లో మహాఘఠ్ బంధన్ ఆధిపత్యం చెలాయించింది.
వాస్తవానికి.. రాజధాని పాట్నాకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో గట్టి పోటీ ఉంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఇందులో భాగంగా... ఎన్డీయేకు 27 సీట్లు, మహాఘఠ్ బంధన్ కు 21 సీట్లు వస్తాయని అంచనా వేశాయి.
భోజ్ పూర్ లో 57% కంటే ఎక్కువ పోలింగ్ నమోదు కాగా.. వృద్ధ ఓటర్లు, మహిళలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో... ఇటీవల నితీశ్ కుమార్ చేపట్టిన ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన కింద మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10,000 బదిలీ వ్యవహారం ఈ ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.